టార్గెట్ కాంగ్రెస్ .. చెన్నూర్​ అభ్యర్థి వివేక్ ఇండ్లు, ఆఫీసుల్లో ఐటీ, ఈడీ రెయిడ్స్

టార్గెట్ కాంగ్రెస్ ..  చెన్నూర్​ అభ్యర్థి వివేక్ ఇండ్లు, ఆఫీసుల్లో ఐటీ, ఈడీ రెయిడ్స్
  • హైదరాబాద్, మంచిర్యాల, ఎన్టీపీసీలో ఏకకాలంలో దాడులు
  • వివేక్ ప్రచారానికి వెళ్లకుండా అడ్డుకొని.. 12 గంటల పాటు సోదాలు
  • బాల్క సుమన్ ఫిర్యాదు చేసిన ఐదు రోజుల్లోనే ఐటీ, ఈడీ ఎంట్రీ
  • ఈ నెల 2న పొంగులేటి, కేఎల్ఆర్, 
  • కోమటిరెడ్డి, జానారెడ్డి లక్ష్యంగా ఐటీ సెర్చెస్


అసెంబ్లీ ఎన్నికల ముంగిట కాంగ్రెస్ పార్టీని లక్ష్యంగా చేసుకొని రాష్ట్రంలో ఈడీ, ఐటీ రెయిడ్స్ జరుగుతున్నాయి. ఇప్పటికే కాంగ్రెస్ అభ్యర్థులు పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, కిచ్చన్నగారి లక్ష్మారెడ్డి, కోమటిరెడ్డి తోడల్లుడు, జానారెడ్డి తనయుడు తదితరుల ఇండ్లు, ఆఫీసుల్లో ఐటీ  రెయిడ్స్​ జరగ్గా.. తాజాగా చెన్నూర్​ క్యాండిడేట్ వివేక్ వెంకటస్వామి, ఆయన కుటుంబసభ్యుల ఇండ్లు, ఆఫీసులపై ఐటీ, ఈడీ అధికారులు దాడులు చేశారు. వివేక్ సోదరుడు, బెల్లంపల్లి కాంగ్రెస్ అభ్యర్థి వినోద్ ఇండ్లలోనూ సోదాలు నిర్వహించారు. వివేక్​పై చెన్నూర్​ బీఆర్ఎస్ అభ్యర్థి బాల్క సుమన్ ఈసీకి ఫిర్యాదు చేసిన ఐదు రోజుల్లోనే ఈ దాడులు జరగడం గమనార్హం. దీంతో బీఆర్ఎస్, బీజేపీ ఒక్కటేనంటూ ఇన్నాళ్లూ తాము చేసిన ఆరోపణలకు బలం చేకూరుతున్నదని కాంగ్రెస్ లీడర్లు చెప్తున్నారు.

తెల్లవారుజాము నుంచే..

హైదరాబాద్‌‌, మంచిర్యాల, ఎన్టీపీసీలోని వివేక్, ఆయన కుటుంబసభ్యుల ఇండ్లు, విశాక ఇండస్ట్రీస్ ఆఫీసుల్లో మంగళవారం ఉదయం 5:30 నుంచి సాయంత్రం 6:00 వరకు ఈడీ, ఐటీ అధికారులు సోదాలు నిర్వహించారు. హైదరాబాద్‌‌లోని సోమాజిగూడలో వివేక్ ఇల్లు, కూతురు వైష్ణవి, కుమారుడు వంశీ సహా కుటుంబ సభ్యుల ఇండ్లు, బంజారాహిల్స్ రోడ్‌‌ నం. 12 గ్రీన్‌‌ బంజారాకాలనీలోని వినోద్‌‌ ఇల్లు, ఆయన కుటుంబసభ్యుల ఇండ్లలో తనిఖీలు నిర్వహించారు.

