చైనా లోన్​యాప్ వ్యవహారంలో తనిఖీలు

చైనా లోన్​యాప్ వ్యవహారంలో తనిఖీలు

న్యూఢిల్లీ: లోన్​యాప్​ల పేరిట చైనా యాప్​ల అక్రమ దందాలకు సంబంధించి ఎన్​ఫోర్స్​మెంట్​ డైరెక్టరేట్(ఈడీ) శనివారం బెంగళూరులో పలుచోట్ల రెయిడ్స్ నిర్వహించింది. పేటీయం ఆఫీసులో అధికారులు సోదాలు చేశారు. పేటీయంతో పాటు రేజోర్​పే, క్యాష్​ఫ్రీ కంపెనీల ఆఫీసులు సహా సిటీలో ఆరు చోట్ల తనిఖీలు చేపట్టారు.

చైనా వ్యక్తుల కంపెనీల పేరుతో వివిధ బ్యాంకు ఖాతాల్లో రూ.17 కోట్ల నగదును గుర్తించినట్లు తెలిపారు. చైనా కంపెనీలు తప్పుడు డాక్యుమెంట్లు, డమ్మీ డైరెక్టర్ల పేరుతో మన దేశంలో లోన్​ యాప్​లను నిర్వహిస్తున్నాయని అధికారులు చెప్పారు. వేర్వేరు మర్చంట్​ ఐడీలు, ఖాతాలు, తప్పుడు అడ్రస్​లతో ఈ దందా నడిపిస్తున్నట్లు వివరించారు.

లోన్​ యాప్​ వేధింపులకు సంబంధించి ఒక్క బెంగళూరు సిటీలోనే కనీసం 18 ఎఫ్​ఐఆర్​లు నమోదయ్యాయని చెప్పారు. కాగా, ఈడీ తనిఖీలపై రేజోర్​ పే, క్యాష్​ఫ్రీ కంపెనీల ప్రతినిధులు స్పందించారు. అధికారులకు సహకరిస్తున్నట్లు వివరించారు. అయితే, పేటీయం ప్రతినిధులు మాత్రం ఈ వ్యవహారంపై ఎలాంటి ప్రకటన చేయలేదు.