విద్యా సంస్థల్లోకి డ్రగ్స్..కఠిన చర్యలు ఉంటాయి: మంత్రి సబిత

 విద్యా సంస్థల్లోకి డ్రగ్స్..కఠిన చర్యలు ఉంటాయి: మంత్రి సబిత

రంగారెడ్డి జిల్లా : రాష్ట్రంలో మాదక ద్రవ్యాల నిరోధానికి పకడ్బందీ చర్యలు తీసుకుంటున్నామని విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి చెప్పారు. విద్యా సంస్థల్లోకి మాదక ద్రవ్యాలు క్రమంగా చాపకింద నీరులా విస్తరిస్తున్నాయని, - దీనిపై రాష్ట్ర ప్రభుత్వం చాలా సీరియస్ గా ఉందని అన్నారు. మాదక ద్రవ్యాల నిరోధానికి పకడ్బందీగా వ్యవహరిస్తున్నామని చెప్పారు. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా మాదక ద్రవ్యాల నిరోధక అవగాహన సదస్సులు నిర్వహిస్తున్నామని తెలిపారు. స్కూలు, కాలేజీ అమ్మాయిలను వేధించేందుకు ఆకతాయిలు ఎన్నో రకాలుగా వ్యవహరిస్తుంటారని, బాధిత అమ్మాయిలు షీ టీమ్ లకు ఫిర్యాదు చేస్తే నిందితులపై వెంటనే చర్యలు తీసుకుంటామని అన్నారు. గతంలో కాలేజీల్లో ర్యాగింగ్ లు ఉండేవని, కానీ, ఇప్పుడు ర్యాగింగులు లేవన్నారు. ప్రజలు రాత్రి వేళ తమ ఇండ్లల్లో హాయిగా నిద్ర పోతున్నారంటే దానికి పోలిసులే కారణమని అన్నారు. శాంతి భద్రతలు కాపాడంతో పాటు, సామాజిక కార్యక్రమాల్లోనూ పోలీసులు తమ వంతు పాత్ర పోషించడం అభినందనీయం అని చెప్పారు. మీర్ పేట్ పోలీస్ స్టేషన్ పరిధి SYR గార్డెన్ లో యాంటీ డ్రగ్ అవేర్ నెస్ ప్రోగ్రాం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మంత్రి సబితా ఇంద్రారెడ్డి పాల్గొన్నారు. 

డ్రగ్స్ వాడకం ప్రమాదం

మాదక ద్రవ్యాల వినియోగం అత్యంత ప్రమాదకరమని రాచకొండ సీపీ డీఎస్ చౌహాన్ అన్నారు. ప్రారంభంలో ఆనందం ఇచ్చినా.. క్రమంగా ఆరోగ్యం పూర్తిగా దెబ్బతింటుందని హెచ్చరించారు. డ్రగ్స్ తీసుకోవడం వల్ల ఆరోగ్యంతో పాటు ఆర్థికంగా కూడా నష్టపోతారని చెప్పారు. సెల్ ఫోన్లను కూడా అవసరం మేరకే ఉపయోగించాలని సూచించారు. యువతీ, యువకులు గంటల తరబడి సెల్ ఫోన్లు వాడితే చాలా సమస్యలు వస్తాయని హెచ్చరించారు. సోషల్ మీడియాలో తెలియని వ్యక్తులతో ఫ్రెండ్ షిఫ్ చేయొద్దని చెప్పారు. మాదక ద్రవ్యాలు, సైబర్ మోసాలపైనా రాచకొండ కమిషనరేట్ పరిధిలో విస్తృతంగా అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తామని వివరించారు.