ఆప్ అంతమే ఈడీ లక్ష్యం : కేజ్రీవాల్

ఆప్ అంతమే ఈడీ లక్ష్యం : కేజ్రీవాల్
  •  సీబీఐ, ఈడీ చార్జ్ షీట్లలో నా పేరు ఎక్కడా లేదు
  • సీబీఐ స్పెషల్ కోర్టులో స్వయంగా కేజ్రీవాల్ వాదనలు  
  • లిక్కర్ స్కామ్​లో నన్ను ఇరికించాలని చూస్తున్నరు
  • బీజేపీకి శరత్ చంద్రారెడ్డి రూ.55 కోట్లు విరాళం ఇచ్చిండు
  •  రూ.100 కోట్ల అవినీతి జరిగిందనేది అబద్ధం  
  • మాగుంట రాఘవను బెదిరించి తనకు 
  • వ్యతిరేకంగా స్టేట్​మెంట్ తీసుకున్నారని ఆరోపణ 
  • సౌత్ గ్రూప్ నుంచి ఆప్​కు హవాలా డబ్బులు అందినయ్: ఈడీ 
  • బీజేపీ విరాళాలతో లిక్కర్ కేసుకు సంబంధం లేదని వెల్లడి  
  • మరో 4 రోజుల ఈడీ కస్టడీకి ఢిల్లీ సీఎం

న్యూఢిల్లీ, వెలుగు: ఢిల్లీ లిక్కర్ పాలసీలో మొదట ఎలాంటి స్కామ్ జరగలేదని, విచారణ పేరుతో ఈడీ ఎంటర్ అయిన తర్వాతే అసలు స్కామ్ మొదలైందని ఆప్ చీఫ్, ఢిల్లీ సీఎం అర్వింద్ కేజ్రీవాల్ ఆరోపించారు. ఈ కేసులో తనను కుట్రపూరితంగా ఇరికించాలని చూస్తున్నారని అన్నారు. ఆమ్ ఆద్మీ పార్టీని అంతం చేయడమే లక్ష్యంగా ఈడీ పని చేస్తున్నదని ఆరోపించారు. ఈ కేసులో అరెస్టయిన కేజ్రీవాల్ కు ఈడీ కస్టడీ ముగియడంతో గురువారం ఆయనను ఢిల్లీ రౌస్ అవెన్యూలోని సీబీఐ స్పెషల్ కోర్టులో ఈడీ అధికారులు హాజరుపరిచారు. ఈడీ తరఫున అడిషనల్ సొలిసిటర్ జనరల్ ఎస్వీ రాజు, సీనియర్ అడ్వకేట్ జోహెబ్ హుస్సేన్ వీడియో కాన్ఫరెన్స్ ద్వారా వాదనలు వినిపించారు. 

మొదట ఎస్వీ రాజు వాదిస్తూ.. ఈడీ విచారణకు కేజ్రీవాల్ సహకరించడం లేదని కోర్టుకు తెలిపారు. ‘‘ఈ కేసులో గోవా, పంజాబ్ కు చెందిన మరికొందరికి సమన్లు జారీ అయ్యాయి. వారితో కలిపి  కేజ్రీవాల్ ను విచారించాల్సి ఉంది. ఈడీ కస్టడీలో కేజ్రీవాల్ ను ఐదు రోజులు విచారించి స్టేట్ మెంట్ రికార్డు చేశాం. అయితే ఆయన తప్పించుకునే సమాధానాలు చెప్పారు. ఇన్ కమ్ ట్యాక్స్ రిటర్న్స్ సమాచారం ఇవ్వడం లేదు. డిజిటల్ డివైజ్ ల పాస్ వర్డ్ లను సైతం వెల్లడించడం లేదు. అందుకే సీఆర్పీసీ సెక్షన్ 167(2), పీఎంఎల్ఏ సెక్షన్ 65 ప్రకారం కేజ్రీవాల్ ను మరో 7 రోజులు కస్టడీకివ్వాలి” అని కోరారు. 

రూ. 100 కోట్ల అవినీతి అబద్ధం: కేజ్రీవాల్ 

కేజ్రీవాల్ స్వయంగా వాదనలు వినిపించుకోవాలని భావిస్తున్నారని, అందుకు అనుమతి ఇవ్వాలని ఆయన తరఫు అడ్వకేట్ రమేశ్ గుప్తా కోర్టును కోరారు. కోర్టు అనుమతి ఇవ్వడంతో కేజ్రీవాల్ హిందీలో వాదనలు వినిపించారు. ‘‘లిక్కర్ పాలసీలో మొదట ఎలాంటి అవినీతి జరగలేదు. ఇందులో ఎప్పుడైతే ఈడీ జోక్యం చేసుకుందో అప్పుడే అసలైన స్కామ్ మొదలైంది. ఈడీ రెండు లక్ష్యాలు పెట్టుకుంది. అందులో ఒకటి ఆమ్ ఆద్మీ పార్టీని అంతం చేయడం, మరొకటి కేసు విచారణ పేరుతో డబ్బు వసూళ్ల దోపిడీని నడిపించడం” అని ఆరోపించారు.