మంచిర్యాల, రామగుండంలోని వివేక్ నివాసాలతోపాటు బేగంపేటలోని విశాక ఇండస్ట్రీస్ కార్పొరేట్‌‌ ఆఫీస్‌‌లో సోదాలు చేశారు. సోమాజిగూడలోని వివేక్‌‌ ఇంటికి ముగ్గురు సభ్యులతో కూడిన ఈడీ అధికారుల బృందం వచ్చింది. అయితే ఆ ఇల్లు నిర్మాణంలో ఉండడం, కుటుంబ సభ్యులంతా చెన్నూర్​లో ఎన్నికల ప్రచారంలో ఉండడంతో ఉదయం 9.30 గంటలకు అక్కడి నుంచి వెళ్లిపోయారు. బేగంపేటలోని విశాక ఇండస్ట్రీస్‌‌ కార్పొరేట్ ఆఫీస్‌‌లో మధ్యాహ్నం 3 గంటలకు సోదాలు ప్రారంభించారు. కంపెనీకి చెందిన బ్యాంక్‌‌ లావాదేవీలను పరిశీలించారు. ఈ నెలలో జరిగిన ఆర్థిక లావాదేవీల వివరాలు సేకరించారు. ప్రధానంగా విశాక ఇండస్ట్రీస్‌‌కు చెందిన హెచ్‌‌డీఎఫ్‌‌సీ అకౌంట్స్‌‌, ఐడీబీఐ బ్యాంక్‌‌లోని విజిలెన్స్‌‌ సెక్యూరిటీ సర్వీసెస్‌‌ ప్రైవేట్ లిమిటెడ్‌‌ అకౌంట్స్‌‌ ట్రాన్సాక్షన్స్‌‌ను పరిశీలించారు. బంజారాహిల్స్‌‌ రోడ్‌‌ నంబర్‌‌ 12 గ్రీన్‌‌ బంజారా కాలనీలో వివేక్ సోదరుడు వినోద్‌‌ ఇంట్లో ఉదయం 6 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు సోదాలు నిర్వహించారు. వినోద్‌‌కు సంబంధించిన వ్యాపారాలు, ఆర్థిక లావాదేవీలు, కుటుంబ సభ్యుల బ్యాంక్ అకౌంట్స్‌‌ వివరాలను సేకరించారు. హైదరాబాద్‌‌లో సోదాలు జరుగుతున్న టైమ్‌‌లో వివేక్ వెంకటస్వామి, వినోద్‌‌ కుమార్‌‌‌‌ తమ నియోజకవర్గాల్లోని తాత్కాలిక నివాసాల్లో ఉన్నారు.

ప్రచారానికి వెళ్లకుండా అడ్డుకొని..

