టెట్ కు భారీగా అప్లికేషన్లు

టెట్ కు భారీగా అప్లికేషన్లు

 

  •     రెండు పేపర్లకు ఏకంగా  6.29 లక్షల అప్లికేషన్లు
  •     సెంటర్లు, సిబ్బంది ఎంపికపై అయోమయం
  •     అందుకే గడువు పెంచలే..  ఎడిట్ ఆప్షన్ ఇవ్వలే
  •     కొత్త సెంటర్లు, సిబ్బంది కోసం వెతుకులాట

హైదరాబాద్, వెలుగు: టీచర్ ఎలిజిబులిటీ టెస్ట్ (టెట్)కు భారీగా అప్లికేషన్లు రావడంతో విద్యా శాఖ అధికారుల్లో కలవరం మొదలైంది. ఎగ్జామ్ సెంటర్లు, సిబ్బంది నియామకం ఎలా అనే దానిపై వారంతా తర్జనభర్జన పడుతున్నారు. ఏకంగా ఆరు లక్షలకు పైగా అప్లికేషన్లు రావడం, ఒకే రోజు పరీక్ష నిర్వహించాల్సి ఉండటంతో ఆందోళన చెందుతున్నారు. దీని వల్లే కొత్తగా అప్లికేషన్లకు గడువు పెంచలేదు. ఎడిట్ ఆప్షన్​ కూడా ఇవ్వలేదని విద్యా శాఖ అధికారులే చెప్తున్నారు.

ఐదేండ్ల తర్వాత..

రాష్ట్రంలో టెట్​ను ఐదేండ్ల తర్వాత నిర్వహిస్తున్నారు. మార్చి26 నుంచి ఈ నెల12 వరకు అప్లికేషన్లు తీసుకున్నారు. మొత్తం 6,29,352 అప్లికేషన్లలో పేపర్1కు 3,51,468, పేపర్2 కు 2,77,884 అప్లికేషన్లు వచ్చాయి. ఈసారి పేపర్ 1 రాసేందుకు బీఈడీ అభ్యర్థులకు అవకాశం ఇవ్వడంతో ఆ పేపర్​కోసం రికార్డు స్థాయిలో అప్లికేషన్లు అందాయి. టెట్​ కోసం 4 లక్షల అప్లికేషన్లు వస్తాయని అధికారులు భావించారు. దానికి అనుగుణంగానే జిల్లాల వారీగా డీఈవోల నుంచి ఎగ్జామ్ సెంటర్ల ఇండెంట్లు తీసుకున్నారు.

లాస్ట్​టైమ్ 1,574 సెంటర్లు

రాష్ట్రంలో జూన్ 12న టెట్ నిర్వహించనున్నారు. ఉదయం 9.30 నుంచి మధ్యాహ్నం 12 వరకు పేపర్‌‌‌‌ 1, మధ్యాహ్నం 2.30 నుంచి సాయంత్రం 5 వరకు పేపర్‌‌‌‌ 2  జరుగుతాయి. అయితే 2017 జులై 23న జరిగిన టెట్ కు 3,67,912 మంది అప్లై చేశారు. పేపర్ 1కు 1.11 లక్షల మంది, పేపర్​ 2కు 2.56 లక్షల మంది దరఖాస్తు చేశారు. వీరికోసం 31జిల్లాల్లో 1,574 పరీక్షా కేంద్రాలను ఏర్పాటు చేశారు. ప్రస్తుతం ఎగ్జామ్ సెంటర్లు 2 వేల వరకూ అవసరముందని ఆఫీసర్లు చెబుతున్నారు.

పరిమితికి మించి అప్లికేషన్లు 

చాలా జిల్లాల్లో ఇంటెండ్ కంటే ఎక్కువ అప్లికేషన్లు అందాయి. ముందు కొన్ని జిల్లాలను బ్లాక్ చేశారు. అభ్యర్థుల సంఖ్య పెరుగుతుండటంతో, మళ్లీ డీఈవోల నుంచి కొత్త సెంటర్ల వివరాలను తీసుకున్నారు. దీంతో మళ్లీ పరీక్షా కేంద్రాల వివరాలను ఆన్​లైన్​లో చూపించారు. హైదరాబాద్​లో 25 వేలకు మాత్రమే ఇండెంట్ ఇస్తే 30 వేల అప్లికేషన్లు తీసుకున్నారు. నల్లగొండ, రంగారెడ్డి, మహబూబ్​నగర్​ జిల్లాల్లో అప్లికేషన్లు 20 వేలు దాటాయి. దీంతో అన్ని జిల్లాల్లో కొత్త సెంటర్లు, సిబ్బంది కోసం అధికారులు సెర్చ్ మొదలుపెట్టారు.