అక్రమ సరోగసీ రాకెట్‌పై ఈడీ దాడులు.. డాక్టర్ నమ్రత సంచలన ప్రకటన

అక్రమ సరోగసీ రాకెట్‌పై ఈడీ దాడులు.. డాక్టర్ నమ్రత సంచలన ప్రకటన

హైదరాబాద్: హైదరాబాద్ జోనల్ ఆఫీస్‌కు చెందిన ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్‌ (ED) అధికారులు, సెప్టెంబర్ 25, 2025న హైదరాబాద్, విజయవాడ, విశాఖపట్నం నగరాల్లోని తొమ్మిది ప్రాంతాల్లో ఆకస్మిక సోదాలు నిర్వహించారు. యూనివర్సల్ సృష్టి ఫెర్టిలిటీ & రీసెర్చ్ సెంటర్ పేరుతో అక్రమ సరోగసీ రాకెట్ నడిపిన డాక్టర్ పాచిపల్లి నమ్రత అలియాస్ అట్లూరి నమ్రత కేసులో ఈ దాడులు చేపట్టారు. ఈ దర్యాప్తులో భాగంగా అధికారులు సరోగసీ రాకెట్‌కు సంబంధించిన పలు కీలక పత్రాలు, మోసపోయిన జంటల వివరాలు, ఆస్తుల ఆధారాలను స్వాధీనం చేసుకున్నారు.

పోలీస్ ఫిర్యాదుల ఆధారంగా ఈడీ దర్యాప్తు
హైదరాబాద్ గోపాలపురం పోలీస్ స్టేషన్‌లో మోసం, మభ్యపెట్టడం, అక్రమ సరోగసీ, చైల్డ్ ట్రాఫికింగ్ కేసులపై నమోదైన పలు FIRల ఆధారంగా ఈడీ దర్యాప్తు ప్రారంభించింది. ఈడీ సోదాల్లో నమ్రత అక్రమంగా సంపాదించిన డబ్బుతో కొనుగోలు చేసిన ఆస్తుల పత్రాలు కూడా దొరికాయి. ఈ కేసులో మరిన్ని విషయాలు వెలుగులోకి తెచ్చేందుకు ఈడీ దర్యాప్తు కొనసాగిస్తోంది.

డాక్టర్ నమ్రత తన సెంటర్‌లో సిబ్బంది, ఏజెంట్ల సహాయంతో సరోగసీ రాకెట్ నడిపింది. సంతానం లేని దంపతులను IVF బదులు సరోగసీ చేయమని ప్రోత్సహించింది. తమ సొంత అండం, వీర్యం వాడి ఎంబ్రియో తయారు చేసి, సరోగేట్ తల్లికి ఇంప్లాంట్ చేస్తామని నమ్మించారు.

►ALSO READ | బెంగళూరులో ఏంటీ ఘోరం..? అలా కడుపులో తన్నడం ఏంటి..? మరీ ఇంత దారుణమా..?

అన్ని డాక్యుమెంట్లు సెంటర్‌ చూసుకుంటుందని, DNA టెస్ట్ తర్వాత ఆరోగ్యవంతమైన శిశువును అందజేస్తామని హామీ ఇచ్చింది. ఈ ప్రక్రియ కోసం జంటల నుంచి 30 లక్షలు వసూలు చేసింది. అందులో 15 లక్షలు చెక్కు ద్వారా, మరో 15 లక్షలు నగదుగా (సరోగేట్‌కు ఇస్తామని) వసూలు చేశారు. చివరికి ఆ జంటకు ఓ బాబును ఇచ్చినా, DNA టెస్ట్‌లో ఆ బిడ్డ వారిది కాదని తేలింది.

పేద మహిళలను ఉపయోగించిన ఏజెంట్లు

ఏజెంట్లు పేద, బలహీన స్థితిలో ఉన్న గర్భిణీ స్త్రీలను డబ్బు ఆశ చూపించి శిశువు పుట్టగానే వదిలేయమని ఒప్పించేవారని దర్యాప్తులో బయటపడింది.

భారీ మోసం– ఆస్తుల సేకరణ
ఈ విధంగా అనేక జంటలు మోసపోయినట్లు ఈడీ విచారణలో తేలింది. వసూలైన డబ్బులో కొంతమేర ఏజెంట్లకు, సరోగేట్‌లకు ఇచ్చినా, చాలా భాగం డాక్టర్ నమ్రతే తన వ్యక్తిగత అవసరాలకు, ఆస్తుల కొనుగోలుకు వినియోగించింది.

దేశవ్యాప్తంగా కార్యకలాపాలు– పదేళ్లుగా రాకెట్
సోదాలలో లభించిన పత్రాల ప్రకారం, నమ్రత.. హైదరాబాద్, విజయవాడ, విశాఖపట్నం, నెల్లూరు, కోల్‌కతా వంటి నగరాల్లో సెంటర్ల ద్వారా దేశవ్యాప్తంగా ఈ అక్రమ రాకెట్ నడిపినట్లు తేలింది. ఆమె ఇది పదేళ్లకు పైగా కొనసాగించిందని కూడా ఆధారాలు బయటపడ్డాయి.