బతుకులు మార్చే తెలంగాణ కావాలె

బతుకులు మార్చే తెలంగాణ కావాలె
  • అందరికీ విద్య, వైద్యం అందాలె: తీన్మార్ మల్లన్న 
  • హుజూరాబాద్ లో టీఆర్ఎస్ కు ఓటమి తప్పదు 
  • కేసీఆర్ వెలమ రాజ్యం తెచ్చిండని కామెంట్  

వరంగల్‍ రూరల్‍, వెలుగు: ‘‘రాష్ట్ర ప్రజలకు కావాల్సింది ఇనుప, ఇత్తడి, బంగారు తెలంగాణ కాదు. పేదోళ్ల బతుకులు మార్చే తెలంగాణ కావాలె. అందరికీ నాణ్యమైన విద్య, వైద్యం అందుబాటులోకి రావాలె. అదే మల్లన్న టీమ్ 7200 మూమెంట్‍ టార్గెట్‍’’ అని తీన్మార్‍ మల్లన్న చెప్పారు. బుధవారం హన్మకొండలోని అంబేద్కర్ భవన్‍లో మల్లన్న టీమ్​స్టేట్‍ కన్వీనర్‍ దాసరి భూమయ్య అధ్యక్షతన జరిగిన ఉమ్మడి జిల్లా సమావేశంలో ఆయన పాల్గొన్నారు. మల్లన్న మాట్లాడుతూ.. హెల్త్, ఎడ్యుకేషన్ కోసం ఢిల్లీ సర్కార్ బడ్జెట్‍లో 40 శాతం నిధులు ఖర్చు చేస్తుంటే, రాష్ట్ర సర్కార్ మాత్రం కేవలం 2 నుంచి 3 శాతం మాత్రమే ఖర్చు చేస్తోందని మండిపడ్డారు. దాదాపు 400 మంది పోలీసోళ్లు తన ఆఫీస్‍ మీదకు వచ్చినా, తన వెంట్రుక కూడా టచ్ చేయలేకపోయారని.. రాజ్యాంగం కల్పించిన హక్కులతోనే తాను బయటపడ్డానని తెలిపారు. సీఎం కేసీఆర్‍ సూచన మేరకే తన ఆఫీసుపై దాడులు జరిగాయని ఆరోపించారు. గంగుల కమలాకర్‍ దగ్గరి నుంచి గ్రానైట్, రామేశ్వరరావు దగ్గరి నుంచి సిమెంట్‍ తీసుకొచ్చి కేసీఆర్ కు సమాధి కడ్తానన్నారు. తన టీమ్ ఏ రాజకీయ పార్టీకి వ్యతిరేకం కాదని స్పష్టం చేశారు. టీఆర్ఎస్ హుజూరాబాద్‍లో ఎన్ని కోట్లు ఖర్చుపెట్టినా ఓటమి తప్పదన్నారు. 
వరంగల్‍ ను రాజధాని చెయ్యాలె.. 
వరంగల్‍ జిల్లాను రాష్ట్రానికి రాజధాని చేయాలని మల్లన్న డిమాండ్‍ చేశారు. హైదరాబాద్‍ ఇప్పటికే జనం, పొల్యూషన్‍తో నిండిపోయిందన్నారు. వరంగల్‍ అభివృద్ధి చెందాలంటే పరిపాలన ఇక్కడి నుంచే జరగాలన్నారు. హైదరాబాద్ ను తలదన్నేలా వరంగల్ ను అభివృద్ధి చేస్తానని కేసీఆర్ హామీ ఇచ్చారని, ఇప్పటి వరకు అమలు చేయలేదన్నారు. జిల్లాలో ఐదు కూడా చదవని మంత్రులు ఇద్దరు ఉండడం దౌర్భాగ్యకరమన్నారు. సర్కార్ చెబుతున్న ఐటీ పార్కు, టెక్స్ టైల్ పార్కు ముచ్చట్లన్నీ ఉత్తవేనన్నారు. ‘రాష్ట్రంలో ఆర్‍.కృష్ణయ్య 30 ఏండ్లుగా బీసీ ఉద్యమం చేస్తుంటే బీసీలకు రాజ్యాధికారం రాలేదు. మంద కృష్ణ 25 ఏండ్లుగా దళిత ఉద్యమం చేస్తుంటే, దళితులకు రాజ్యాధికారం రాలేదు. కానీ కేసీఆర్‍ 11 ఏండ్లలో వెలమ రాజ్యం తెచ్చిండు” అని ఆరోపించారు.