- హబీబ్‌నగర్ కైసర్ ఆస్తులు జప్తు
- హత్య, హత్యాయత్నం, బెదిరింపులు, దోపిడీలతో సంపాదన
- భార్య పేరుతో ఉన్న రూ.1.01 కోట్లు అటాచ్
హైదరాబాద్, వెలుగు: ఆర్ధిక నేరాలకు పాల్పడుతున్న రౌడీ షీటర్స్‌పై ఈడీ నజర్ పెట్టింది. అక్రమాలతో దోచుకున్న డబ్బును జప్తు చేస్తున్నది. ఇందులో భాగంగా హబీబ్ నగర్‌లో రౌడీషీటర్‌గా పోలీస్ రికార్డుల్లోకి ఎక్కిన పాత నేరస్తుడు మహ్మద్ కైసర్ అలియాస్ పహిల్వాన్ కైసర్‌కు చెందిన రూ.1.01 కోటి విలువైన ఆస్తులను జప్తు చేసింది. మనీలాండరింగ్ చట్టాల కింద ఈ మేరకు చర్యలు తీసుకున్నట్టు శుక్రవారం ఓ ప్రకటనలో వెల్లడించింది.
రాష్ట్ర పోలీసులు వివిధ పోలీస్ స్టేషన్ల పరిధిలో నమోదు చేసిన కేసుల ఆధారంగా ఈడీ దర్యాప్తు ప్రారంభించింది. హత్య,హత్యాయత్నం, బెదిరింపులు, దోపిడీలు ఇలా అనేక నేరాల్లో కైసర్ నిందితుడిగా ఉన్నట్లు గుర్తించారు. జూదం, క్రికెట్ బెట్టింగ్, ల్యాండ్ సెటిల్మెంట్ మొదలైన నేరపూరిత చర్యలతో ఆస్తులు కూడబెట్టినట్టు దర్యాప్తులో వెల్లడైంది. 2007 నుంచి 2020 వరకు కూడబెట్టిన అక్రమ సంపాదనతో పలు స్థిరాస్తులను తన భార్య షాహేదాబేగం పేరిట కొనుగోలు చేసినట్లు ఆధారాలు సేకరించారు.
దీంతో మహమ్మద్ కైసర్ కు చెందిన ఆస్తులను అటాచ్ చేశారు. కేసు దర్యాప్తు పురోగతిలో ఉన్నట్టు పేర్కొన్నారు.