
మహేశ్వరం, వెలుగు: ఎవరెన్ని కుట్రలు, కుతంత్రాలు చేసినా మళ్లీ వచ్చేది బీఆర్ఎస్ ప్రభుత్వమేనని, ప్రజల ఆశీర్వాదంతో కేసీఆర్ హ్యాట్రిక్ సీఎం అవుతారని విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి ధీమా వ్యక్తంచేశారు. ఆదివారం రంగారెడ్డి జిల్లా మహేశ్వరం, కందుకూరు మండలాల్లో పలు అభివృద్ధి పనులను మంత్రి ప్రారంభించారు.
తుమ్మలూరులో రూ. 3. 78 కోట్లతో మ్యాక్ ప్రాజెక్ట్ వద్ద 33/11 కేవీ సబ్ స్టేషన్, ఓవర్ హెడ్ ట్యాంక్, డ్వాక్రా భవనం, బతుకమ్మ కట్టను ఓపెన్ చేసి మాట్లాడారు. రాష్ట్ర ప్రజల బాగోగులకు అడగకుండానే అన్నింటిని సీఎం కేసీఆర్ సమకూరుస్తున్నారని పేర్కొన్నారు. రంగారెడ్డి జిల్లా జెడ్పీ చైర్ పర్సన్ తీగల అనితారెడ్డి, కందుకూరు జడ్పీటీసీ జంగారెడ్డి, సర్పంచ్ సురేఖ, పార్టీ ప్రజాప్రతినిధులు, నేతలు పాల్గొన్నారు.