షెల్ కంపెనీలు, బినామీలతో.. రూ. కోట్లు దోచుకున్నరు

షెల్ కంపెనీలు, బినామీలతో..   రూ. కోట్లు దోచుకున్నరు

హైదరాబాద్‌‌, వెలుగు: రాష్ట్రంలో సంచలనం సృష్టించిన ఐఎంఎస్‌‌(ఇన్సూరెన్స్‌‌ మెడికల్‌‌ సర్వీసెస్‌‌)స్కామ్‌‌ మనీలాండరింగ్‌‌ కేసులో ఎన్‌‌ఫోర్స్​మెంట్‌‌ డైరెక్టరేట్‌‌(ఈడీ) చార్జిషీట్‌‌ దాఖలు చేసింది. మాజీ డైరెక్టర్ దేవికారాణి సహా మొత్తం15 మందిపై అభియోగాలు మోపుతూ.. నాంపల్లిలోని ఎకనామిక్‌‌ అఫెన్సెస్‌‌ కోర్టులో గురువారం చార్జిషీట్‌‌ ఫైల్‌‌ చేసింది. ప్రివెన్షన్ ఆఫ్ మనీలాండరింగ్ యాక్ట్ కింద కలెక్ట్‌‌ చేసిన  డాక్యుమెంట్లు, సాక్ష్యాధారాలను ప్రొడ్యూస్ చేసింది.రూ.211 కోట్లు స్కామ్‌‌ జరిగినట్లు పేర్కొంది.ఏసీబీ నమోదు చేసిన కేసు ఆధారంగా ఈడీ మనీలాండరింగ్‌‌ కేసు నమోదు చేసి దర్యాప్తు చేసింది.

డిస్పెన్సరీలను కొల్లగొట్టారు

 రాష్ట్ర వ్యాప్తంగా డిస్పెన్సరీలు, ఎంప్లాయీస్ స్టేట్ ఇన్సూరెన్స్(ఈఎస్‌‌ఐ)హాస్పిటల్స్‌‌లో మెడిసిన్స్, సర్జికల్ కిట్ల సరఫరాలో అవినీతి జరిగిందని, టెండర్ ప్రక్రియలో రూల్స్ బ్రేక్ చేశారని ఈడీ పేర్కొంది. 2015–-16 నుంచి 2018–-19 మధ్య కాలంలో స్కామ్‌‌ జరిగినట్టు తెలిపింది. నకిలీ ఇన్వాయిస్‌‌లతో ఈఎస్‌‌ఐ ఖజానాను కొల్లగొట్టారని, షెల్ సంస్థల ద్వారా డబ్బు లావాదేవీలు చేసినట్లు చార్జిషీట్​లో ఈడీ పేర్కొంది. దేవికా రాణి, ఐఎంఎస్ సిబ్బందితో కుమ్మక్కై బినామీ సంస్థలతో పెద్ద మొత్తంలో ప్రభుత్వ ఖజానాను కొల్లగొట్టినట్లు తెలిపింది. డ్రగ్స్‌‌ సప్లయర్లు శ్రీహరి బాబు, పి. రాజేశ్వర్ రెడ్డితో కలిసి ఏర్పాటు చేసిన బినామీ సంస్థలతో అక్రమాలకు పాల్పడినట్లు ఈడీ వెల్లడించింది. 

కొట్టేసి ఆస్తులు కూడబెట్టారు

ఐఎంఎస్‌‌ మాజీ జాయింట్‌‌ డైరెక్టర్‌‌ కలకుంట్ల పద్మ హెల్త్‌‌ క్యాంప్​ల పేరుతో మెడిసిన్స్, ఇతర సామగ్రిని దారి మళ్లించినట్లు ఈడీ వివరించింది. దేవికా రాణి, ఫార్మాసిస్ట్ నాగలక్ష్మి , పీఎంజే జువెలర్స్‌‌తో కలిసి కుట్ర పన్నారని తెలిపింది. బిల్లులు లేకుండా దాదాపు రూ.6 కోట్ల 30 లక్షల విలువైన నగలను కొనుగోలు చేసినట్లు ఆధారాలను ఈడీ కోర్టుకు అందించింది. రియల్ ఎస్టేట్‌‌లో కూడా పెట్టుబడులు పెట్టారని పేర్కొంది. హైదరాబాద్, బెంగళూరు, నోయిడాలోని విల్లాలు, ఓపెన్ ప్లాట్లు, కమర్షియల్ కాంప్లెక్స్‌‌లు, వ్యవసాయ భూములను అటాచ్‌‌ చేసినట్టు ఈడీ చార్జిషీట్‌‌లో పేర్కొంది. రూ.144 కోట్ల విలువైన ఆస్తులను గతంలోనే జప్తు చేసినట్లు వెల్లడించింది.