- 9న బేగంపేట ఎయిర్‌పోర్టులో ఫాల్కన్ గ్రూపు ఎయిర్ క్రాఫ్ట్ వేలం
- డిస్కౌంటింగ్ స్కీమ్ పేరుతో ఫాల్కన్ గ్రూపు భారీ మోసం
- 6,979 మంది నుంచి రూ.1,700 కోట్లు వసూలు
- డిపాజిటర్లకు రూ.850 కోట్లు చెల్లించకుండా ఫ్రాడ్
- మార్చి 7న హాకర్ 800 ఏ ఎయిర్ క్రాఫ్ట్‌ను సీజ్ చేసిన ఈడీ
హైదరాబాద్, వెలుగు: ఇన్‌వాయిస్ డిస్కౌంటింగ్ పేరుతో రూ.850 కోట్లు మోసం చేసిన కేసులో ఫాల్కన్ క్యాపిటల్ ప్రొటెక్షన్ ఫోర్స్ ప్రైవేట్ లిమిటెడ్‌కు చెందిన ఎయిర్ క్రాఫ్ట్‌ను ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్(ఈడీ) వేలానికి పెట్టింది. హాకర్ 800 ఏ (రిజిస్ట్రేషన్ నంబర్ ఎన్935హెచ్)ను వేలం వేయనున్నట్టు హైదరాబాద్ జోనల్ ఈడీ కార్యాలయం మంగళవారం ఒక ప్రకటనలో పేర్కొంది. మెటల్ స్క్రాప్ ట్రేడ్ కార్పొరేషన్ (ఎమ్‌ఎస్‌టీసీ) లిమిటెడ్ ద్వారా వేలం వేయనున్నట్టు వెల్లడించింది. వేలంలో పాల్గొనాలనుకునే వారు ఈ నెల7 నుంచి బేగంపేట ఎయిర్‌పోర్టులో ఎయిర్ క్రాఫ్ట్‌ను తనిఖీ చేసుకోవచ్చని తెలిపింది. పరిశీలనల అనంతరం 9న వేలం వేయనున్నట్టు వెల్లడించింది. ఆసక్తి గలవారు “MSTC/HYD/Directorate of Enforcement/3/Hyderabad/25-26/45608” లింకు ద్వారా సంప్రదించాలని సూచించింది. హాకర్ ఎయిర్ క్రాఫ్ట్ వేలం ద్వారా వచ్చే ఆదాయాన్ని స్కామ్ బాధితులకు తిరిగి చెల్లించనున్నట్టు ఈడీ అధికారులు వెల్లడించారు.
ఎయిర్ అంబులెన్స్‌గా హాకర్ 800 ఏ
ప్రధాన నిందితుడు అమర్‌దీప్ కుమార్ విదేశాలకు పారిపోగా అతని సోదరుడు సందీప్ కుమార్, చార్టర్డ్ అకౌంటెంట్ శరద్ చంద్ర తోష్నివాల్, క్యాపిటల్ ప్రొటెక్షన్ ఫోర్స్ ప్రైవేట్ లిమిటెడ్ సీవోవో ఆర్యన్ సింగ్ ఛబ్రాను ఇప్పటికే ఈడీ అరెస్ట్ చేసింది. దర్యాప్తులో భాగంగా రూ.18.63 కోట్ల విలువైన ఆస్తులను తాత్కాలికంగా జప్తు చేసింది. అక్టోబర్ 9న రంగారెడ్డిలోని స్పెషల్ కోర్టులో ప్రివెన్షన్ ఆఫ్ మనీలాండరింగ్ కింద ప్రాసిక్యూషన్ కంప్లైంట్ దాఖలు చేసింది.
కాగా, అమర్‌దీప్ కుమార్ 2024లో యూఎస్‌ఏకు చెందిన ప్రెస్టీజ్ జెట్స్ ఇంక్ అనే కంపెనీ ద్వారా 1.6 మిలియన్ డాలర్ల (సుమారు రూ.14.37 కోట్లు)తో బిజినెస్ ఎయిర్ క్రాఫ్ట్ ‘ఎన్935హెచ్ హాకర్ 800ఏ’ కొనుగోలు చేశాడు. వ్యాపార అవసరాలు, మెడికల్ అంబులెన్స్‌కు వినియోగించే విధంగా మరో రూ.3 కోట్లు ఖర్చు చేసి ఇంటీరియర్ చేయించాడు.
