
అనారోగ్య సమస్యలకు కారణం.. మనం తినే ఆహారం, లైఫ్‌స్టయిల్ అని తెలియగానే ఉన్నఫళంగా ఢిల్లీ నుంచి సొంతూరికి పయనమయ్యింది రీవ. ప్రకృతికి దగ్గరగా బతుకుతూ, సహజంగా పండినవి తింటూ హాయిగా బతకాలి అనుకుంది. అందుకే కుటుంబ వారసత్వంగా వచ్చిన భూమిలో సాగు చేయడం మొదలుపెట్టింది. అంతటితో ఆగకుండా నేచురల్ ఫుడ్‌ని అందరికీ పంచాలనే ఆలోచనతో ఎంట్రప్రెన్యూర్‌గా మారింది. ఇప్పుడు ఏటా రూ. కోటి వరకూ సంపాదిస్తూనే.. మరో 300 మంది గ్రామీణ మహిళలకు సాయం చేస్తోంది.
రీవసూద్‌ది హిమాచల్ ప్రదేశ్. కానీ.. చదువు, వృత్తిపరమైన అవసరాల వల్ల కొన్నేళ్ల క్రితం వాళ్ల కుటుంబం ఢిల్లీకి వెళ్లి సెటిల్ అయ్యింది. భర్త రాజీవ్ సూద్ ఒక డాక్టర్. అతనికి 2012లో పేగు క్యాన్సర్ ఉన్నట్లు నిర్ధారణ అయింది. దాంతో వాళ్ల జీవితం ఒక్కసారిగా తలకిందులైంది. ఆ విషయం తెలిసిన తర్వాత ఇద్దరికీ ఏం చేయాలో తోచలేదు. అన్ని ఆరోగ్యకరమైన అలవాట్లే ఉన్నా క్యాన్సర్ ఎందుకొచ్చిందో ఎవరికీ అర్థం కాలేదు. ‘‘రాజీవ్ పరిస్థితికి కారణాలను వెతకడం మొదలుపెట్టా. అప్పటివరకు మా ఫ్యామిలీలో అందరం చాలా బిజీ లైఫ్ గడిపేవాళ్లం. కానీ.. అప్పటినుంచి ప్రతిరోజూ కుటుంబం అంతా కలిసి భోజనం చేయడం, ఫ్యామిలీతో స్పెండ్ చేయడానికి ఎక్కువ టైం కేటాయించడం అలవాటు చేసుకున్నాం. ఒకసారి రాజీవ్‌ని ‘మీరు డాక్టర్ కదా! అన్ని జాగ్రత్తలు పాటించే మీకే ఇలా ఎందుకు జరిగింది? మనం ఏం తప్పు చేసి ఉండొచ్చు?’ అని అడిగా. అప్పుడాయన పేగు క్యాన్సర్‌కి ప్రధానం కారణం రోజూ తను తినే ఆహారమే అయ్యుండొచ్చు’ అని చెప్పారు. ముఖ్యంగా రసాయన పురుగుమందులు వాడిన కూరగాయలు, పండ్ల వల్లే ఇలాంటి సమస్యలు వస్తాయని వివరించారు. అందుకే మా లైఫ్ స్టయిల్‌తోపాటు ఆహారపు అలవాట్లను కూడా పూర్తిగా మార్చుకోవాలని నిర్ణయం తీసుకున్నాం” అంటూ చెప్పుకొచ్చింది రీవ.
సొంతూరికి ప్రయాణం..
