ఇంగ్లిష్​ వైపే అందరి చూపు

ఇంగ్లిష్​ వైపే అందరి చూపు
  • ప్రైవేటు బడుల్లో 97 % ..  సర్కారులో 38 % ఇంగ్లిష్​ మీడియమే
  • ఏటా తగ్గుతున్నతెలుగు మీడియం స్టూడెంట్లు
  • ప్రైవేటులో తెలుగు మీడియం స్టూడెంట్లు 2 %
  • ప్రభుత్వ బడుల్లో 57% మంది తెలుగు మీడియం
  • గురుకులాలకు పెరుగుతున్న పోటీ

హైదరాబాద్, వెలుగు:

రాష్ట్రంలో మారుతున్న ట్రెండ్​కు అనుగుణంగా ఇంగ్లిష్​ మీడియం చదువులు ఏటేటా పెరుగుతున్నాయి. ప్రైవేటు స్కూళ్లలో దాదాపు అంతా ఇంగ్లిష్ మీడియం స్టూడెంట్సే ఉండగా, సర్కారు బడుల్లోనూ అటువైపే మొగ్గు చూపుతున్నారు. ప్రైవేటు బడుల్లో  ప్రైమరీ స్థాయి వరకూ తెలుగు​ మీడియం చదువుతున్న విద్యార్థుల సంఖ్య 2 శాతమే ఉండగా, హైస్కూల్​స్థాయికి వచ్చేసరికి ఆ సంఖ్య మరింత తగ్గింది. మరోపక్క సర్కారు విద్యాసంస్థల్లో ప్రైమరీలో కంటే, హైస్కూల్లోనే ఇంగ్లిష్​ మీడియంలో విద్యార్థులు ఎక్కువగా ఉన్నారు. ఈ ట్రెండ్​ కొనసాగితే ఐదేండ్లలో రాష్ట్రంలో తెలుగు మీడియంలో చదివే విద్యార్థుల సంఖ్య పదిశాతంలోపే ఉంటుందని అంచనా. యూడైస్​2018–19 లెక్కల ప్రకారం స్టేట్​లో అన్ని మేనేజ్మెంట్ల పరిధిలోని 40,597 స్కూళ్లలో 58,10,490 మంది స్టూడెంట్లు చదువుతున్నారని అధికారులు చెప్పారు. ఇందులో ఇంగ్లిష్​ మీడియం స్టూడెంట్లు 40,43,793 మంది ఉండగా, తెలుగు మీడియం స్టూడెంట్స్ కేవలం16,08,528 మందే.. మిగిలిన 1,58,169 మంది ఉర్దూ, హిందీతో పాటు ఇతర మైనర్​మీడియాల్లో చదువుతున్నారు. ఇంగ్లిష్​ మీడియం విద్యార్థుల సంఖ్య ప్రతి ఏటా పెరుగుతూ పోతోందన్నారు.

ప్రైవేటులో తెలుగు మీడియం 2 శాతమే..

స్టేట్ లో 10,549 ప్రైవేటు స్కూళ్లలో తెలుగు మీడియం స్టూడెంట్స్​సంఖ్య 63,249 మంది.. అంటే మొత్తం 31,21,539 మంది విద్యార్థుల్లో  వీరి సంఖ్య కేవలం 2.03 శాతమే. ఇంగ్లిష్ మీడియం స్టూడెంట్లు 30,27,459 (96.99శాతం) మంది ఉన్నారు. ప్రైవేటు బడుల్లో ఐదో తరగతి నుంచి తెలుగు మీడియం స్టూడెంట్ల శాతం తగ్గింది. పదో తరగతిలో మాత్రం స్వల్పంగా పెరిగింది.

సర్కారులోనూ ఇంగ్లిష్​ వైపే అడుగులు..

హైస్కూలు విద్యార్థులు గురుకులాల్లో చేరడంవల్ల ప్రైవేటు స్కూళ్లలో తెలుగు మీడియం విద్యార్థుల సంఖ్య తగ్గిందని అధికారులు చెప్పారు. ఏటా గురుకులాల సంఖ్య పెరగడం, అవి ఇంగ్లిష్​ మీడియంలోనే ఉండటంతో స్టూడెంట్లు ఇంగ్లిష్​ మీడియంవైపు అడుగులు వేస్తున్నారు. మొత్తంగా తెలుగు మీడియం విద్యార్థులే ఎక్కువగా ఉన్నా, క్రమంగా ఇంగ్లిష్​ మీడియం స్టూడెంట్ల సంఖ్య పెరుగుతోంది. సర్కారీ విద్యాసంస్థల్లో మొత్తం 15,45,276 (57.47శాతం) తెలుగుమీడియం స్టూడెంట్స్ ఉండగా, 10,16,334 (37.8శాతం) ఇంగ్లిష్​ మీడియం వారున్నారు. ప్రైమరీ స్థాయిలో వీళ్ల సంఖ్య 40 శాతం లోపే ఉండగా.. గడిచిన మూడేళ్లలో 47 శాతానికి పెరిగింది.