- ఒకరి మృతి, మరొకరి కోసం గాలింపు
ఖమ్మంటౌన్, వెలుగు : నీటిలో మునిగిపోతున్న ఫ్రెండ్‌ను కాపాడిన ఇద్దరు స్టూడెంట్లు.. తర్వాత పట్టు తప్పి కాల్వలో పడిపోయారు. ఇందులో ఒకరి డెడ్‌బాడీ దొరకగా.. మరో బాలుడి ఆచూకీ కోసం గాలిస్తున్నారు. ఈ ఘటన ఖమ్మం నగరంలో బుధవారం జరిగింది. వివరాల్లోకి వెళ్తే... ఖమ్మం పట్టణంలోని గట్టయ్య సెంటర్‌కు చెందిన వడ్ల శశాంక్ (13), ఎండీ అబ్దుల్ సుహాన్, రమణగుట్టకు చెందిన ఈశ్వర్ స్నేహితులు. ముగ్గురు కలిసి బుధవారం సైకిళ్లపై సాగర్ కాల్వ వద్దకు వచ్చారు.
ఈత కొట్టేందుకని కాల్వలో దిగిన ఈశ్వర్ నీటిలో మునిగిపోతుండడంతో గమనించిన శశాంక్, అబ్దుల్ అతడిని ఒడ్డుకు లాగారు. అనంతరం కాల్వ గచ్చుపైనే నిలబడిన ఇద్దరు ప్రమాదవశాత్తు నీటిలో పడి గల్లంతయ్యారు. దీంతో భయాందోళనకు గురైన ఈశ్వర్ ఇంటికి పరిగెత్తాడు.
కాల్వ గట్టుపైన సైకిళ్లు ఉండడాన్ని గమనించిన స్థానిక జాలర్లు ఖమ్మం టూటౌన్ పోలీసులకు సమాచారం ఇచ్చారు. సీఐ బాలకృష్ణ ఘటనాస్థలానికి చేరుకొని గజఈతగాళ్లతో కాల్వలో గాలించగా... అబ్దుల్ సుహాన్ డెడ్‌బాడీ దొరికింది. మరో బాలుడు శశాంక్ కోసం రాత్రి వరకు గాలించినా ఆచూకీ దొరకలేదు.
