- మానవ విలువలు, నైతికతతో కూడిన సిలబస్ రూపొందించాలి
- నిపుణుల కమిటీకి ప్రభుత్వ సలహాదారు కేకే సూచన
హైదరాబాద్, వెలుగు: విద్య అంటే పుస్తక జ్ఞానం మాత్రమే కాదని, ప్రపంచాన్ని అర్థం చేసుకునే సాధనమని ప్రభుత్వ సలహాదారు, విద్యా విధాన కమిటీ చైర్మన్ డాక్టర్ కె.కేశవరావు అన్నారు. విద్యార్థుల్లో ప్రశ్నించేతత్వాన్ని, విమర్శనాత్మక ఆలోచనను పెంపొందించేలా స్టూడెంట్ సెంట్రిక్ విధానం ఉండాలని ఆయన చెప్పారు.
మంగళవారం నాంపల్లిలోని విద్యా భవన్‌లో ఇంటర్ బోర్డు సెక్రటరీ కృష్ణ ఆదిత్య అధ్యక్షతన హ్యుమానిటీస్, లాంగ్వేజెస్ సబ్జెక్ట్ నిపుణుల కమిటీ సమావేశం జరిగింది. దీనికి ముఖ్య అతిథిగా హాజరైన కేకే.. సిలబస్ రూపకల్పనపై కమిటీ సభ్యులకు పలు సూచనలు చేశారు. విద్యార్థులను సిద్ధాంతపరంగానే కాకుండా, ప్రాక్టికల్‌గానూ బలోపేతం చేసేలా విద్య ఉండాలన్నారు.
సిలబస్ ఫ్రేమ్‌వర్క్ రూపొందించేటప్పుడు మానవ విలువలు, నైతికత, వాస్తవ ప్రమాణాలకు అనుగుణంగా కొత్త సిలబస్‌ను డిజైన్ చేయాలని సూచించారు. సమకాలీన పరిణామాలను ప్రతిబింబించేలా, విద్యార్థుల అకాడమిక్ స్థాయికి తగినట్లుగా సిలబస్ ఉండాలని పేర్కొన్నారు. ప్రపంచ పరిస్థితులు మారుతున్న కొద్దీ విద్య కూడా నిరంతరం అభివృద్ధి చెందాలన్నారు. విద్య అనేది విద్యార్థులు ప్రపంచాన్ని గ్రహించే ఒక కిటికీ లాంటిదని అభివర్ణించారు. ఈ సందర్భంగా ఇంటర్ బోర్డులో ఏర్పాటు చేసిన కమాండ్ కంట్రోల్ రూమ్ పనితీరును ఆయన అభినందించారు.
వచ్చే ఏడాది కొత్త సిలబస్
2026–27 విద్యా సంవత్సరం నుంచి ఇంటర్మీడియెట్ ఫస్టియర్ విద్యార్థులకు కొత్త సిలబస్‌ను ప్రవేశపెడుతున్నామని ఇంటర్ బోర్డు సెక్రటరీ కృష్ణ ఆదిత్య తెలిపారు. విద్యా రంగం ప్రస్తుత అవసరాలను ప్రతిబింబించేలా ఈ కొత్త సిలబస్ ఉంటుందన్నారు. ఈ సమావేశంలో వివిధ సబ్జెక్టుల నిపుణులు సిలబస్ తయారీలో తాము అనుసరిస్తున్న పద్ధతులను వివరించారు.
