
- మురళీధర్‌రావు, హరిరామ్, నూనె శ్రీధర్‌పై మనీలాండరింగ్ కోణంలో దర్యాప్తు
- ఎఫ్‌ఐఆర్‌లు, కేసు రికార్డుల కోసం ఏసీబీకి లెటర్ రాయాలని నిర్ణయం
- అవినీతి సొమ్ముతో ఇంజనీర్ల దందాలు..బినామీల కంపెనీలకు కాంట్రాక్టులు
- విదేశాల్లో ఫ్యామిలీ ఫంక్షన్లు.. అతిథులకు విమాన టికెట్లతో ఆహ్వానాలు
- ప్రైమ్ ఏరియాల్లో కుటుంబ సభ్యుల పేరిట భూములు, ఇండ్లు
- ఇప్పటికే ఒక్కొక్కరి దగ్గర వందల కోట్ల అక్రమాస్తులను గుర్తించిన ఏసీబీ
హైదరాబాద్, వెలుగు: బీఆర్ఎస్ హయాంలో కాళేశ్వరం సహా కీలక ప్రాజెక్టుల నిర్మాణంలో భాగమై వందల కోట్ల అవినీతికి పాల్పడ్డారనే ఆరోపణలు ఎదుర్కొంటున్న ఇంజనీర్లపై ఈడీ ఫోకస్ పెట్టింది. ఈఎన్సీ, ఇతర ముఖ్యమైన హోదాల్లో ఉంటూ కూడబెట్టిన అక్రమాస్తులు, అవినీతి సొమ్ముతో పెట్టిన పెట్టుబడుల వివరాలను సేకరిస్తున్నది. ఈ మేరకు ఏసీబీ నమోదు చేసిన ఎఫ్‌ఐఆర్‌లు సహా సోదాల్లో స్వాధీనం చేసుకున్న ఆస్తుల డాక్యుమెంట్లను అందించాలని ఏసీబీ డీజీకి లెటర్ రాయాలని ఈడీ నిర్ణయించింది.
ఏసీబీ కేసు రికార్డుల ఆధారంగా ఎన్‌ఫోర్స్‌మెంట్ కేస్ ఇన్‌ఫర్మేషన్ రిపోర్ట్ (ఈసీఐఆర్) రిజిస్టర్ చేసి దర్యాప్తు చేయనున్నట్లు తెలిసింది. లక్ష కోట్లతో కట్టిన కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణ సమయంలో మాజీ ఈఎన్సీలు మురళీధర్‌రావు, భూక్యా హరిరామ్, ఈఈ నూనె శ్రీధర్ కీలకంగా పనిచేశారు. వీరిపై ఏసీబీ అధికారులు ఆదాయానికి మించి ఆస్తుల కేసులు నమోదు చేశారు. ఏసీబీ సోదాల్లో అత్యంత ఖరీదైన విల్లాలు, ఫ్లాట్లు, అత్యంత ప్రైమ్ లొకేషన్లలో ప్లాట్లు, బ్యాంకు డిపాజిట్లు సహా విలువైన ఆభరణాలు బయటపడ్డాయి. ఆదాయానికి మించి ఒక్కొక్కరికి వందల కోట్ల విలువైన ఆస్తులు ఉన్నట్లు తేలింది.
కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణ సమయంలో ఈఎన్సీగా చక్రం తిప్పిన మురళీధర్‌రావు తన కుమారుడు అభిషేక్‌రావు కంపెనీల ద్వారా భారీ అక్రమాలకు పాల్పడ్డట్లు ఏసీబీ అనుమానిస్తున్నది. మురళీధర్‌రావు, ఆయన బంధువులకు సంబంధించి మొత్తం 12 చోట్ల ఏసీబీ అధికారులు మంగళవారం సోదాలు నిర్వహించి.. భారీ ఎత్తున అక్రమాస్తులను గుర్తించి.. ఆయనను అరెస్ట్‌చేసిన విషయం తెలిసిందే.
అభిషేక్‌రావు సొంత కంపెనీలతోపాటు, ఆయన బినామీగా ఉన్న కాంట్రాక్టు సంస్థలకు వందల కోట్ల విలువ చేసే కాంట్రాక్టులను గతంలో కట్టబెట్టినట్లు, ఆ కంపెనీల్లోకి అవినీతి సొమ్మును పెట్టుబడులుగా మళ్లించినట్లు ఏసీబీ అనుమానిస్తున్నది. ఇక.. జూన్ 11న అరెస్టయిన కాళేశ్వరం ఈఈ నూనె శ్రీధర్ అప్పట్లో తన ఫ్యామిలీ ఫంక్షన్స్‌ను విదేశాల్లో నిర్వహించినట్లు అధికారులు గుర్తించారు. ఆయన తన కుమారుడి వివాహ వేడుకలు (డెస్టినేషన్ వెడ్డింగ్) థాయ్‌లాండ్‌లో అంగరంగ వైభవంగా నిర్వహించాడు.
ఈ వేడుకలకు హాజరయ్యే అతిథుల కోసం శ్రీధర్ ప్రత్యేక విమానంలో టికెట్లు బుక్ చేశాడు. దీంతోపాటు కరీంనగర్ సహా హైదరాబాద్‌లో హోటల్స్ బిజినెస్‌లో పెట్టుబడులు పెట్టినట్లు ఏసీబీ ఆధారాలు సేకరించింది. కాళేశ్వరం ఇరిగేషన్ ప్రాజెక్ట్ కార్పొరేషన్ లిమిటెడ్ డైరెక్టర్, ఎండీగా విధులు నిర్వహించిన ఈఎన్‌సీ భూక్యా హరిరామ్ కూడా వందల కోట్లు అక్రమాస్తులు కూడబెట్టినట్లు ఏసీబీ ఇప్పటికే గుర్తించి.. ఆస్తుల డాక్యుమెంట్లను సీజ్ చేసింది.
హరిరామ్‌ను మే నెలలో ఏసీబీ అరెస్ట్ చేసింది. కాగా.. అక్రమంగా సంపాదించిన సొమ్ముతో మురళీధర్‌రావు, నూనె శ్రీధర్, హరిరామ్ పెట్టిన పెట్టుబడులపై తాజాగా ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) అధికారులు ఆరా తీస్తున్నారు. బినామీలు, కుటుంబ సభ్యుల పేర్లతో వివిధ వ్యాపారాల్లోకి మళ్లించిన సొమ్మును మనీలాండరింగ్ కింద పరిగణిస్తూ దర్యాప్తు చేసేందుకు సిద్ధమవుతున్నారు.