10 మంది ఐటీ, ఈడీ అధికారులు ప్రత్యేక పోలీసు బలగాలతోపాటు మంచిర్యాల హైటెక్ సిటీ కాలనీలోని వివేక్ ఇంటికి చేరుకున్నారు. లోపలికి ఎవరూ రాకుండా గేట్లు క్లోజ్ చేసి బందోబస్తు ఏర్పాటు చేశారు. దీంతో ప్రచారానికి వెళ్లడానికి సిద్ధమవుతున్న వివేక్ ఆగిపోయారు. ఇంట్లో ఉన్న ఆయన భార్య సరోజ, కుమారుడు వంశీకృష్ణ, అల్లుడు వరుణ్, కుటుంబ సభ్యులు విచారణకు పూర్తిగా సహకరించారు. సాయంత్రం వరకు అధికారులు బయటకు రాకపోవడం, లోపలికి ఎవరినీ పంపకపోవడంతో అసలు ఏం జరుగుతున్నదో తెలియరాలేదు. వివేక్ ఇంటిపై ఐటీ, ఈడీ రెయిడ్స్ గురించి తెలుసుకున్న చెన్నూర్​నియోజకవర్గ కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు, మీడియా ప్రతినిధులు పెద్ద సంఖ్యలో అక్కడికి చేరుకున్నారు. చెన్నూర్ మాజీ ఎమ్మెల్యే నల్లాల ఓదెలు, ఐఎన్ టీయూసీ సెక్రటరీ జనరల్ జనక్ ప్రసాద్, నాయకులు కేవీ ప్రతాప్, రఘునాథ్ రెడ్డి, ఓడ్నాల శ్రీనివాస్, చేగుర్తి సత్యనారాయణ రెడ్డి, రిక్కుల శ్రీనివాసరెడ్డి, విశ్వంభర్ రెడ్డి, అబ్దుల్ అజీజ్ తదితరులు కార్యకర్తలతోపాటు తరలివచ్చారు. ఐటీ రెయిడ్స్‌‌కు వ్యతిరేకంగా ఆందోళనకు దిగారు. బీజేపీ, బీఆర్ఎస్ కుట్రలో భాగంగానే ఈ దాడులు జరుగుతున్నాయని ఆరోపించారు. ప్రధాని నరేంద్ర మోదీ, సీఎం కేసీఆర్, ఎమ్మెల్యే బాల్క సుమన్ డౌన్‌‌డౌన్‌‌ అంటూ నినాదాలు చేశారు. బాల్క సుమన్‌‌కు ఓటమి భయం పట్టుకుందని, వివేక్ గెలుపు ఖాయమని అన్నారు. ఐటీ అధికారులు రెయిడ్స్‌‌ ఆపేసి వెంటనే బయటకు రావాలని డిమాండ్ చేశారు. దీంతో పోలీసులు అలర్ట్ అయ్యారు. మంచిర్యాల ఏసీపీ తిరుపతిరెడ్డి, టౌన్ సీఐ ముస్క రాజు, ట్రాఫిక్ సీఐ నరేష్, పలువురు ఎస్ఐలు, స్పెషల్ ఫోర్స్ సిబ్బంది బందోబస్తు ఏర్పాటు చేశారు. సాయంత్రం వరకు వివేక్ నివాసం వద్ద ఉద్రిక్తత కొనసాగింది. సాయంత్రం 6.15 గంటలకు ఐటీ, ఈడీ అధికారులు బయటకు వచ్చారు. వెంట తీసుకొచ్చిన ప్రింటింగ్ మెషీన్, బ్యాగుతో వెళ్లిపోయారు.

ఎన్టీపీసీలోని నివాసంలోనూ..

గోదావరిఖని ఎన్టీపీసీ ఏరియాలోని వివేక్‌‌‌‌ నివాసంలోనూ ఐటీ ఆఫీసర్లు సోదాలు చేశారు. హైదరాబాద్‌‌‌‌ నుంచి సీఐఎస్‌‌‌‌ఎఫ్‌‌‌‌ బలగాలతో వచ్చిన ఆఫీసర్లు ఉదయం 5.30 గంటల నుంచి 11 గంటల వరకు సోదాలు చేశారు. వివేక్‌‌ ఇండ్లపై ఐటీ, ఈడీ ఆఫీసర్ల దాడుల వెనుక బీఆర్‌‌‌‌ఎస్‌‌‌‌, బీజేపీ లీడర్ల హస్తం ఉందని ఐఎన్‌‌‌‌టీయూసీ సీనియర్‌‌‌‌ వైస్‌‌‌‌ ప్రెసిడెంట్‌‌‌‌ గుమ్మడి కుమారస్వామి, కాంగ్రెస్‌‌‌‌ నేత పి.మల్లికార్జున్‌‌‌‌ ఆరోపించారు. కాంగ్రెస్‌‌‌‌ లీడర్ల ఇండ్లపై ఐటీ దాడులతో బీజేపీ, బీఆర్‌‌‌‌ఎస్‌‌‌‌ ఒక్కటేనని తేలిపోయిందని పేర్కొన్నారు.

