విదేశాల్లో స్టడీ టూర్లకు సర్కార్ టీచర్లు!

విదేశాల్లో స్టడీ టూర్లకు సర్కార్ టీచర్లు!
  • నాలుగు దేశాలకు 4 టీమ్‌‌లను పంపించే యోచన 
  • ఎడ్యుకేషన్​లో క్వాలిటీ పెంచేందుకు వినూత్న ఆలోచన 
  • సర్కారుకు ప్రతిపాదనలు పంపిన విద్యాశాఖ 

హైదరాబాద్, వెలుగు: స్కూల్ ఎడ్యుకేషన్​లో క్వాలిటీ పెంచేందుకు విద్యాశాఖ వినూత్న ప్రయోగానికి శ్రీకారం చుట్టింది. అందులో భాగంగా విదేశాల్లో అమలవుతున్న విద్యావిధానాన్ని పరిశీలించాలని భావిస్తున్నది. ఇందుకోసం టీచర్లకు విదేశీ స్టడీ టూర్​ నిర్వహించాలని యోచిస్తున్నది. సెప్టెంబర్, అక్టోబర్ నెలల్లో ఈ ప్రక్రియ పూర్తి చేయాలని నిర్ణయించింది. ఈ టూర్​ అనుమతి కోసం ప్రభుత్వానికి స్కూల్ ఎడ్యుకేషన్ అధికారులు ప్రతిపాదనలు పంపించారు. ప్రస్తుతం ఢిల్లీ, పంజాబ్, గుజరాత్ తదితర రాష్ట్రాలు.. ప్రతి ఏటా కొందరు టీచర్లకు పంపి అక్కడి బెస్ట్ ప్రాక్టీసెస్​లో ట్రైనింగ్​ ఇప్పిస్తున్నారు.

 ఇలాంటి విధానాన్ని మన రాష్ట్రంలోనూ  అమలు చేయాలని అధికారులు భావిస్తున్నారు. సింగపూర్, ఫిన్ లాండ్, వియత్నం, జపాన్ తదితర దేశాల్లో ఏడు రోజుల ఎక్స్‌‌‌‌‌‌‌‌పోజర్, విద్యా ఎక్స్చేంజ్ ప్రోగ్రామ్‌‌‌‌‌‌‌‌ను సర్కారుకు ప్రతిపాదించారు. నాలుగు బ్యాచ్​లను, ఒక్కో బ్యాచులో 35 మంది చొప్పున 140 మందిని పంపించనున్నారు. ఇప్పటికే సర్కారుకు స్కూల్ ఎడ్యుకేషన్ డైరెక్టర్ నవీన్ నికోలస్ ప్రతిపాదనలు పంపించారు. సర్కారు పర్మిషన్ ఇస్తే.. సెప్టెంబర్​లో రెండు టీమ్​లు, అక్టోబర్ లో రెండు టీమ్​లను విదేశాలకు పంపించనున్నారు. 

 క్రిటికల్ థింకింగ్, క్రియేటివిటీపై ఫోకస్​

ప్రస్తుతం సింగపూర్, ఫిన్లాండ్, వియత్నాం, జపాన్‌‌‌‌‌‌‌‌లోని విద్యా వ్యవస్థలు అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు పొందాయి. ఈ దేశాల్లోని స్కూళ్లలో వినూత్న బోధనా పద్ధతులు, కరికులం రూపకల్పన, టీచర్ల పనితీరు, టెక్నాలజీని ఎలా ఉపయోగిస్తున్నారనే విషయాలను తెలుసుకోవచ్చు. టీచర్లకు క్రిటికల్ థింకింగ్, క్రియేటివిటీ, సమస్యను పరిష్కరించే స్కిల్స్ డెవలప్ చేసేందుకు ఇలాంటి టూర్లు ఉపయోగపడుతాయని అధికారులు చెప్తున్నారు. టీచర్ డెవలప్‌‌‌‌‌‌‌‌మెంట్, స్టూడెంట్ అసెస్‌‌‌‌‌‌‌‌మెంట్, టెక్నాలజీ ఇంటిగ్రేషన్‌‌‌‌‌‌‌‌లో ఆధునిక పద్ధతులను అమలు చేసేందుకు చాన్స్​ ఉంటుంది. అయితే, వివిధ రాష్ట్రాల్లో ఈ విధానం అమలు చేసిన తర్వాత ఎడ్యుకేషన్ క్వాలిటీ మెరుగైందని అధికారులు చెప్తున్నారు.