బోనమెత్తిన ఏడుపాయల: వైభవంగా వనదుర్గమ్మజాతర

బోనమెత్తిన ఏడుపాయల: వైభవంగా వనదుర్గమ్మజాతర

ఎల్లలు దాటి వెల్లువలా తరలివచ్చిన భక్తులతో వనం జనసంద్రమైంది. తెల్లవారుజాము నుంచి పొద్దుగూకే దాక ఎటుచూసినా బోనాల సందడే నెలకొంది. డప్పుల దరువులతో ఏడుపాయల కొండకోనలు దద్దరిల్లాయి. దుర్గమ్మ నామస్మరణతో మంజీరా తీరం మారుమోగింది. ఏడుపాయల జాతరకు రెండో రోజైన మంగళవారం భక్తులు భారీగా తరలివచ్చారు. హైదరాబాద్‌, సంగారెడ్డి, మెదక్‌ , నారాయణఖేడ్‌ తదితర రూట్ల నుంచి ఆర్టీసీ, ప్రైవేట్‌ బస్సులు, కార్లు, జీపులు, బైక్‌ లు, ఆటోలు, ఎడ్లబండ్లలో భక్తులు వచ్చారు. మంజీరా నదీపాయల్లో, షవర్ల వద్ద పుణ్యస్నానాలు చేసి వనదుర్గమ్మను దర్శించుకున్నారు. రద్దీ అధికంగా ఉండటంతో క్యూలైన్‌ లు కిటకిటలాడాయి. వివిధ ప్రాంతాల నుంచి కుటుంబ సమేతంగా వచ్చిన అనేక మంది అమ్మవారికి బోనాలు సమర్పించారు. తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలను చాటేలా పసుపు, కుంకుమ, వేపకొమ్మలు, దీపాలతో అలంకరించిన బోనాలు, మెడలో గవ్వల హారాలు ధరించి, చేతిలో చెర్నాకోలా, కత్తి, త్రిశూలాలు ధరించి డప్పుచప్పుళ్లకు అనుగుణంగా లయబద్ధంగా నృత్యాలు చేస్తూ నిర్వహించిన బోనాల ఊరేగింపు భక్తులకు కనువిందు చేసింది. శివసత్తుల సిగాలు, పోతరాజుల విన్యాసాలు అలరించాయి. మాజీ మంత్రి హరీశ్ రావు, మెదక్‌ ఎంపీ కొత్త ప్రభాకర్‌ రెడ్డి, మెదక్ ఎమ్మెల్యే పద్మాదేవేందర్‌ రెడ్డి మంగళవారం వనదుర్గా మాతను దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. వారికి పూజారులు పూర్ణకుంభ స్వాగతం పలికారు. ఏడుపాయల దేవాలయ కమిటీ ఛైర్మన్‌ విష్ణువర్ధన్‌ రెడ్డి ఆలయ మర్యాదలతో వారిని సన్మానించారు.

బండెనక బండి కట్టి..
జోరుగా డప్పుల దరువులు… హుషారుగా యువకుల డ్యాన్సులు… భక్తజనం జయజయ ధ్వానాల మధ్య మంగళవారం సాయంత్రం ఏడుపాయల జాతరలో బండ్ల ఊరేగింపు కనుల పండువగా సాగింది. ఆనవాయితీ ప్రకారం పాపన్నపేట సంస్థానాధీశుల బండి ముందు దేవాలయ కమిటీ ఛైర్మన్‌ విష్ణువర్ధన్‌ రెడ్డి కొబ్బరికాయ కొట్టి బండ్ల ఊరేగింపును ప్రారంభించారు. పాపన్నపేట మండలంలోని వివిధ గ్రామాలకు చెందిన బండ్లు పెద్దసంఖ్యలో ఊరేగింపులో పాల్గొన్నాయి. చెలిమెలకుంట నుంచి ప్రారంభమైన బండ్ల ఊరేగింపు ఏడుపాయల్లోని మెయిన్‌ రోడ్డు మీదుగా రాజగోపురం ముందు నుంచి సాగింది. ఊరేగింపును తిలకించేందుకు భక్తులు పెద్ద సంఖ్యలో రావడంతో జాతర ప్రాంగణం కిటకిటలాడింది.