వరుస దాడులు

ఈ నెల 2న కాంగ్రెస్ లీడర్లే లక్ష్యంగా ఐటీ రెయిడ్స్ జరిగాయి. ఆ రోజు 14 ప్రాంతాల్లో 32 బృందాలు ఏకకాలంలో సోదాలు చేశాయి. రంగారెడ్డి జిల్లా మహేశ్వరం కాంగ్రెస్ అభ్యర్థి కిచ్చన్నగారి లక్ష్మారెడ్డి నివాసంపై అధికారులు మెరుపు దాడులకు దిగారు. కేఎల్ఆర్‌‌‌‌కు టికెట్ దక్కిన కొన్ని రోజుల్లోనే ఈ సోదాలు జరగడం గమనార్హం. మంత్రి సబితా ఇంద్రారెడ్డి, కొందరు బీఆర్ఎస్ నేతల ప్రోద్బలంతోనే ఈ దాడులు జరిగాయని కాంగ్రెస్ ఆరోపిస్తున్నది. బడంగ్‌‌పేట మేయర్ పారిజాత నర్సింహారెడ్డి ఇంటిపైనా దాడులు చేశారు. వీళ్ల అనుచరులు, బంధువుల ఇండ్లలో సోదాలు జరిగాయి. ఇక కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి తోడల్లుడు గిరిధర్ రెడ్డి నివాసంపైనా ఐటీ అధికారులు రెయిడ్స్ చేశారు. తర్వాత ఎల్బీనగర్ కాంగ్రెస్ అభ్యర్థి మధుయాష్కీ ఇంటిపై పోలీసులు దాడి చేశారు. ఈ నెల 14న అర్ధరాత్రి దాటాక హయత్ నగర్ లోని మధుయాష్కీ ఇంటికి వచ్చిన పోలీసులు.. ఎలాంటి సెర్చ్ వారెంట్ లేకుండానే చొరబడి కుటుంబ సభ్యులను భయభ్రాంతులకు గురిచేశారు. ఓటమి భయంతోనే బీఆర్ఎస్ అభ్యర్థి సుధీర్ రెడ్డి తన ఇంటిపైకి పోలీసులను పంపారని మధుయాష్కీ ఆరోపించారు. దీనిపై ఆయన ఈసీకి కూడా ఫిర్యాదు చేశారు.

రాజకీయ కక్షతోనే వివేక్ ఇంటిపై ఐటీ దాడులు

    మాల ప్రజా సంఘాల జేఏసీ చైర్మన్ చెన్నయ్య
ఖైరతాబాద్, వెలుగు: మాజీ ఎంపీ, చెన్నూర్​కాంగ్రెస్ అభ్యర్థి వివేక్ వెంకటస్వామి ఇల్లు, ఆఫీసులపై జరిగిన ఐటీ దాడులను ఖండిస్తున్నట్లు మాల ప్రజా సంఘాల జేఏసీ చైర్మన్ జి. చెన్నయ్య తెలిపారు. మంగళవారం బంజారాహిల్స్ లోని ఆఫీసులో ఆయన మాట్లాడారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కుమ్మక్కు కాంగ్రెస్ అభ్యర్థులను టార్గెట్ చేశాయని చెన్నయ్య ఆరోపించారు. రాజకీయ కక్షతోనే ఐటీ,ఈడీలతో దాడులు చేయిస్తున్నాయని విమర్శించారు. ఎన్ని కుట్రలు చేసినా రాష్ట్రంలో కాంగ్రెస్ ను గెలిపించుకుంటామని స్పష్టం చేశారు. దళితులను టార్గెట్ చేస్తే ఊరుకునేది లేదన్నారు. బీఆర్ఎస్ మంత్రులు, ఎమ్మెల్యేల మీద ఎందుకు ఐటీ దాడులు జరగడం లేదని చెన్నయ్య ప్రశ్నించారు.  