ఆరోగ్యకరమైన లైఫ్ స్టయిల్ కోసమే తన భర్తతో కలిసి ఢిల్లీ నుంచి మకాం మార్చింది రీవ. హిమాచల్ ప్రదేశ్‌లో ఉన్న ఉనా జిల్లాలోని తన సొంతూరికి వెళ్లిపోయింది. అక్కడ వాళ్ల పూర్వీకులకు సంబంధించిన కొంత భూమి ఉంది. కానీ.. ఆ భూమిలో ఎన్నో ఏండ్ల నుంచి సాగు చేయడం లేదు. దాంతో కలుపు మొక్కలు పెరిగి బంజరు భూమిగా మారిపోయింది. అలాంటి భూమిని రీవ చాలా కష్టపడి వ్యవసాయానికి పనికొచ్చేలా చదును చేయించింది. ముందుగా అందులో డ్రాగన్ ఫ్రూట్ సాగు మొదలుపెట్టింది. అది కాక్టస్ రకం మొక్క. శుష్క, కొండ ప్రాంతాల్లోని రాళ్ల భూమిలో కూడా పెరుగుతుంది. పైగా ఎక్కువగా నీళ్లు కూడా అవసరం లేదు. దాని ముళ్ల కొమ్మల వల్ల కోతులు, నీల్‌గాయ్ (ఒక రకమైన అడవి జంతువు) లాంటి అక్కడి వన్యప్రాణులు కూడా పెద్దగా దాడులు చేయవు. ఆమె మొదటిసారి థాయిలాండ్, తైవాన్‌లకు వెళ్లినప్పుడు ఈ విదేశీ ఫ్రూట్‌ను చూసింది రీవ. వాటిలో యాంటీఆక్సిడెంట్స్, క్యాన్సర్ నుంచి కాపాడే లక్షణాలు ఉంటాయని, దానివల్ల అనారోగ్య సమస్యలు ఉన్నవాళ్లకు మేలు జరుగుతుందని తెలుసుకుంది. అందుకే డ్రాగన్ సాగుని ఎంచుకుంది. మొదటగా 2017లో ఐదు ఎకరాల్లో 2,000 డ్రాగన్ ఫ్రూట్ మొక్కలను నాటింది. వాటికి వర్మీకంపోస్టింగ్ లాంటి ఆర్గానిక్ పద్ధతుల్లో తయారుచేసిన ఎరువులే వేసింది. పురుగుల మందులకు బదులు మజ్జిగ, జీవామృతం (ఆవు పేడ, మూత్రంతో తయారు చేసిన ద్రవం) లాంటి వాటిని ఉపయోగించింది. కొన్నాళ్లకు మొక్కలు ఏపుగా పెరిగాయి. అక్కడి కొండల మధ్య డ్రాగన్ ఫ్రూట్స్ అందాలు స్పెషల్ అట్రాక్షన్ అయ్యాయి.
ఆమెతో కలిసి నడుస్తూ..
డ్రాగన్ ఫ్రూట్స్‌ని ప్రాసెస్ చేస్తూ.. తను లాభాలు సాధించిన తర్వాత తన దారిలోనే ఎంతోమందిని నడిపించింది. ఇప్పుడు హిమాచల్ ప్రదేశ్‌తోపాటు హర్యానా, పంజాబ్, ఉత్తరాఖండ్, ఢిల్లీల్లోని దాదాపు 300 మంది గ్రామీణ మహిళలు ఆమెతో కలిసి నడుస్తూ లాభాలు పొందుతున్నారు. వాళ్లంతా ఆమె పెట్టిన ఫార్మర్ ప్రొడ్యూసర్ ఆర్గనైజేషన్ ‘హిమ్‌టుహమ్’లో భాగమయ్యారు. వాళ్లు డ్రాగన్ ఫ్రూట్స్, అశ్వగంధ, మునగతో సహా కొన్ని మూలికలను పండించి, ప్రాసెస్ చేస్తున్నారు. ఆ తర్వాత వాటిని రీవ మార్కెట్ చేస్తోంది. రీవ పరిచయం వల్ల ఆ గ్రామీణ మహిళల ఆదాయం పెరగడమే కాదు.. కొత్త వ్యవసాయ పద్ధతులు కూడా నేర్చుకున్నారు. హర్యానాకు చెందిన మమతా రథీ ‘హిమ్‌టూహమ్’లో ఒకటిన్నర సంవత్సరాల నుంచి సభ్యురాలిగా ఉంది. ఆమె ‘‘గోధుమ, మునగ పంటలను పండిస్తున్నా. మార్కెట్‌లో ధర లేనప్పుడు వాటితో న్యూట్రీషియస్ పౌడర్లు తయారుచేస్తున్నా. అందుకోసం సొంతంగా ఒక మిల్లుని ఏర్పాటు చేసుకున్నా. నా ప్రొడక్ట్స్‌ని రెగ్యులర్‌గా రీవ మేడమ్‌కు పంపిస్తుంటా. దీనివల్ల నేను పంటను బయట అమ్మినదానికంటే ప్రతినెలా అదనంగా రూ. 10,000 సంపాదించగలుగుతున్నా. మాది బాగా రూరల్ ఏరియా. కాబట్టి.. పంటను మార్కెట్ చేసుకోవడం చాలా కష్టమైంది. కానీ.. రీవ వల్ల ఇప్పుడు చాలా ఈజీగా అమ్ముకోగలుగుతున్నా” అంటోంది.
