తల వెంట్రుకల స్మగ్లింగ్‌‌‌‌ కేసు.. ఈడీ చార్జ్‌‌‌‌షీట్‌‌‌‌

తల వెంట్రుకల స్మగ్లింగ్‌‌‌‌ కేసు.. ఈడీ చార్జ్‌‌‌‌షీట్‌‌‌‌
  • మిజోరం మీదుగా చైనాకు హెయిర్ స్మగ్లింగ్‌‌‌‌
  • ఫోర్జరీ డాక్యుమెంట్లతో ఎక్స్‌‌‌‌పోర్ట్స్‌‌‌‌

హైదరాబాద్‌‌‌‌,వెలుగు: తల వెంట్రుకలను విదేశాలకు స్మగ్లింగ్‌‌‌‌ చేసిన కేసులో ఎన్‌‌‌‌ఫోర్స్‌‌‌‌మెంట్‌‌‌‌ డైరెక్టరేట్‌‌‌‌(ఈడీ) నాంపల్లి కోర్టులో ప్రాసిక్యూషన్‌‌‌‌ కంప్లైంట్‌‌‌‌(పీసీ)ను దాఖలు చేసింది. నైల ఫ్యామిలీ ఎక్స్‌‌‌‌పోర్ట్స్‌‌‌‌ లిమిటెడ్‌‌‌‌కు చెందిన లూకాస్ తంగ్మాంగ్లియానా సహా మరో 16 మంది నిందితులపై ప్రివెన్షన్‌‌‌‌ ఆఫ్ మనీ లాండరింగ్‌‌‌‌ కింద అభియోగాలు మోపింది.

వివరాలను ఈడీ అధికారులు సోమవారం మీడియాకు వెల్లడించారు. గతేడాది ఆగస్టు 21న ప్రాసిక్యూషన్‌‌‌‌ కంప్లైంట్‌‌‌‌ను ఈడీ కోర్టులో దాఖలు చేసినట్లు తెలిపారు. తప్పుడు ధ్రువపత్రాలు, బినామీ ఇంపోర్ట్‌‌‌‌, ఎక్స్‌‌‌‌పోర్ట్‌‌‌‌ కోడ్‌‌‌‌(ఐఈసీ)లను  వినియోగించి నైల ఫ్యామిలీ ఎక్స్‌‌‌‌పోర్ట్స్‌‌‌‌ ప్రైవేట్ లిమిటెడ్‌‌‌‌ కంపెనీలు.. మనుషుల తల వెంట్రుకలను ఇతర దేశాలకు స్మగ్లింగ్ చేస్తున్నారు.

మిజోరం మీదుగా చైనాకు ట్రాన్స్‌‌‌‌పోర్ట్

మిజోరం నుంచి చైనాతో పలు దేశాలకు ఎగుమతి చేస్తున్నట్టు గతంలో హైదరాబాద్‌‌‌‌ సీసీఎస్‌‌‌‌ పోలీసులు పలు సెక్షన్ల కింద నిందితులపై కేసులు పెట్టారు. ఇందులో మనీలాండరింగ్‌‌‌‌పై ఈడీ దర్యాప్తు చేపట్టింది. కీలక నిందితుడైన మిజోరంకు చెందిన లూకాస్ తంగ్మాంగ్లియానా ఈ అక్రమ రవాణా చేస్తున్నట్టు గుర్తించారు. కేసు దర్యాప్తులో భాగంగా మిజోరం, హైదరాబద్‌‌‌‌లోని పలు ప్రాంతాల్లో సోదాలు జరిపి రూ.1.21 కోట్ల లెక్కల్లో లేని నగదును స్వాధీనం చేసుకోవడంతోపాటు 100కు పైగా బ్యాంకు ఖాతాల్లోని రూ.7.85 కోట్లు ఫ్రీజ్ చేశారు. హైదరాబాద్‌‌‌‌లోని పలు కంపెనీలు కూడా ఈ బ్యాంకు ఖాతాల నుంచి నగదు పొందినట్టు, హవాలా మార్గంలోనూ నగదు లావాదేవీలు జరిగినట్టు ఈడీ అధికారులు గుర్తించారు.