హేమంత్​ సోరెన్​ అరెస్ట్​ .. జార్ఖండ్​ కొత్త సీఎంగా చంపయీ సోరెన్

హేమంత్​ సోరెన్​ అరెస్ట్​  ..  జార్ఖండ్​ కొత్త సీఎంగా చంపయీ సోరెన్

రాంచీ: భూకుంభకోణం కేసులో జార్ఖండ్ ముక్తి మోర్చా(జేఎంఎం) నేత, సీఎం హేమంత్ సోరెన్ అరెస్ట్ అయ్యారు. రాంచీలో బుధవారం మధ్యాహ్నం నుంచి విచారించిన ఎన్​ఫోర్స్​మెంట్​ డైరెక్టరేట్(ఈడీ) అధికారులు రాత్రి 9.33 గంటలకు అదుపులోకి తీసుకున్నారు. దీంతో ముందస్తుగా అనుకున్న ప్రకారం.. జేఎంఎం సీనియర్ నేత, ట్రాన్స్ పోర్ట్ మినిస్టర్ చంపయీ సోరెన్​ను సంకీర్ణ కూటమి ఎమ్మెల్యేలు పార్టీ శాసనసభా పక్ష నేతగా ఎన్నుకున్నారు. హేమంత్ అరెస్ట్ తర్వాత చంపయీ సోరెన్ రాష్ట్ర గవర్నర్ సీపీ రాధాకృష్ణన్ ను కలిశారు. తనకు 47 మంది ఎమ్మెల్యేల మద్దతు ఉందని, ప్రభుత్వ ఏర్పాటుకు ఆహ్వానించాలని కోరుతూ లేఖను అందజేశారు.

 అయితే, మూడుసార్లు సమన్లకు స్పందించకపోతే సీఎంను కూడా అరెస్ట్ చేసే అధికారం ఈడీకి ఉంటుంది. సోరెన్ ఇప్పటికే ఏడుసార్లు సమన్లను ఉల్లంఘించడంతో ఆయన అరెస్ట్ ఖాయమైంది. ఈ నేపథ్యంలో సీఎం పదవికి రాజీనామా చేసిన తర్వాతే అరెస్ట్ మెమోపై సంతకం పెడతానని సోరెన్ మొండికేయడంతో ఈడీ అధికారులు ఆయనను రాజ్ భవన్​కు తీసుకెళ్లారు. 

గవర్నర్​కు సోరెన్ తన రాజీనామా లేఖను అందజేసిన కొన్ని నిమిషాలకే అధికారులు ఆయనను అరెస్ట్ చేశారు. సోరెన్​ను గురువారం కోర్టులో ప్రవేశపెట్టి, అనంతరం కస్టడీలోకి తీసుకోనున్నారు. ప్రభుత్వ భూములను అక్రమంగా ప్రైవేట్ వ్యక్తుల పేరిట మార్చి.. రూ. 600 కోట్ల కుంభకోణానికి పాల్పడ్డారని నమోదైన ఈ కేసులో మనీలాండరింగ్ కోణంలో ఈడీ దర్యాప్తు చేస్తోంది. ఈ కేసులో ఇప్పటివరకూ ఒక ఐఏఎస్ ఆఫీసర్ సహా 14 మంది అరెస్ట్ అయ్యారు. 

కాగా, సోరెన్ సోమవారం ఉదయం ఢిల్లీ నుంచి ఈడీ అధికారుల కండ్లుగప్పి రోడ్డు మార్గంలో మంగళవారం మధ్యాహ్నం రాంచీకి చేరుకున్నారు. సంకీర్ణ కూటమి ఎమ్మెల్యేలతో భేటీ అయ్యారు. దీంతో సోరెన్ అరెస్ట్ ఖాయమని.. కొత్త సీఎం ఎంపికపైనే చర్చలు జరిగాయని వార్తలు వచ్చాయి. సోరెన్ భార్య కల్పనా సోరెన్ కొత్త సీఎం అవుతారని తొలుత భావించారు. కానీ అసెంబ్లీకి నవంబర్​లోనే ఎన్నికలు జరగనున్నాయి. ఆలోగా ఉప ఎన్నికలు జరిగే అవకాశం లేనందున ఆమె సీఎంగా కొనసాగే వీలుండదని విరమించుకున్నట్లు తెలిసింది.

ఈడీ అధికారులపై అట్రాసిటీ కేసు

ఢిల్లీలోని తన నివాసంలో 36 లక్షల క్యాష్, బీఎండబ్ల్యూ కారును స్వాధీనం చేసుకున్న ట్లు ఈడీ అధికారులు తప్పుడు ప్రచారం చేశారని సోరెన్ కేసు పెట్టారు.