గృహజ్యోతికి ఎడిట్‌‌ కష్టాలు

గృహజ్యోతికి ఎడిట్‌‌ కష్టాలు
  •     ఆన్​లైన్ ​పొరపాట్లతో పలువురికి కరెంట్ ​బిల్లులు
  •     అద్దె ఇల్లు మారినా జీరో బిల్లు వస్తలే
  •     ఎడిట్ ఆప్షన్ ఇస్తేనే సమస్యకు పరిష్కారం

హైదరాబాద్, వెలుగు: ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకొచ్చిన గృహజ్యోతి స్కీమ్‌‌(జీరో కరెంట్ బిల్) కొంత మంది అర్హులకు అందడం లేదు. ప్రజాపాలన దరఖాస్తులను ఆన్‌‌లైన్ చేసేటప్పుడు జరిగిన పొరపాట్లతో కొందరు ఈ స్కీమ్‌‌కు దూరమవగా, మరికొందరు ఇతర కారణాలతో ఇబ్బంది పడ్తున్నారు. ముఖ్యంగా అద్దె ఇండ్లలో ఉండే పేదలకు ఒక ఇంటి నుంచి మరో ఇంటికి మారినప్పుడు ఈ స్కీమ్‌‌ను పొందడం సమస్యగా మారింది. ప్రజాపాలన దరఖాస్తులో ఏ మీటర్ నంబర్‌‌ అయితే రాశారో, అదే నంబర్‌‌‌‌కు జీరో బిల్ వర్తిస్తుందని, మీటర్‌‌‌‌ నంబర్‌‌‌‌ను మార్చుకునే ఆప్షన్ లేదని అధికారులు చెబుతున్నారు. దీంతో అద్దె ఇల్లు మారిన లబ్ధిదారుకు స్కీమ్ అందడం లేదు.

పాత ఇంటి మీటర్‌‌‌‌కే గృహజ్యోతి వర్తిస్తుండడంతో ఇంటి ఓనర్ లబ్ధి పొందుతున్నారు. ఇక ప్రజాపాలన దరఖాస్తు చేసే సమయంలో జరిగిన పొరపాట్ల వల్ల మరికొంత మంది పథకానికి దూరమయ్యారు. ప్రజలు మ్యానువల్‌‌గా ఇచ్చిన దరఖాస్తులను, ప్రభుత్వం ప్రజాపాలన పోర్టల్‌‌లో అప్‌‌లోడ్ చేయించింది. ఇలా అప్‌‌లోడ్ చేసే సమయంలో మీటర్ నంబర్లను తప్పుగా వేయడం లేదా స్కీమ్‌‌కు అసలు దరఖాస్తు చేసుకోలేదన్నట్టుగా(నాట్ అప్లైడ్‌‌) నమోదు చేయడంతో అర్హులకు స్కీమ్ అందడం లేదు. 

లబ్దిదారులు ఇదే విషయాన్ని ఎంపీడీవోల దృష్టికి తీసుకుపోయినా, తమ చేతుల్లో ఏమీ లేదని చెబుతున్నారు. ప్రజాపాలన పోర్టల్‌‌లో తమకు ఎడిట్ ఆప్షన్‌‌ ఇవ్వలేదని చెబుతున్నారు. కొత్తగా మీటర్ తీసుకున్న పేదలకు కూడా స్కీమ్ అందడం లేదు. ప్రజాపాలన దరఖాస్తు సమయంలో మీటర్ నంబర్ రాయనందున ఇప్పుడేమీ చేయలేమని చెబుతున్నారు. దరఖాస్తుల స్వీకరణ కార్యక్రమం నిరంతరం జరుగుతుందని ప్రభుత్వం ప్రకటించినప్పటికీ, అమలుకు నోచుకోవడం లేదు. ప్రజాపాలన పోర్టల్‌‌లో ఎడిట్ ఆప్షన్ ఇస్తే, ఈ సమస్యలన్నింటికీ చెక్ పెట్టొచ్చునని అధికారులు చెబుతున్నారు.