
న్యూఢిల్లీ: కస్టమర్లకు ఊరట కలిగించేలా పెద్ద కంపెనీలన్నీ వంట నూనెల రేట్లను 10–15 శాతం తగ్గించినట్లు సాల్వెంట్ ఎక్స్‌ట్రాక్టర్స్ అసోసియేషన్ (ఎస్ఈఏ) సోమవారం తెలిపింది. అదానీ విల్మార్, రుచి సోయా సహా పెద్ద కంపెనీలన్నీ తమ మాగ్జిమమ్ రిటెయిల్ ప్రైస్ (ఎంఆర్పీ) ని తగ్గించాయని పేర్కొంది. ఇమామి, బుంగె, జెమిని, కోఫ్కో, ఫ్రిగోరిఫికో అల్లన, గోకుల్ ఆగ్రో కంపెనీలూ రేట్లను తగ్గించిన కంపెనీలలో ఉన్నాయని వెల్లడించింది. రేట్లు తగ్గించాలనే తమ ప్రపోజల్‌పై లీడింగ్ మెంబర్లందరూ సానుకూలంగా స్పందించడం సంతోషం కలిగిస్తోందని ఎస్ఈఏ ఈ స్టేట్మెంట్లో పేర్కొంది. ఇంపోర్ట్ డ్యూటీలను తగ్గించిన నేపథ్యంలో సానుకూలంగా వ్యవహరించి, వంట నూనెల రేట్లు తగ్గించాలని కంపెనీలను ఫుడ్ సెక్రటరీ సుధాంశు పాండే కోరిన విషయం తెలిసిందే. కొత్త సంవత్సరంలో ఆవాల పంట రానుండటంతోపాటు, గ్లోబల్గానూ రేట్లు దిగి వచ్చే సూచనలున్నాయని ఎస్ఈఏ తెలిపింది. గ్లోబల్‌గా రేట్లు ఎక్కువగా ఉండటంతో వంట నూనెల రేట్లు దేశీయంగానూ పెరిగాయని, ధరలను కిందకి తెచ్చేందుకు రిఫైన్డ్, క్రూడ్ ఎడిబుల్ ఆయిల్స్‌పై ఇంపోర్ట్ డ్యూటీలను ప్రభుత్వం తగ్గించిన విషయం తెలిసిందే.