
హైదరాబాద్, వెలుగు: ఢిల్లీ లిక్కర్ స్కామ్ వ్యవహారంలో రియల్ ఎస్టేట్ వ్యాపారి వెన్నమనేని శ్రీనివాస్‌రావును బుధవారం కూడా ఈడీ విచారించింది. అనుమానాస్పద లావాదేవీలకు సంబంధించిన డాక్యుమెంట్లను ఆయన నుంచి తీసుకున్నట్లు తెలిసింది. కంపెనీల రిజిస్ట్రేషన్స్, ఫైనాన్షియల్ రిపోర్ట్‌తో పూర్తి వివరాలు ఇవ్వాలని, ఒర్జినల్ డాక్యుమెంట్లతో ఈ నెల 26న ఢిల్లీ ఆఫీస్‌లో హాజరు కావాలని ఈడీ నోటీసులు ఇచ్చినట్లు సమాచారం. ఈ కేసులో ఇప్పటికే 9 మందిని ఈడీ విచారించింది. ఈ నెల 19న శ్రీనివాస్ రావు ఇంట్లో ఈడీ అధికారులు తనిఖీలు చేపట్టి.. అనంతరం బషీర్‌బాగ్‌లోని ఈడీ ఆఫీసులో సుమారు ఆరుగంటలపాటు విచారించారు. ఆ విచారణలో కొన్ని అనుమానాస్పద డాక్యుమెంట్లను గుర్తించి.. సరైన డాక్యుమెంట్లు అందించాలని ఆదేశించగా.. బుధవారం శ్రీనివాస్ రావు ఈడీ ముందు హాజరయ్యారు.
టెండర్స్ డేట్స్, ఫ్లైట్ టికెట్స్ ఆధారంగా..
లిక్కర్ టెండర్స్ సమయంలో జోనా ట్రావెల్స్ ద్వారా ప్రముఖ వ్యక్తులు ఢిల్లీకి వెళ్లినట్లు ఈడీ అనుమానిస్తున్నది. ఓ ఫార్మా కంపెనీకి చెందిన అకౌంట్స్ నుంచి డబ్బులు చేతులు మారినట్లు ఆధారాలు సేకరించింది. దీంతో పాటు రామంతాపూర్‌లోని సాలిగ్రామ్ ఐటీ కంపెనీకి చెందిన ఆర్థిక లావాదేవీల వివరాలు రాబట్టింది. లిక్కర్ స్కామ్‌లో టెండర్స్ డీలింగ్ జరిగిన రోజుల్లో ఢిల్లీకి వెళ్లినవారి డేటాను కలెక్ట్ చేసినట్లు సమాచారం. జోనా ట్రావెల్స్ నుంచి ఏర్పాటు చేసిన స్పెషల్ ఫ్లైట్‌లో ట్రావెల్ చేసిన వారి వివరాలను ఈడీ సేకరించినట్లు తెలిసింది. వీటికి సంబంధించిన డబ్బు వెన్నమనేని శ్రీనివాస్‌రావు డైరెక్టర్‌గా ఉన్న కంపెనీల అకౌంట్స్‌నుంచి ట్రాన్స్‌ఫర్ జరిగినట్లు సమాచారం.
గతేడాది మార్చి నుంచి లెక్కలు
వెన్నమనేనికి చెందిన 8 కంపెనీల ట్రాన్సాక్షన్స్‌ను బుధవారం కూడా ఈడీ పరిశీలించినట్లు సమాచారం. సరైన సమాచారం ఇవ్వక పోవడంతో ఢిల్లీ ఆఫీస్‌లో విచారణకు రావాలని నోటీసులిచ్చినట్లు తెలిసింది. రాష్ట్రంలో సాఫ్ట్‌వేర్ కంపెనీలు, మైన్స్, రియల్ ఎస్టేట్, ఫార్మా కంపెనీల నుంచి మనీలాండరింగ్ జరిగినట్లు ఆధారాలు సేకరించినట్లు సమాచారం. గతేడాది మార్చి నుంచి ఈ ఏడాది జూన్ వరకు పలు షెల్ కంపెనీల నుంచి వందల కోట్ల లావాదేవీలు జరిగినట్లు గుర్తించినట్లు తెలిసింది. ఇందులో ఓ ప్రముఖ ఫార్మా కంపెనీ అకౌంట్ నుంచి కూడా భారీ మొత్తంలో లెక్కలు లేని డబ్బు చేతులు మారినట్లు సమాచారం. ఈ క్రమంలోనే ఓ ఫార్మా కంపెనీకి చెందిన ఎండీ, సీఏలను ఢిల్లీలోని ఈడీ ప్రధాన కార్యాలయంలో విచారించే అవకాశాలు ఉన్నట్లు తెలిసింది.