- చంపుతామని బెదిరింపులు, కిడ్నాపులకు పాల్పడినట్టు గుర్తింపు
- పోలీసుల ఎఫ్‌ఐఆర్‌ల ఆధారంగా ఈడీ దర్యాప్తు
- రంగారెడ్డి జిల్లా స్పెషల్ కోర్టులో చార్జ్షీట్ దాఖలు చేసిన ఈడీ
హైదరాబాద్, వెలుగు: గ్యాంగ్ స్టర్ నయీం అక్రమంగా కూడబెట్టిన ఆస్తుల కేసులో ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్(ఈడీ) చార్జ్షీట్దాఖలు చేసింది. కిడ్నాపులు, చంపుతామని బెదిరింపులతో నయీంతోపాటు అతడి అనుచరులు బలవంతంగా 91 ఆస్తులను రిజిస్ట్రేషన్ చేయించుకున్నట్లు కోర్టుకు తెలిపింది. జప్తు చేసిన ఆస్తులను కేంద్ర ప్రభుత్వానికి అప్పగించాలని కోరింది. ఈ మేరకు రంగారెడ్డి జిల్లా కోర్టు కాంప్లెక్స్‌లోని ఈడీ స్పెషల్ కోర్టులో గత వారం ఈడీ చార్జ్షీట్దాఖలు చేసింది.
నిందితులు పాశం శ్రీనివాస్, హసీనా బేగం, మహ్మద్ తాహెరా బేగం, మహమ్మద్ సలీమా బేగం, మహ్మద్ అబ్దుల్ సలీమ్, అహేలా బేగం, సయ్యద్ నీలోఫర్, ఫిర్దౌస్ అంజుమ్, మహ్మద్ ఆరిఫ్, హీనా కౌసర్‌పై మనీలాండరింగ్ యాక్ట్ కింది అభియోగాలు నమోదు చేసింది. ఈడీ దాఖలు చేసిన ప్రాసిక్యూషన్ కంప్లైంట్‌ను కోర్టు విచారణకు స్వీకరించింది. ఇందుకు సంబంధించిన వివరాలను హైదరాబాద్ జోనల్ ఈడీ కార్యాలయం బుధవారం వెల్లడించింది.
బెదిరింపులు, కిడ్నాపులతో సేల్ డీడ్స్, రిజిస్ట్రేషన్లు
రాష్ట్రంలో మోస్ట్ వాంటెడ్ గ్యాంగ్‌స్టర్ ఖాజా నయీముద్దీన్ అలియాస్ నయీం 2016 ఆగస్టులో షాద్‌నగర్‌లో జరిగిన ఎన్‌కౌంటర్‌లో మృతి చెందిన సంగతి తెలిసిందే. అనంతరం నయీం, అతడి అనుచరులు బెదిరింపులతో ఆక్రమించిన భూములకు సంబంధించి తెలంగాణ పోలీసులు 175కు పైగా కేసులు నమోదు చేశారు. వీటి ఆధారంగా ఈడీ మనీలాండరింగ్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేసింది. స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీమ్ (సిట్) నుంచి ఆధారాలు తీసుకుంది.ఈ క్రమంలోనే నయీం, హసీనా బేగం, తహెరా బేగం సహా పలువురిపై బినామీ ఆస్తుల నిషేధ చట్టం కింద జప్తు చేసిన ఆస్తుల డాక్యుమెంట్లను ఇన్‌కమ్ ట్యాక్స్ డిపార్ట్‌మెంట్ నుంచి సేకరించింది. నయీం అండదండలతో అక్రమాలకు పాల్పడిన అబ్దుల్ ఫహీమ్, హసీనా, శ్రీనివాస్, మహ్మద్ అబ్దుల్ నసీర్, శ్రీనివాస్, బి శ్రవణ్ కుమార్, సతీష్ రెడ్డి విక్రయించిన ఆస్తులను గుర్తించింది.
10 మంది పేర్లపై 91 ఆస్తులు అక్రమ రిజిస్ట్రేషన్లు, జప్తు
తెలంగాణ పోలీసులు, సిట్, ఇన్‌కమ్ ట్యాక్స్ డిపార్ట్‌మెంట్ నుంచి సేకరించిన స్థిరాస్తి డాక్యుమెంట్ల ఆధారంగా ఈడీ దర్యాప్తు చేసింది. బలవంతంగా సేల్ డీడ్స్‌తో రిజిస్ట్రేషన్ చేయించడం ద్వారా అక్రమంగా సంపాదించిన ఆస్తులను చట్టబద్ధమైనవిగా చూపించాడని ఈడీ దర్యాప్తులో వెల్లడైంది. ఇలా నయీం కుటుంబ సభ్యులు, అనుచరుల పేర్ల మీద మొత్తం 91 ఆస్తులు రిజిస్ట్రేషన్ చేసినట్లు ఈడీ అధికారులు గుర్తించారు. ఈ ఆస్తులను ప్రివెన్షన్ ఆఫ్ మనీలాండరింగ్ చట్టం కింద జప్తు చేసింది. ఈ క్రమంలోనే బినామీ ఆస్తుల నిషేధ చట్టం కింద ఆదాయపు పన్ను శాఖ ఆయా ఆస్తులను జప్తు చేసింది.
