ఎర్రకోట ఘటనపై జర్నలిస్టులను ఎందుకు టార్గెట్ చేస్తున్నారు?

ఎర్రకోట ఘటనపై జర్నలిస్టులను ఎందుకు టార్గెట్ చేస్తున్నారు?

న్యూఢిల్లీ: రిపబ్లిక్ డే నాడు ఢిల్లీలో రైతులు తలపెట్టిన ట్రాక్టర్ ర్యాలీ హింసాత్మకంగా మారిన సంగతి తెలిసిందే. అయితే ఈ ఘటనకు సంబంధించి జర్నలిస్టులను టార్గెట్ చేయడాన్ని ఎడిటర్స్ గిల్డ్ తీవ్రంగా ఖండించింది. ర్యాలీకి సంబంధించిన సమాచారాన్ని రిపోర్టింగ్ చేసిన జర్నలిస్టులను ఎందుకు లక్ష్యంగా చేసుకున్నారంటూ ప్రశ్నించింది. మీడియాను భయపెట్టడం, అణచివేయడం, వేధించడం సరికాదని ఆగ్రహం వ్యక్తం చేసింది. మీడియాపై పెట్టిన కేసులను వెంటనే ఉపసంహరించుకోవాలని, అప్పుడే నిర్భయంగా రిపోర్టింగ్ చేయగలమని స్పష్టం చేసింది. రాజ్‌‌దీప్ సర్దేశాయ్‌‌పై కేసు నమోదు కావడం మీద బెంగాల్ సీఎం మమతా బెనర్జీ స్పందించారు.

రాజ్‌‌దీప్ సర్దేశాయ్‌‌‌పై కేసు నమోదవ్వడం తనను షాక్‌‌కు గురి చేసిందంటూ మమత ట్వీట్ చేశారు. ఈ విషయంలో మీడియా మౌనంగా ఉండటం తనను ఆశ్చర్యపరుస్తోందన్నారు. ప్రజాస్వామ్య విధానంలో గొంతెత్తడం తప్పనిసరని చెప్పిన దీదీ.. డెమొక్రసీకి మీడియా నాలుగో స్తంభం లాంటిదన్నారు. కాగా, రిపబ్లిక్ డే నాడు రైతుల ర్యాలీపై ట్వీట్లు చేసినందుకు ఉత్తర్ ప్రదేశ్‌‌, మధ్య ప్రదేశ్‌‌లో కాంగ్రెస్ ఎంపీ శశి థరూర్‌‌తోపాటు ఆరుగురు జర్నలిస్టుల మీద పలు ఎఫ్‌ఆర్ఐలు నమోదయ్యాయి. ట్వీట్లు చేసిన జర్నలిస్టుల్లో ఇండియా టుడే మాజీ ఎడిటర్ రాజ్‌‌దీప్ సర్దేశాయ్‌‌తోపాటు మృణాల్ పాండే, జాఫర్ అఘా, అనంత్‌నాథ్, వినోద్ జోస్ ఉన్నారు.