ట్రావెల్‌‌‌‌ బస్సు బోల్తా.. 30 మందికి గాయాలు

 ట్రావెల్‌‌‌‌ బస్సు బోల్తా.. 30 మందికి గాయాలు
  • భద్రాద్రి జిల్లా దమ్మపేట మండలంలో ప్రమాదం
  • జగిత్యాల జిల్లాలో కెనాల్‌‌‌‌లో పడిన క్వాలిస్‌‌‌‌, ఆరుగురికి గాయాలు

దమ్మపేట, వెలుగు : ప్రైవేట్‌‌‌‌ ట్రావెల్‌‌‌‌ బస్సు బోల్తా పడడంతో 30 మంది గాయపడ్డారు. ఈ ప్రమాదం భద్రాద్రి జిల్లా దమ్మపేట మండలం గట్టుగూడెం  సమీపంలో మంగళవారం తెల్లవారుజామున జరిగింది. వివరాల్లోకి వెళ్తే.. ఓ ప్రైవేట్‌‌‌‌ బస్సు 48 మంది ప్రయాణికులతో రాజమండ్రి నుంచి హైదరాబాద్‌‌‌‌కు వస్తోంది. మంగళవారం తెల్లవారుజామున భద్రాద్రి జిల్లా గట్టుగూడెం సమీపంలోకి రాగానే బస్‌‌‌‌ బ్రేకుల ఫెయిల్‌‌‌‌ కావడంతో ఒక్కసారిగా అదుపుతప్పి పక్కనే ఉన్న పొలాల్లోకి దూసుకెళ్లి పల్టీకొట్టింది. ప్రయాణికులు బస్సు కిటికీ అద్దాలను పగులగొట్టి బయటపడ్డారు. ప్రమాదంలో మొత్తం 30 మందికి పైగా ప్రయాణికులు గాయపడ్డారు. విషయం తెలుసుకున్న పోలీసులు ఘటనాస్థలానికి చేరుకొని గాయపడిన వారిని 108 ద్వారా దమ్మపేట గవర్నమెంట్‌‌‌‌ హాస్పిటల్‌‌‌‌కు తరలించారు. 

జగిత్యాల జిల్లాలో బోల్తాపడిన క్వాలిస్‌‌‌‌

జగిత్యాల/కొడిమ్యాల, వెలుగు : క్వాలిస్‌‌‌‌ అదుపుతప్పి కెనాల్‌‌‌‌లో పడడంతో ఆరుగురికి గాయాలు అయ్యాయి. ఈ ఘటన జగిత్యాల జిల్లా కొడిమ్యాల మండలం నాచుపెల్లి శివారులో జరిగింది. వరంగల్‌‌‌‌ జిల్లా ధర్మసాగర్‌‌‌‌ మండలం తాటికాయల గ్రామానికి చెందిన శివరాత్రి సురేశ్‌‌‌‌ తన బావ పల్లెపు రాజుతో పాటు మరో 10 మంది కుటుంబసభ్యులతో కలిసి సోమవారం వేములవాడకు వెళ్లారు. మంగళవారం వేములవాడలో భీమేశ్వరుడిని దర్శించుకున్న అనంతరం కొండగట్టుకు బయలుదేరారు.

ఈ క్రమంలో నాచుపెల్లి జేఎన్‌‌‌‌టీయూ సమీపంలోకి రాగానే క్వాలిస్‌‌‌‌ అదుపుతప్పి కెనాల్‌‌‌‌ పల్టీ కొట్టింది. ప్రమాదంలో పల్లెపు రాజు, మహేశ్‌‌‌‌, వి. మానస, ఎల్లవ్వ, భానుప్రసాద్‌‌‌‌, బిట్టు తీవ్రంగా గాయపడగా, మిగిలిన ఆరుగురికి స్వల్ప గాయాలు అయ్యాయి. ప్రమాదాన్ని గుర్తించిన స్థానికులు గాయపడిన వారిని జగిత్యాల హాస్పిటల్‌‌‌‌కు తరలించారు. బిట్టు పరిస్థితి విషమంగా ఉందని డాక్టర్లు తెలిపారు. 

చెట్టును ఢీ కొట్టిన బైక్.. ఇద్దరు మృతి

మల్హర్, వెలుగు : బైక్‌‌‌‌ అదుపుతప్పి రోడ్డు పక్కన ఉన్న చెట్టును ఢీకొట్టడంతో ఇద్దరు యువకులు చనిపోయారు. ఈ ఘటన భూపాలపల్లి జిల్లా మల్హర్ మండలం రుద్రారం గ్రామంలో మంగళవారం జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం... కిషన్‌‌‌‌రావుపల్లి గ్రామానికి చెందిన ఉష్కమల్ల రాజు (25), మహాముత్తారం మండలం పోలారం గ్రామానికి చెందిన బట్టు వంశీ (25), బోర్లగూడెం గ్రామానికి చెందిన వాంకుడోత్‌‌‌‌ వినోద్‌‌‌‌తో కలిసి బైక్‌‌‌‌పై బస్వాపూర్‌‌‌‌ వైపు నుంచి కొయ్యూరు వైపు వెళ్తున్నారు.

రుద్రారం సమీపంలోని చిగురుపల్లి వద్దకు రాగానే బైక్‌‌‌‌ అదుపుతప్పి చెట్టును ఢీకొట్టింది. ప్రమాదంలో రాజు, వంశీ అక్కడికక్కడే చనిపోగా, వినోద్‌‌‌‌ తీవ్రంగా గాయపడ్డాడు. విషయం తెలుసుకున్న పోలీసులు ఘటనాస్థలానికి చేరుకొని వినోద్‌‌‌‌ను భూపాలపల్లి హాస్పిటల్‌‌‌‌కు తరలించారు.