కోటి ఆదాయం
ప్రస్తుతం తన వెంచర్ నుంచి రీవ సంవత్సరానికి రూ. కోటి సంపాదిస్తోంది. వచ్చే సంవత్సరం లాభాలను పెంచడంతోపాటు డ్రాగన్ ఫ్రూట్ జ్యూస్ మార్కెట్‌లో తన బ్రాండ్‌ని ప్రత్యేకంగా నిలిపేందుకు ప్రయత్నాలు చేస్తోంది. ‘అగ్రివా నేచురల్లీ’ నుంచి విదేశాలకు ఎగుమతులు చేయాలనే లక్ష్యంతో పనిచేస్తోంది. ‘‘ఒక సేంద్రీయ రైతుగా, గ్రామీణ ఎంట్రప్రెన్యూర్‌గా నా ప్రయాణంలో ఎంతో ఆనందం, సంతృప్తిని పొందాను. పొలంలోనే ఎక్కువ సమయం గడపడం వల్ల జీవితంలోని కష్టాలను అధిగమించడానికి కావాల్సిన మనోధైర్యం వచ్చింది. పొలం పనులు చేయడం వల్లే 67 ఏళ్ల వయసులో కూడా 40 ఏళ్ల వ్యక్తిలా ఉన్నా. ఢిల్లీ సిటీ లైఫ్, విలాసాల కన్నా ఈ హిమాచల్ కొండల్లో వ్యవసాయం చేసే హెల్దీ డైలీ రొటీన్ అంటేనే నాకు ఇష్టం. ఇప్పుడు నా పిల్లలు కూడా సెటిల్ అయ్యారు. నేను వాళ్లకు దూరంగా ఉంటున్నా.. ప్రకృతికి దగ్గరయ్యాననే తృప్తి ఉంది” అంటోంది రీవ.
70 ఎకరాలకు
డ్రాగన్ ఫ్రూట్ చెట్ల మధ్యలో దాదాపు ఐదు అడుగుల ఖాళీ స్థలం ఉంటుంది. అందులో రీవ అశ్వగంధ, తులసి లాంటి అంతర ఔషధ పంటలు వేసింది. దాంతో ఆదాయం రెండింతలు అయ్యింది. ఆ తర్వాత కొన్నేండ్లలోనే సాగు విస్తీర్ణాన్ని 70 ఎకరాలకు పెంచింది. ఆమె భూమిలో ఇప్పుడు మొత్తం 30,000 డ్రాగన్ ఫ్రూట్ మొక్కలు ఉన్నాయి. డ్రాగన్ ఫ్రూట్స్‌ని స్థానికంగా కిలో రూ. 200 చొప్పున అమ్ముతుంది. రీవ అంతటితో ఆగిపోలేదు. ఆదాయం పెంచుకోవడానికి, తన పంటను మార్కెట్ చేసుకునే క్రమంలో ఒక స్టార్టప్ కూడా పెట్టింది. స్థానికంగా అమ్మిన తర్వాత మిగిలిన పండ్లను నేచురల్ జ్యూస్‌లా ప్రాసెస్ చేసి, ‘అగ్రివా నేచురల్లీ’ బ్రాండ్ పేరుతో మార్కెట్ చేస్తోంది.