
- నేటి నుంచి మూడ్రోజులు విచారణ
- ఇన్వెస్ట్‌మెంట్ల పేరుతో రూ.792 కోట్లు మోసం చేసిన ఫాల్కన్
హైదరాబాద్, వెలుగు: ఫాల్కన్ ఇన్‌వాయిస్ డిస్కౌంటింగ్ స్కీమ్ స్కామ్ కేసులో ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్(ఈడీ) దర్యాప్తు ముమ్మరం చేసింది. ఈ కేసులో ప్రధాన నిందితుడు అమర్‌దీప్ కుమార్ సోదరుడైన సందీప్ కుమార్‌ను ఈడీ అధికారులు బుధవారం కస్టడీలోకి తీసుకోనున్నారు. ఈడీ అభ్యర్థన మేరకు నాంపల్లిలోని పీఎంఎల్‌ఏ స్పెషల్ కోర్టు మంగళవారం ఆదేశాలు జారీ చేసింది. బుధవారం నుంచి శుక్రవారం సాయంత్రం వరకు కస్టడీలోకి తీసుకుని విచారించేందుకు అనుమతి ఇచ్చింది. తెలంగాణ సీఐడీ కేసులో బెయిల్‌పై విడుదలైన సందీప్ కుమార్‌ను గత నెల 31న ఈడీ అదుపులోకి తీసుకుంది.
కోర్టులో హాజరుపరిచి రిమాండ్‌కు తరలించింది. చంచల్‌గూడ సెంట్రల్ జైలులో రిమాండ్ ఖైదీగా ఉన్న అతడిని కస్టడీలోకి తీసుకునేందుకు కోర్టు అనుమతి కోరింది. కోర్టు అనుమతి తర్వాత నిందితుడిని బషీర్‌బాగ్‌లోని ఈడీ ఆఫీస్‌కు తరలించి మూడు రోజుల పాటు ప్రశ్నించనున్నారు. బ్రిటానియా, అమెజాన్, గోద్రేజ్ సహా ప్రముఖ కంపెనీల్లో ఇన్వెస్ట్‌మెంట్ల పేరుతో ఫాల్కన్ క్యాపిటల్ ప్రొటెక్షన్ ఫోర్స్ రూ.792 కోట్లు మోసం చేసిన సంగతి తెలిసిందే.
సైబరాబాద్ ఈఓడబ్ల్యూ నమోదు చేసిన ఎఫ్‌ఐఆర్ ఆధారంగా ఈడీ మనీ లాండరింగ్ కోణంలో దర్యాప్తు చేసింది. ఇప్పటికే ఫాల్కన్ అనుబంధ సంస్థ క్యాపిటల్ ప్రొటెక్షన్ ఫోర్స్‌కు చెందిన రూ.18.14 కోట్ల విలువైన 12 స్థిరాస్తులను అటాచ్ చేసింది. ఇందులో సందీప్ కుమార్‌కు చెందిన రూ.7.64 కోట్లు విలువైన ఆస్తులు ఉన్నట్లు ఈడీ గుర్తించింది. ఫాల్కన్, క్యాపిటల్ ప్రొటెక్షన్ ఫోర్స్ పేరుతో దేశవ్యాప్తంగా 6,979 మంది నుంచి రూ.1,700 కోట్లు వసూలు చేశాయి.