ఇయ్యాల కూడా కొనసాగనున్న చికోటి విచారణ

ఇయ్యాల కూడా కొనసాగనున్న చికోటి  విచారణ
  • ఎంత కాలంగా క్యాసినో నిర్వహిస్తున్నరు?
  • ఎంత మంది వస్తున్నరు.. చెల్లింపులు ఎట్ల  చేస్తున్నరని ప్రశ్నలు
  • స్టేట్‌మెంట్‌ రికార్డ్ చేసిన ఆఫీసర్లు
  •  ఇయ్యాల కూడా కొనసాగనున్న విచారణ

హైదరాబాద్‌‌, వెలుగు: ఏడు దేశాల్లో క్యాసినోల నిర్వహణకు పెట్టుబడులు ఎవరు పెట్టారని చీకోటి ప్రవీణ్‌‌ను ఎన్‌‌ఫోర్స్‌‌మెంట్‌‌ డైరెక్టరేట్‌‌(ఈడీ) ప్రశ్నించింది. ఎంతకాలంగా గేమ్స్ నిర్వహిస్తున్నారని ఆరా తీసింది. క్యాసినో హవాలా కేసులో చీకోటి ప్రవీణ్‌‌తో పాటు మాధవరెడ్డి, ట్రావెల్‌‌ ఏజెంట్‌‌ సంపత్‌‌, హవాలా ఏజెంట్లు గౌరీశంకర్‌‌‌‌, బాబులాల్‌‌ అగర్వాల్‌‌ను సోమవారం విచారించింది. హైదరాబాద్‌‌ బషీర్‌‌‌‌బాగ్‌‌లోని ఈడీ ఆఫీసులో జేడీ అభిషేక్‌‌ గోయల్‌‌‌‌ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన స్పెషల్‌‌ టీమ్‌‌ 11 గంటలపాటు సుదీర్ఘంగా ప్రశ్నించింది. ఉదయం 10.30 గంటల నుంచి రాత్రి 9 గంటల వరకు విచారణ జరిపింది. వ్యక్తిగత వివరాలు, ఆదాయ మార్గాలకు సంబంధించిన సమాచారం సేకరించింది. వీరు ఇచ్చిన స్టేట్‌మెంట్‌ ఆధారంగా హవాలా నెట్‌వర్క్‌లో ఉన్న వారికి నోటీసులు ఇచ్చేందుకు ప్లాన్ చేసింది.

ఎంతకాలంగా చేస్తున్నరు
వారం రోజులుగా జరిపిన సోదాల్లో స్వాధీనం చేసుకున్న డాక్యుమెంట్స్, ల్యాప్‌టాప్‌, బ్యాంక్ ట్రాన్సాక్షన్స్‌ ఆధారంగా అధికారులు ప్రశ్నించినట్లు సమాచారం. చీకోటి ఆస్తులు, వాటికి సంబంధించిన వివరాలతో స్టేట్‌మెంట్‌ రికార్డ్‌ చేసినట్లు తెలిసింది. చీకోటి నిర్వహించే  బిజినెస్‌లు, రిజిస్టర్‌‌ చేసిన కంపెనీల వివరాలను తెలుసుకున్నారు. ఆయా కంపెనీల పేరుతో ఎలాంటి కార్యకలాపాలు నిర్వహిస్తున్నారనేది రికార్డ్ చేశారు. వాటికి సంబంధించిన వివరాలను అందించాలని ఆదేశించారు. గోవా, నేపాల్‌లోని క్యాసినో సెంటర్స్‌ వివరాల ఆధారంగా ప్రశ్నించినట్లు తెలిసింది. ఓ టూర్ ఏజెన్సీ నుంచి సంపత్‌ బుక్ చేసిన టికెట్స్.. సంపత్ అకౌంట్స్‌ నుంచి చీకోటికి చేరిన క్యాష్‌ వివరాలను రికార్డ్ చేసినట్లు సమాచారం. ఎంత కాలంగా క్యాసినో నిర్వహిస్తున్నారు,  రోజు ఎన్ని గేమ్స్ జరుగుతాయి, ఎంత మంది గేమ్‌లో పాల్గొంటారు, క్యాసినో బుకింగ్స్‌, టోకెన్స్, విన్నర్స్‌కి అమౌంట్‌ చెల్లింపులు ఎలా చేస్తారనే దానిపై ప్రశ్నించినట్లు తెలిసింది.

రికార్డులెక్కడ?
శ్రీలంకలో నిర్వహించిన క్యాసినో సెంటర్‌‌ను ఆర్థిక మాంద్యంతో క్లోజ్ చేసినట్లు తెలిసింది. దీనికి సంబంధించిన ఫైనాన్షియల్‌ రికార్డులు అందించాలని ఈడీ అధికారులు చీకోటి ప్రవీణ్, మాధవరెడ్డిలను ఆదేశించినట్లు సమాచారం. కస్టమర్లను తరలించేందుకు బుక్‌ చేసిన ఫ్లైట్స్‌ వివరాల ఆధారంగా ప్రశ్నించినట్లు తెలిసింది. థాయిలాండ్‌, నేపాల్‌, ఇండోనేషియా సహా మొత్తం 7 దేశాల్లో నిర్వహిస్తున్న క్యాసినోలకు పెట్టుబడులు పెట్టిన వారి గురించి ఆరా తీసినట్లు సమాచారం. ఈవెంట్స్‌లో పాల్గొన్న వారి ఆన్‌లైన్ ట్రాన్సాక్షన్స్, క్యాష్ పేమెంట్స్‌కు సంబంధించిన డాక్యుమెంట్స్ సమర్పించాలని ఆదేశించారని తెలిసింది. రాత్రి 9 గంటల తర్వాత స్టేట్‌మెంట్స్‌పై వారితో సంతకాలు తీసుకున్నారు. చీకోటి ఇచ్చిన సమాచారం ఆధారంగా మరికొంత మందికి నోటీసులు ఇచ్చే అవకాశాలు ఉన్నట్లు తెలిసింది. మంగళవారం కూడా విచారణ జరగనున్నది.