
హీరా గోల్డ్ కుంభకోణంపై ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) మరో కీలక నిర్ణయం వెల్లడించింది. ప్రధాన నిందితురాలు, హీరా గోల్డ్ సంస్థల ఎండీ నౌహీరా షేక్‌కు చెందిన మరో రూ.33.06 కోట్ల విలువైన ఆస్తులను అటాచ్ చేసినట్టు తెలిపింది. గతంలో సుమారు రూ.367కోట్ల ఆస్తులను ఈడీ అటాచ్ చేయగా.. తాజా పరిణామంతో ఇప్పటి వరకు ఈడీ అటాచ్ చేసిన ఆస్తులు రూ.400 కోట్లకు చేరాయని ఈడీ ప్రకటించింది. మొత్తం 24 ఆస్తులను అటాచ్ చేస్తూ ఈడీ ఆదేశాలు జారీ చేయగా.. ఈ కేసులో ఆస్తుల వివరాలకు సంబంధించి మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.
డిపాజిట్ దారుల నుండి సుమారు రూ. 5 వేల కోట్లను సేకరించారని, తిరిగి వారికి చెల్లించలేదనే ఆరోపణలతో నౌహీరా షేక్ పై ఈడీ అధికారులు 2018లో మనీ లాండరింగ్ కేసు నమోదు చేశారు. హీరా గోల్డ్ కుంభకోణం వల్ల దాదాపు 1.72 లక్షల మంది ఇన్వెస్టర్లు మోసపోయినట్లు అంచనా. డిపాజిటర్లను మోసం చేసిన కేసులో 2018 అక్టోబర్ 17న హైదరాబాద్ పోలీసులు నౌహీరా షేక్ ను అరెస్ట్ చేశారు. ప్రస్తుతం ఈ కేసుపై ఈడీ దర్యాప్తు చేస్తోంది. ఇదిలా ఉండగా నౌహీరా షేక్ మీద మొత్తం పది కేసులున్నాయి.