చెన్నూర్​లో బీఆర్ఎస్‌‌కు ఓటమి భయం

చెన్నూర్​లో ఓడిపోతున్నామనే భయంతోనే బీజేపీతో బీఆర్ఎస్ కుమ్మక్కై వివేక్ ఇల్లు, ఆఫీసులపై ఐటీ, ఈడీ దాడులు చేయిస్తున్నా రు. ఇంతకు ముందు కూడా కాంగ్రెస్ నేతల ఇండ్లే లక్ష్యంగా ఐటీ సోదాలు జరిగాయి. కాంగ్రెస్ కార్యకర్తలు మరింత కసిగా పనిచేసి బీఆర్ఎస్‌‌ను చిత్తుగా ఓడించాలి.
- మాజీ ఎంపీ, పొన్నం ప్రభాకర్

రాజకీయ కక్షతోనే దాడులు

వివేక్ వెంకటస్వామి ఇండ్లు, ఆఫీసుల్లో సోదాల వెనక రాజకీయ దురుద్దేశం ఉంది. వివేక్ సంస్థలన్నీ టైమ్ ప్రకారం అన్ని పన్నులు సక్రమంగా కడుతున్నాయి. ఆయన సంస్థలు సక్రమంగా నడుస్తున్నాయి. కొన్ని దశాబ్దాలుగా ప్రభుత్వ రూల్స్ ప్రకారం ఐటీ పన్ను చెల్లిస్తున్న ఏకైక వ్యక్తి వివేక్ వెంకట స్వామి. చెన్నూర్​లో బాల్క సుమన్ ఓటమి ఖాయమైంది. ఎవరెన్ని కుట్రలు, కుతంత్రాలు చేసినా.. ఓటర్లలో మార్పు రాదు.
- మాజీ ఎమ్మెల్యే నల్లాల ఓదెలు

ప్రజల్లో గెలవలేమని తెలిసి రెయిడ్స్​

ఓటమి భయంతోనే బీజేపీ, బీఆర్ఎస్ కుమ్మక్కై వివేక్ ఇంటిపై దాడులు చేయిస్తున్నాయి. ప్రజల్లో గెలవలేమని గ్రహించే ఈ దాడులకు దిగుతున్నారు. గతంలో కేఎల్ఆర్, పారిజాత నర్సింహారెడ్డి ఇండ్లపైనా ఐటీ దాడులు జరిగాయి. 

ALSO READ :  పోలింగ్ డ్యూటీ పక్కాగా చేయాలి : జి .రవి నాయక్
- ఐఎన్ టీయూసీ నేత జనక్ ప్రసాద్

చీకటి మిత్రుడు కేసీఆర్ కోసమే ఐటీ, ఈడీలను  ఉసిగొల్పుతున్నరు

వివేక్‌‌ ఇండ్లపై దాడులను ఖండిస్తున్నా: రేవంత్
కాంగ్రెస్ గెలుపును వాళ్ల కుతంత్రాలు ఆపలేవని ట్వీట్

కాంగ్రెస్ పార్టీ చెన్నూర్​ అభ్యర్థి వివేక్ వెంకటస్వామి ఇండ్లు, ఆఫీసులపై ఐటీ దాడులు చేయడాన్ని పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి ఖండించారు. ‘‘తన చీకటి మిత్రుడు కేసీఆర్ గెలుపు కోసం దింపుడు కళ్లం ఆశతో ప్రధాని మోదీ తన పెంపుడు కుక్కల్లాంటి ఈడీ, ఐటీలను కాంగ్రెస్ నేతల ఇండ్లపైకి ఉసిగొల్పుతున్నారు. వివేక్ వెంకటస్వామి ఇండ్లపై దాడులను తీవ్రంగా ఖండిస్తున్నా. మీ కుతంత్రాలు కాంగ్రెస్ గెలుపును ఆపలేవు’’ అని ఆయన ట్వీట్ చేశారు.