
- వీవీఎంసీ టౌన్ ప్లానింగ్ డిప్యూటీ డైరెక్టర్ వైఎస్ రెడ్డి ఇండ్లల్లో తనిఖీలు
- రెండు రోజుల పాటు కొనసాగిన సోదాలు
- ముంబై వసాయి భూ కుంభకోణంలో కీలక నిందితుడు
హైదరాబాద్, వెలుగు: ముంబై వసాయిలో జరిగిన భారీ భూ స్కామ్‌లో భాగంగా ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) అధికారులు హైదరాబాద్‌లో సోదాలు నిర్వహించారు. ముంబై వీవీఎంసీ టౌన్ ప్లానింగ్ డిప్యూటీ డైరెక్టర్ యాదిగిరి శివకుమార్ రెడ్డి( వైఎస్ రెడ్డి)కి చెందిన ఇండ్లు, ఆయన బంధువుల నివాసాల్లో తనిఖీలు చేశారు. ముంబైతో పాటు హైదరాబాద్‌లోని మొత్తం 13 ప్రాంతాల్లో బుధ, గురువారాల్లో సోదాలు జరిపారు.
వైఎస్ రెడ్డి ఇండ్లల్లో రూ.8.06 కోట్ల నగదు రూ.23.25 కోట్లు విలువ చేసే బంగారం, వజ్రాలను ఈడీ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. అన్ని చోట్ల కలిపి మొత్తం రూ.9.04 కోట్ల నగదు సీజ్ చేశారు. సీజ్ చేసిన మొత్తం విలువ సుమారు రూ.32 కోట్లకు పైగా ఉంటుందని అధికారులు అంచనా వేశారు. ఏపీ, తెలంగాణలోని స్థిరాస్తులకు సంబంధించి పెద్దమొత్తంలో డాక్యుమెంట్లను స్వాధీనం చేసుకున్నారు. ఈ మేరకు గురువారం విడుదల చేసిన ఓ ప్రకటనలో అధికారులు పూర్తి వివరాలు వెల్లడించారు.
వేల కోట్లు విలువ చేసే భూ ఆక్రమణ
ముంబై వసాయి విరార్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని ప్రభుత్వ, ప్రైవేట్ భూముల్లో రెసిడెన్సియల్, కమర్షియల్ కాంప్లెక్సులు అక్రమంగా నిర్మించారు. వీవీఎంసీ అభివృద్ధి ప్రణాళిక ప్రకారం.. ఆ భూములు మురుగునీటి శుద్ధి కర్మాగారం, డంపింగ్ గ్రౌండ్ నిర్మాణం కోసం రిజర్వ్ చేశారు. ఇందులో 2009 నుంచి 41 అక్రమ భవనాలు నిర్మించారు. ప్లాట్లుగా డివైడ్ చేసి అమ్మేశారు. ఇలా వేల కోట్ల రూపాయలు అక్రమంగా సంపాదించారు.
అక్రమ నిర్మాణాలు కావడంతో ప్లాట్ ఓనర్లకు వీవీఎంసీ అధికారులు నోటీసులు ఇచ్చారు. కూల్చేందుకు సిద్ధమయ్యారు. దీంతో బాధితులు బాంబే హైకోర్టును ఆశ్రయించారు. విచారణ జరిపిన హైకోర్టు.. గతేడాది జులై 8న తీర్పు వెల్లడించింది. 41 భవనాలను కూల్చేయాలని ఆదేశించింది. బాంబే హైకోర్టు తీర్పును సవాల్ చేస్తూ బాధిత కుటుంబాలు సుప్రీం కోర్టులో స్పెషల్‌లీవ్ పిటిషన్ దాఖలు చేశాయి. వీటిని సుప్రీం కోర్టు కొట్టేసింది. బాంబే హైకోర్టు ఆదేశాల మేరకు.. ఈ ఏడాది ఫిబ్రవర 20న వీవీఎంసీ అధికారులు 41 అక్రమ నిర్మాణాలను కూల్చేశారు.
నిర్మాణాలకు అనుమతిచ్చిన టౌన్ ప్లానింగ్ డీడీ వైఎస్ రెడ్డి
ముంబైలోని మీరా భయాందర్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో నమోదైన కేసుల ఆధారంగా ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) దర్యాప్తు చేసింది. ఈ స్కామ్‌లో కీలక నిందితులుగా బిల్డర్లు సీతారాం గుప్తా, అరుణ్ గుప్తా సహా మరికొంత మందిని గుర్తించింది. అక్రమ నిర్మాణాలకు వీవీఎంసీ టౌన్ ప్లానింగ్ డిప్యూటీ డైరెక్టర్ యాదగిరి శివకుమార్ రెడ్డి (వైఎస్‌రెడ్డి) అనుమతులు ఇచ్చినట్లు ఈడీ విచారణలో తేలింది. మరికొంత మంది వీవీఎంసీ అధికారులతో కలిసి అనుమతులు మంజూరు చేసినట్టు స్పష్టమైంది. దర్యాప్తులో భాగంగానే తాజాగా వైఎస్ రెడ్డి నివాసంలో ఈడీ అధికారులు సోదాలు నిర్వహించి నగదు, బంగారం, వజ్రాలు ఈడీ అధికారులు స్వాధీనం చేసుకున్నారు.