
న్యూఢిల్లీ: స్మార్ట్ఫోన్లు, ఎలక్ట్రానిక్ ప్రొడక్టులు తయారు చేసే చైనీస్ కంపెనీ వివో, దీని అనుబంధ సంస్థలకు చెందిన 44 ప్రాంతాల్లో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) మంగళవారం సోదాలు చేసింది. మనీలాండరింగ్ జరిగినట్టు ఆరోపణలు రావడంతో దాడులు చేశామని ఈడీ ఆఫీసర్లు ప్రకటించారు. ఢిల్లీ, ఉత్తరప్రదేశ్, మేఘాలయ, మహారాష్ట్రతోపాటు మరికొన్ని ప్రాంతాల్లో సోదాలు జరిగాయి. ఈ విషయమై వివో ఇంకా రెస్పాండ్ కాలేదు. ఇటీవల ఢిల్లీ ఎకనమిక్స్ అఫెన్సెస్ వింగ్ పోలీసులు జమ్మూకాశ్మీర్‌కు చెందిన ఒక డిస్ట్రిబ్యూటింగ్ ఏజెన్సీపై ఎఫ్ఐఆర్ రిజిస్టర్ చేశారు. కొందరు చైనీస్ షేర్హోల్డర్లు వారి గుర్తింపు డాక్యుమెంట్లను తారుమారు చేశారని ఆరోపించారు. పన్ను చెల్లించని ఆదాయాన్ని విదేశాలకు పంపించడానికి లేదా ఇతర బిజినెస్‌లో ఇన్వెస్ట్ చేయడానికి వీళ్లు పేర్లను తారుమారు చేసి షెల్/పేపర్ కంపెనీలను తెరిచి ఉంటారని ఈడీ అనుమానిస్తోంది. ఇండియాలో బిజినెస్ చేస్తున్న చైనీస్ కంపెనీలు సీరియస్ ఫైనాన్షియల్ క్రైమ్స్ చేస్తున్నాయని ఆరోపణలు రావడంతో గతంలోనూ ఇలాంటి దాడులు జరిగాయి. ఫారిన్ ఎక్స్ఛేంజ్ మేనేజ్మెంట్ యాక్ట్ (ఫెమా) రూల్స్‌ను ఉల్లంఘించిందని ఆరోపిస్తూ ఈడీ ఈ ఏడాది ఏప్రిల్‌లో షావోమీకి చెందిన రూ.5,551 కోట్ల విలువైన డిపాజిట్లను సీజ్ చేసింది. మరో చైనీస్ కంపెనీ హువావే ఖాతాపుస్తకాలను తారుమారు చేసిందని ఆరోపిస్తూ ఐటీశాఖ ఇదే ఏడాది ఫిబ్రవరిలో దాడులు జరిపింది. షావోమీ, ఒప్పో, వివోతో సహా అనేక చైనీస్ స్మార్ట్‌ఫోన్ కంపెనీలు, వాటి డిస్ట్రిబ్యూటర్ల ఆఫీసులపై కిందటి ఏడాది డిసెంబర్‌లో ఐటీ దాడులు నిర్వహించింది.