 ‘‘ఎలాంటి ఆధారాలు లేకున్నా ఈ కేసులో నన్ను ఇరికించడమే ఈడీ లక్ష్యంగా పెట్టుకుంది. ఈడీ కస్టడీని నేను వ్యతిరేకించడం లేదు. ఎన్ని రోజులు కావాలంటే అన్ని రోజులు నన్ను కస్టడీలోకి తీసుకోండి. రెండేండ్ల నుంచి ఈ కేసు నడుస్తున్నది. 2022 ఆగస్టులో సీబీఐ కేసు నమోదైంది. 31 వేల పేజీలతో సీబీఐ చార్జ్ షీట్ దాఖలు చేసింది. ఆ తర్వాత ఈడీ 25 వేల పేజీలతో చార్జ్ షీట్ వేసింది. కానీ వాటిల్లో ఎక్కడా నా పేరు లేదు” అని పేర్కొన్నారు. 

‘‘ఈడీ ఆరోపిస్తున్నట్టుగా రూ.100 కోట్ల అవినీతి జరిగిందనేది అబద్ధం. ఈడీ విచారణ తర్వాతే అసలు కుంభకోణం మొదలైంది. ఈ కేసులో నిందితుడైన శరత్ చంద్రారెడ్డి బీజేపీకి రూ.55 కోట్లు విరాళం ఇచ్చారు. ఆయన అరెస్టు తర్వాతే బీజేపీకి రూ.50 కోట్లు డొనేషన్ ఇచ్చారు. దీనికి సంబంధించిన ఆధారాలు ఉన్నాయి” అని చెప్పారు. ‘‘మనీశ్ సిసోడియా సమక్షంలో నాకు లిక్కర్ పాలసీ డాక్యుమెంట్స్ ఇచ్చినట్టు సి.అరవింద్ అనే అధికారి స్టేట్ మెంట్ ఇచ్చారని ఈడీ చెబుతున్నది. మాగుంట శ్రీనివాసులు రెడ్డి, ఆయన కొడుకు రాఘవ స్టేట్ మెంట్లను ఆరేడుసార్లు ఈడీ రికార్డు చేసింది. అయితే మొదట్లో ఎక్కడా కూడా వాళ్లిద్దరూ నా పేరు చెప్పలేదు. వాళ్లిద్దరినీ ఈడీ బెదిరించి అప్రూవర్లుగా మార్చి, నాకు వ్యతిరేకంగా స్టేట్ మెంట్లు తీసుకుంది. ఆ తర్వాత రాఘవకు బెయిల్ వచ్చింది” అని అన్నారు. ఆధారాలు లేకుండా కొంతమంది స్టేట్ మెంట్ల ఆధారంగా ఒక సీఎంను అరెస్టు చేయొచ్చా? అని ప్రశ్నించారు. 

ఆధారాలు ఉన్నయ్: ఎస్వీ రాజు 

కేజ్రీవాల్ ఆరోపణలను అడిషనల్ సొలిసిటర్ జనరల్ ఎస్వీ రాజు ఖండించారు. ‘‘గోవా ఎన్నికల ప్రచార ఖర్చుల కోసం ఆప్ కు డబ్బు అందింది. అది సౌత్ గ్రూప్ నుంచి హవాలా ద్వారా వచ్చింది. దీనికి ఆధారాలు ఉన్నాయి. బీజేపీకి శరత్ చంద్రారెడ్డి ఇచ్చిన రూ.55 కోట్లతో లిక్కర్ కేసుకు సంబంధం లేదు. ఎలక్టోరల్ బాండ్ల ద్వారా ఆ పార్టీకి విరాళం అందింది. ఇక సీఎం అయినంత మాత్రాన అరెస్ట్ చెయ్యకూడదని లేదు. సీఎం అరెస్టుకు భిన్నమైన రూల్స్ ఏమీ ఉండవు” అని అన్నారు.  కేజ్రీవాల్ తరఫు లాయర్ రమేశ్ గుప్తా స్పందిస్తూ.. ఎలక్టోరల్ బాండ్స్ తో ఈ కేసుకు సంబంధం లేకపోతే, దీనిపైనా విచారణ కు ఆదేశించాలని కోరారు. కాగా, ఇరువైపుల వాదనలు విన్న స్పెషల్ జడ్జి కావేరి బవేజా మొదట తీర్పు రిజర్వ్ చేశారు. అనంతరం కేజ్రీవాల్ కు ఏప్రిల్ 1 వరకు కస్టడీని పొడిగిస్తున్నట్టు ఉత్తర్వులు జారీ చేశారు.  

నా భర్తను వేధిస్తున్నరు: సునీత  

కేజ్రీవాల్​ను ఈడీ అధికారులు వేధిస్తున్నారని ఆయన భార్య సునీత కేజ్రీవాల్ ఆరోపించారు. అర్వింద్ ఆరోగ్యం క్షీణిస్తున్నదని, అధికారులు మాత్రం పట్టించుకోవడం లేదని విమర్శించారు. కేజ్రీవాల్​ను కోర్టులో హాజరుపర్చేందుకు ఈడీ అధికారులు గురువారం తీసుకురాగా, అక్కడికి వచ్చిన సునీత మీడియాతో మాట్లాడారు. ‘‘నా భర్త ఆరోగ్యం బాగా లేదు. షుగర్ లెవల్స్ పడిపోతున్నాయి. ఈడీ అధికారులు ఆయన్ను మానసికంగా  ధిస్తున్నారు. ఈ దౌర్జన్యం ఎంతో కాలం సాగదు. ప్రజలే తగిన సమాధానం చెప్తారు’’ అని అన్నారు.