నరేష్ గోయల్ ఇళ్లపై ఈడీ దాడులు

నరేష్ గోయల్ ఇళ్లపై ఈడీ దాడులు

న్యూఢిల్లీ: జెట్ ఎయిర్‌‌‌‌వేస్ ఫౌండర్ నరేష్ గోయల్‌‌ నివాసాల్లో ఎన్‌‌ఫోర్స్‌‌మెంట్ డైరెక్టరేట్(ఈడీ) దాడులు చేసింది. ఫారిన్ డైరెక్ట్ ఇన్వెస్ట్‌‌మెంట్(ఎఫ్‌‌డీఐ) నిబంధనలు ఉల్లంఘించారనే ఆరోపణల నేపథ్యంలో ఈ రైడ్స్ నిర్వహించింది. ముంబై, ఢిల్లీలోని 12కి పైగా ప్రాంతాల్లో ఈ విచారణ సంస్థ తనిఖీలు చేపట్టింది. ఫారిన్ ఎక్సేంజ్‌‌ మేనేజ్‌‌మెంట్(ఫెమా) ప్రొవిజన్ల కింద ఈ తనిఖీలు చేపట్టినట్టు ఈడీ పేర్కొంది. జెట్ ప్రివిలైజ్ ప్రైవేట్ లిమిటెడ్‌‌(జేపీపీఎల్)లో ఎతిహాద్ ఎయిర్‌‌‌‌వేస్ పెట్టుబడుల విషయంలో అదనపు సాక్ష్యాధారాలు సేకరించడమే లక్ష్యంగా ఈడీ దాడులు జరిగాయి. 2014లో జేపీపీఎల్‌‌లో యూఏఈకి చెందిన ఈ ఎయిర్‌‌‌‌లైన్ వాటాలు కొనేటప్పుడు ఎఫ్‌‌డీఐ నిబంధనల ఉల్లంఘన జరిగిందని ఈడీ భావిస్తోంది. సంబంధిత అథారిటీలకు తాము పూర్తిగా సహకరిస్తామని, పలు దేశాల చట్టాలకు తాము కట్టుబడి ఉన్నామని ఎతిహాద్ అధికార ప్రతినిధి చెప్పారు.

రూ.26 వేల కోట్లకు పైగా పెరిగిన అప్పులు

నిధులు లేకపోవడంతో జెట్‌‌ ఎయిర్‌‌‌‌వేస్ తన కార్యకలాపాలను ఏప్రిల్ 17న మూసివేసింది. వేలమంది ఉద్యోగులు రోడ్డున పడ్డారు. ఈ ఎయిర్‌‌‌‌లైన్‌‌కు చెందిన స్లాట్స్‌‌ను కూడా ఇతర ఎయిర్‌‌‌‌లైన్‌‌ సంస్థలకు తాత్కాలిక బేసిస్‌‌లో లీజ్‌‌కు ఇచ్చారు. ప్రస్తుతం ఎన్సీఎల్టీలో దివాలా కేసు విచారణలో ఉంది.