పట్రా చాల్​ కేసు.. రౌత్ ఇంట్లో ఈడీ సోదాలు

 పట్రా చాల్​ కేసు.. రౌత్ ఇంట్లో ఈడీ సోదాలు

ముంబై:  శివసేన ఎంపీ సంజయ్​ రౌత్​ను ఎన్​ఫోర్స్​మెంట్ ​డైరెక్టరేట్(ఈడీ) అధికారులు అదుపులోకి తీసుకున్నారు. పట్రా చాల్​ ల్యాండ్ ​స్కామ్ ​కేసులో అధికారులు ఆదివారం ఆయన ఇంటికి చేరుకుని సోదాలు నిర్వహించారు. అనంతరం సంజయ్​ను ప్రశ్నించి అదుపులోకి తీసుకున్నారు. మనీ లాండరింగ్​కు కేసులో విచారణకు హాజరు కావాలని ఈడీ ఇంతకుముందు రెండుసార్లు ఆయనను ఆదేశించినా గైర్హాజరయ్యారు. దీంతో  అధికారులు ఆదివారం ఉదయం ఏడు గంటలకు సీఐఎస్ఎఫ్ ​బలగాలను వెంటపెట్టుకుని  ముంబైలోని ఆయన ఇంటికి చేరుకుని సోదాలు చేశాయి. పట్రా చాల్ ​కేసులో విచారించేందుకు ఆయనను అదుపులోకి తీసుకున్నాయి.

అయితే తాను ఏ తప్పూ చేయలేదని, రాజకీయ కక్షతోనే కేంద్రంలోని మోడీ ప్రభుత్వం తనను టార్గెట్​గా చేసుకుందని సంజయ్​ అన్నారు. ‘‘అన్నీ తప్పుడు సాక్ష్యాలే. ఈ స్కామ్​కు, నాకు సంబంధం లేదు. శివసేన ఫౌండర్ బాలాసాహెబ్​ థాక్రేపై ఒట్టేసి చెబుతున్నా. చచ్చినా శివసేనను వదలను. కేంద్రానికి లొంగను. శివసేన కోసం పోరాడాలని థాక్రే మాకు నేర్పారు” అని సంజయ్ ట్వీట్​ చేశారు. ఈడీ అధికారులు తన ఇంటికి చేరుకున్న కాసేపటికే రౌత్​ ఈ ట్వీట్ చేశారు.​ తమ లీడర్ ​సంజయ్​ను ఈడీ అరెస్టు చేసే అవకాశం ఉందని శివసేన ప్రెసిడెంట్​ఉద్ధవ్​ థాక్రే అన్నారు. తమ పార్టీని అంతం చేసేందుకు కుట్ర జరుగుతోందని ఆయన ఆరోపించారు. కాగా, ‘‘మీరు (సంజయ్) ఏ తప్పూ చేయకుంటే ఈడీని చూసి ఎందుకు భయపడుతున్నరు?” అని మహారాష్ట్ర సీఎం ఏక్​నాథ్​ షిండే ప్రశ్నించారు.

ఏంటీ పట్రా చాల్​ కేసు? 

మహారాష్ట్ర హౌసింగ్​ఏరియా డెవలెప్​మెంట్​అథారిటీ (ఎంహెచ్ఏడీఏ) కి చెందిన భూమిలో ఉంటున్న 672 మంది నిర్వాసితులకు ఫ్లాట్లు కట్టించి ఇచ్చేందుకు గతంలో హెచ్​డీఐఎల్ అనుబంధ సంస్థ గురు ఆశిష్​కన్​స్ట్రక్షన్స్(జీఏసీ) ఒప్పందం కుదుర్చుకుంది. అయితే నిర్వాసితులకు ఫ్లాట్లు కట్టకుండా.. జీఏసీ ఆ భూమిని విక్రయించింది. రూ.1,039.79 కోట్ల మేరకు అక్రమాలకు పాల్పడింది. హెచ్​డీఐఎల్2,700 కోట్ల లోన్​ ఫ్రాడ్ చేసింది. ఇందులో జీఏసీ మాజీ డైరెక్టర్ ప్రవీణ్ రౌత్ కు రూ.100 కోట్లు ముట్టాయి. ఆ డబ్బును అతను కుటుంబసభ్యులకు బదిలీ చేశాడు. ప్రవీణ్ భార్య మాధురి సంజయ్ రౌత్ భార్య వర్షా రౌత్​కు 2010లో 83 లక్షలు ట్రాన్స్ ఫర్ చేసింది. ఈ డబ్బుతో వర్ష దాదర్​లో ఫ్లాట్ కొన్నారు. తర్వాత వర్ష అకౌంట్ నుంచి మాధురి అకౌంట్ కు రూ. 55 లక్షలు బదిలీ అయ్యాయి. ఈ ఏడాది ఏప్రిల్​లో వర్ష, ప్రవీణ్​రౌత్​కు సంబంధించిన రూ.11.8 కోట్ల ప్రాపర్టీలను ఈడీ అటాచ్ చేసింది. ఇందులో సంజయ్​రౌత్ ​పాత్ర గురించి తెలుసుకునేందుకు ఈడీ తాజాగా సోదాలు చేసింది.