ఎయిర్ అంబులెన్స్‌గా గంటకు 3000 నుంచి 3500 డాలర్లు అద్దె వసూలు చేసేవాడు. ఐసీఏటీటీ వెబ్‌సైట్ ద్వారా దీనిని బుకింగ్ చేసేవారు. ఫాల్కన్ సంస్థ బోర్డు తిప్పేసిన తరువాత జనవరి 22న అమర్‌దీప్ కుమార్ తో పాటు వివేక్ సేత్ సహా సీఈఓ యోగేందర్, సీఓఓ ఆర్యన్ సింగ్ దుబాయ్‌కి పారిపోయారు. కాగా, ఎయిర్ క్రాఫ్ట్‌ను ఈ ఏడాది మార్చి 7న శంషాబాద్ ఎయిర్‌పోర్టులో ఈడీ సీజ్ చేసింది. అడ్జుడికేటింగ్ అథారిటీ నిబంధనల ప్రకారం విమానాన్ని వేలం వేసేందుకు నవంబర్ 20న అనుమతులు తీసుకుంది. ఈ మేరకు బేగంపేట్ ఎయిర్‌పోర్టులో వేలానికి ఏర్పాట్లు చేసినట్టు ఈడీ కార్యాలయం వెల్లడించింది.
రూ. 850 కోట్లు కొల్లగొట్టిన ఫాల్కన్ గ్రూప్
సైబరాబాద్ హైటెక్ సిటీలోని హుడా ఎన్‌క్లేవ్‌లో 2020లో ఫాల్కన్ (క్యాపిటల్ ప్రొటెక్షన్ ఫోర్స్ ప్రైవేట్ లిమిటెడ్) కంపెనీ ప్రారంభమయింది. బ్రిటానియా, అమెజాన్, గోద్రేజ్ తదితర సంస్థలతో తమకు సంబంధాలు ఉన్నాయంటూ నకిలీ ఒప్పంద పత్రాలను విస్తృతంగా ప్రచారం చేశారు. ఇన్వాయిస్ డిస్కౌంటింగ్ పేరుతో మూడు స్కీములను ఆఫర్ చేశారు. తమ వద్ద పెట్టుబడులు పెడితే 20- శాతం నుంచి 21.95 శాతం వడ్డీ రేటు చెల్లిస్తామని ప్రకటనలు ఇచ్చారు. ఇలా రూ.25 వేల నుంచి రూ.9 లక్షల టారిఫ్‌తో 2021 నుంచి డిపాజిట్లు సేకరించారు.
డిపాజిటర్ల నుంచి రెట్టింపు పెట్టుబడులు వచ్చేలా నమ్మించి దేశ వ్యాప్తంగా 6,979 మంది నుంచి రూ.1,700 కోట్లు వసూలు చేశారు. ఇందులో రూ.850 కోట్లు డిపాజిటర్లకు తిరిగి చెల్లించకుండా మోసం చేశారు. బాధితుల ఫిర్యాదు మేరకు ఈ ఏడాది ఫిబ్రవరి 10, 11,12 తేదీల్లో సైబరాబాద్ ఎకనామిక్ అఫెన్సెస్ వింగ్(ఈవోడబ్ల్యూ) పోలీసులు కేసు నమోదు చేశారు. సైబరాబాద్ పోలీసుల ఎఫ్‌ఐఆర్ ఆధారంగా ఈడీ కేసు నమోదు చేసి దర్యాప్తు చేసింది. మోసపూరిత పెట్టుబడిదారుల నుంచి రూ. 792 కోట్లు కొల్లగొట్టినట్టు ప్రాథమికంగా గుర్తించింది. దర్యాప్తు కొనసాగుతున్నట్టు ఈడీ అధికారులు తెలిపారు.
