లాలూ ప్రసాద్ బంధువుల ఇండ్లపై ఈడీ దాడులు

లాలూ ప్రసాద్ బంధువుల ఇండ్లపై ఈడీ దాడులు

ల్యాండ్ ఫర్ జాబ్ స్కామ్ కేసులో ఢిల్లీ, బీహార్ లోని లాలూ ప్రసాద్ యాదవ్ బంధువులపై 15 చోట్ల ఈడీ దాడులు జరిపింది. లాలూ ప్రసాద్ కుమార్తె మిసా భారతితో పాటు బీహార్‌లోని ఆర్జేడీ నేత, మాజీ ఎమ్మెల్యే అబు దోజానా నివాసాల్లోనూ ఈడీ సోదాలు నిర్వహించినట్లు తెలిపింది. ఈడీ పలు బృందాలుగా విడిపోయి ఏకకాలంలో దాడులు జరిపారు. 

ఈ వ్యవహారంలో లాలూ ప్రసాద్‌పై సీబీఐ కేసును పరిగణనలోకి తీసుకొని ఈసీఐఆర్ దాఖలు చేసిన తర్వాత మనీలాండరింగ్ నిరోధక చట్టంలోని నిబంధనల ప్రకారం ఈడీ ఈ సోదాలు నిర్వహించింది. ల్యాండ్ ఫర్ జాబ్ స్కామ్ కేసుకు సంబంధించి లాలూ ప్రసాద్ ను సీబీఐ ప్రశ్నించిన కొద్దిరోజుల తర్వాత ఫెడరల్ ఏజెన్సీ ఈ సోదాలు నిర్వహించడం గమనార్థం. మంగళవారం లాలూ ప్రసాద్‌ను సీబీఐ రెండు సెషన్లలో దాదాపు ఐదు గంటల పాటు ప్రశ్నించింది. బీహార్ లో లాలూ ప్రసాద్ భార్య, బీహార్ మాజీ ముఖ్యమంత్రి రబ్రీ దేవిని కూడా సీబీఐ సోమవారం ఆమె నివాసంలో ఐదు గంటలకు పైగా విచారించింది.

లాలూ ప్రసాద్, రబ్రీ దేవితో పాటు మరో 14 మందిపై నేరపూరిత కుట్ర, అవినీతి నిరోధక చట్టంలోని నిబంధనల ప్రకారం సీబీఐ చార్జిషీట్ దాఖలు చేసింది. నిందితులకు మార్చి 15న తన ముందు హాజరుకావాలని సమన్లు జారీ చేసింది.