
- 6,7 తేదీల్లో ట్రాన్స్ఫర్లకు వెబ్ ఆప్షన్లు
- ప్రమోషన్లు పూర్తయ్యాకే బదిలీలు చేపట్టాలని టీచర్ల డిమాండ్
హైదరాబాద్, వెలుగు: టీచర్ల ప్రమోషన్లకు మరోసారి బ్రేక్ పడింది. కోర్టు కేసుల నేపథ్యంలో బదిలీలు మాత్రమే చేపట్టాలని విద్యాశాఖ నిర్ణయించింది. మల్టీ జోన్–1 పరిధిలోని సర్కారు, లోకల్ బాడీ స్కూళ్లలో ఎస్జీటీ, దానికి సమానమైన కేడర్‌కు, మల్టీ జోన్–2 పరిధిలో లోకల్ బాడీ పరిధిలోని స్కూల్ అసిస్టెంట్లు, దానికి సమానమైన కేడర్ తో పాటు ఎస్జీటీ, దానికి సమానమైన కేడర్‌లకు బదిలీలు చేపడతామని ప్రకటించింది.
ఈ మేరకు మంగళవారం స్కూల్ ఎడ్యుకేషన్ డైరెక్టర్ శ్రీదేవసేన బదిలీల షెడ్యూల్‌ను రిలీజ్ చేశారు. ప్రస్తుతం టీచర్ల ప్రమోషన్లకు టెట్ తప్పనిసరి అని హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులు ఇచ్చింది. దీనిపై విద్యాశాఖ అప్పీల్‌కు పోవాలని నిర్ణయించింది. ఆ ప్రక్రియ పూర్తి కావడానికి ఆలస్యం అవుతుండటంతో బదిలీలకు సర్కార్ మొగ్గు చూపింది. మరోపక్క లాంగ్వేజ్ పండిట్, పీఈటీలతో పాటు ఎస్జీటీల్లో ఉమ్మడి సీనియార్టీ ప్రకారం ఎస్ఏ లాంగ్వేజెస్ ప్రమోషన్లు ఇవ్వాలని హైకోర్టు తీర్పునిచ్చింది. దీన్ని పూర్తి చేస్తే రూరల్ ఏరియాల్లోని స్కూళ్లలో టీచర్ల పోస్టులు భారీగా తగ్గే అవకాశముంది. దీంతో ప్రమోషన్ల ప్రక్రియను సర్కారు పక్కన పెట్టింది.
బదిలీల షెడ్యూల్ ఇలా..
- 3,4 తేదీల్లో స్పౌజ్ పాయింట్లకు అప్పీళ్లు
5న సీనియారిటీ ఫైనల్ లిస్ట్ విడుదల
6,7 తేదీల్లో వెబ్ ఆప్షన్లకు అవకాశం
8న వెబ్ ఆప్షన్స్ ఎడిటింగ్ కు చాన్స్
ప్రమోషన్లతో పాటు బదిలీలు నిర్వహించాలె : టీచర్ల సంఘాలు
ప్రమోషన్లతో పాటు బదిలీలు నిర్వహించాలని టీచర్ల సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి. బదిలీలు మాత్రమే చేసే ఆలోచన మానుకోవాలని సర్కారును హెచ్చరించాయి. ప్రమోషన్లకు న్యాయపరమైన అవరోధాలను తొలగించాలని పీఆర్టీయూ రాష్ట్ర అధ్యక్ష, కార్యదర్శులు పింగిలి శ్రీపాల్ రెడ్డి, బీరెల్లి కమలాకర్ రావు కోరారు. రాష్ట్రంలో ఎనిమిదేండ్లుగా ప్రమోషన్లు లేవని, దీంతో చాలామంది పదోన్నతులు పొందకుండానే రిటైర్డ్ అవుతున్నారని.. టీఆర్టీఎఫ్ రాష్ట్ర అధ్యక్ష, కార్యదర్శులు అశోక్ కుమార్, కటకం రమేశ్విజ్ఞప్తి చేశారు. ప్రమోషన్లు లేని బదిలీలు వద్దని, హైకోర్టు అనుమతితో ప్రమోషన్లు చేపట్టాలని తపస్ రాష్ట్ర అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు హన్మంత్‌రావు, నవాత్ సురేశ్స్పష్టం చేశారు. ప్రమోషన్లు ఇవ్వకుండా బదిలీలు జరిపితే డీఎస్ఈని ముట్టడిస్తామని ఎస్జీటీయూ రాష్ట్ర అధ్యక్షుడు మహిపాల్ రెడ్డి హెచ్చరించారు. ప్రమోషన్లు లేని బదిలీలు సమంజసం కాదని డీటీఎఫ్ రాష్ట్ర అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు సోమయ్య, టి. లింగారెడ్డి అన్నారు.
10 వేల మంది ఎస్ఏల బదిలీ..
రాష్ట్రవ్యాప్తంగా మల్టీ జోన్-1 పరిధిలోని సర్కారు, లోకల్ బాడీ, మల్టీ జోన్–2 పరిధిలోని సర్కారు స్కూళ్లకు చెందిన స్కూల్ అసిస్టెంట్ల బదిలీల ప్రక్రియ ముగిసింది. మొత్తం 20 జిల్లాల్లో 16,498 మంది ఉండగా, వారిలో 15,879 మంది బదిలీలకు వెబ్ ఆప్షన్లు ఇచ్చారు. వీరిలో 10,653 మందికి బదిలీలు జరిగి.. కొత్త స్కూళ్లు అలాట్ అయ్యాయి. మరో 5,216 మంది పాత స్కూళ్లలోనే ఉన్నారు.