బెంగళూరులో ఏంటీ ఘోరం..? అలా కడుపులో తన్నడం ఏంటి..? మరీ ఇంత దారుణమా..?

బెంగళూరులో ఏంటీ ఘోరం..? అలా కడుపులో తన్నడం ఏంటి..? మరీ ఇంత దారుణమా..?

బెంగళూరు నగరంలో దారుణం జరిగింది. తన చీరల దుకాణంలో 90 వేలకు పైగా విలువైన చీరల దొంగతనానికి పాల్పడిందని ఆరోపిస్తూ సదరు షాపు యజమాని ఒక మహిళపై విచక్షణా రహితంగా దాడి చేశాడు. షాపు యజమానికి తోడు మరొక వ్యక్తి కూడా కలిసి ఆమెను మహిళ అనే కనీస కనికరం లేకుండా బూటు కాళ్లతో కడుపులో తన్నారు. పట్టపగలు అందరూ చూస్తుండగా.. ఆ మహిళను షాపు నుంచి ఈడ్చుకొచ్చి.. తిడుతూ, కొడుతూ.. ఆ చీరల దుకాణం యజమాని అమానుషంగా ప్రవర్తించాడు. అందరూ ఈ దాడిని కళ్లప్పగించి చూశారే తప్ప ఏ ఒక్కరూ మహిళను కొడుతున్న ఇద్దరినీ అడ్డుకోకపోవడం ప్రస్తుత సమాజ తీరుకు నిదర్శనం.

బెంగళూరులోని అవెన్యూ రోడ్లో ఈ ఘటన జరిగింది. ఈ ఘటన గురించి పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. మాయా సిల్క్ శారీస్ పేరుతో బెంగళూరులోని చిక్ పేటలో కరూర్ వైశ్యా బ్యాంక్ దగ్గరలో ఉమేష్​ రామ్ అనే వ్యక్తి చీరల దుకాణం నడిపిస్తున్నాడు. తన షాపు నుంచి ఒక మహిళ 61 చీరలను దొంగతనం చేసిందని సెప్టెంబర్ 20న సదరు షాపు యజమాని పోలీసులకు ఫిర్యాదు చేశాడు.

►ALSO READ | Ladakh protest: లడాఖ్ అల్లర్ల కేసు.. సోనమ్ వాంగ్ చుక్ అరెస్ట్

సెప్టెంబర్ 20న మధ్యాహ్నం 12.30 సమయంలో.. ఒక పెద్ద మూటతో మహిళ వెళుతున్న దృశ్యాలు సీసీ కెమెరాల్లో రికార్డయ్యాయి. ఆ వీడియోను చూసిన చీరల దుకాణం ఓనర్ పోలీసులు విచారించే లోపు అత్యుత్సాహం ప్రదర్శించి మరుసటి రోజు అదే ఏరియాలో కనిపించిన సదరు మహిళపై విచక్షణారహితంగా దాడి చేశారు. నిజంగానే ఆమె దొంగతనానికి పాల్పడి ఉంటే పోలీసులు అరెస్ట్ చేసి జైలుకు పంపిస్తారని.. అంతేగానీ ఇలా చట్టాన్ని చేతుల్లోకి తీసుకుని షాపు ఓనర్ ఆమెను ఇష్టమొచ్చినట్టు కొట్టడం ఏంటని ఈ దాడికి సంబంధించిన వీడియో చూసిన నెటిజన్లు స్పందిస్తున్నారు.