లిక్కర్ స్కాం : హైదరాబాద్, కరీంనగర్ సహా పలు ప్రాంతాల్లో ఈడీ సోదాలు

లిక్కర్ స్కాం : హైదరాబాద్, కరీంనగర్ సహా పలు ప్రాంతాల్లో ఈడీ సోదాలు

దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన ఢిల్లీ లిక్కర్ స్కాం కేసుపై ఈడీ దూకుడు పెంచింది. తెలంగాణ వ్యాప్తంగా పలు ప్రాంతాల్లో ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) అధికారులు సోదాలు చేస్తున్నారు. ఢిల్లీ డిప్యూటీ సీఎం మనీష్ సిసోడియా అనుచరుడు దినేష్ అరోరా అప్రూవర్ గా మారాడు. అతడు ఇచ్చిన సమాచారంతో హైదరాబాద్, కరీంనగర్ సహా పలు ప్రాంతాల్లో తనిఖీలు నిర్వహిస్తున్నారు. గతంలో ఈడీ ప్రశ్నించిన వారి ఇళ్లలోనూ సోదాలు జరుపుతున్నారు. లిక్కర్ స్కాం వెనుక ఎవరెవరు ఉన్నారనే సమాచారాన్ని సేకరిస్తున్నారు ఈడీ అధికారులు.

ఢిల్లీ లిక్కర్ స్కాం కేసులో  దినేష్ అరోరా అప్రూవర్ గా మారాడు. మరో నిందితుడు సమీర్ మహేంద్రు.. అరోరా నిర్వహిస్తున్న రాధా ఇండస్ట్రీస్ బ్యాంక్ ఖాతాకు కోటి రూపాయలు బదిలీ చేసినట్లు సీబీఐ విచారణలో తేలింది. దినేష్ అరోరా, ఢిల్లీ డిప్యూటీ సిఎం మనీష్ సిసోడియా సహా నిందితులందరిపై ఐపీసీ సెక్షన్ 120 బి, 477 ఏతో పాటు అవినీతి నిరోధక చట్టంలోని సెక్షన్ 7 కింద కేసు నమోదు చేశారు.

అరవింద్ కేజ్రీవాల్ నేతృత్వంలో 2021, 2022లో రూపొందించిన ప్రభుత్వ ఎక్సైజ్ పాలసీపై ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్ వీకే సక్సేనా జూలైలో సీబీఐ విచారణకు సిఫార్సు చేశారు. గతేడాది నవంబర్ 17న అమలులోకి వచ్చిన ఈ విధానంలో భాగంగా నగరాన్ని 32 జోన్‌లుగా విభజించి 849 షాపులకు సంబంధించి ప్రైవేట్ బిడ్డర్లకు రిటైల్ లైసెన్సులు ఇచ్చారు. ఈ విధానాన్ని బీజేపీ, కాంగ్రెస్‌లు వ్యతిరేకిస్తూ ఎల్‌జీకి ఫిర్యాదు చేశాయి.  మద్యం విక్రయదారుల నుంచి దాదాపు రూ.144 కోట్ల బకాయిలను మాఫీ చేయాలన్న ఎక్సైజ్ శాఖ నిర్ణయాన్ని కూడా గవర్నర్ వీకే సక్సేనా తప్పుబట్టారు.