వర్షాలతో ఊపందుకున్న సాగు .. నీళ్లులేక ఎండిపోయే దశలో దంచికొడుతున్న వానలు

వర్షాలతో ఊపందుకున్న సాగు  .. నీళ్లులేక ఎండిపోయే దశలో దంచికొడుతున్న వానలు
  • రాష్ట్రవ్యాప్తంగా అన్ని జిల్లాల్లోనూ వర్షాలు
  • ఆదిలాబాద్‌‌లో ఇప్పటి వరకూ 97  శాతం సాగు
  • మిగతా జిల్లాల్లో 50 శాతానికి చేరువలో.. రైతుల్లో చిగురించిన ఆశలు

హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలో గత కొన్ని రోజులుగా కురుస్తున్న వర్షాలు రైతుల ఆశలకు ఊపిరిపోశాయి. నీళ్లు లేక ఎండిపోతున్న పంటలకు తాజా వర్షాలు జీవం పోసి, వర్షాధార సాగుపై ఆశలు రేకెత్తించాయి. దాదాపు 20 రోజుల పాటు వర్షాల్లేక ఆందోళనలో మునిగిన అన్నదాతలు, గత మూడు రోజులుగా వానలు దంచి కొడుతుండడంతో ఆనందపడుతున్నారు. ఈ వర్షాలతో రాష్ట్రవ్యాప్తంగా సాగు విస్తీర్ణం 50 శాతానికి చేరువ కాగా.. ఆదిలాబాద్ జిల్లాలో 97 శాతం సాగు అయినట్టు వ్యవసాయ శాఖ అధికారుల నివేదికలు వెల్లడించాయి. వర్షాలు మరికొన్ని రోజులు ఇలాగే పడితే ఈ వానాకాలం సాగు.. రైతులకు లాభసాటిగా మారే అవకాశం ఉందని వ్యవసాయ నిపుణులు అభిప్రాయపడుతున్నారు.

వర్షాలతో పుంజుకున్న సాగు

గత శుక్రవారం నుంచి కురుస్తున్న భారీ వర్షాలు రైతుల్లో సంతోషం నింపాయి. వాడిపోతున్న పత్తి, మక్కజొన్న, సోయా, పప్పుదినుసుల పంటలకు  ఊరట కలిగించాయి. టమాటా, మిర్చి, వంకాయ, క్యాలీఫ్లవర్‌‌‌‌లాంటి కూరగాయల సాగుకు కూడా ఈ వర్షాలు ఊపిరిలూదాయి. వర్షాలతో పంటలపై తెగుళ్ల ప్రభావం తగ్గుముఖం పట్టినట్లు వ్యవసాయ నిపుణులు తెలిపారు. పక్క రాష్ట్రాల్లోనూ భారీ వర్షాలు కురుస్తుండడంతో  రాష్ట్రవ్యాప్తంగా జలాశయాల్లోకి వరద నీరు చేరుతున్నది. మరో నాలుగైదు రోజులు ఇలాగే వర్షాలు కొనసాగితే వరి నాట్లతోపాటు  ఇతర  పంటల సాగు మరింత వేగవంతం కానుందని రైతులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.

మొన్నటిదాకా వర్షాల్లేక సాగులో వెనుకబాటు

ఈ వానాకాలం సీజన్‌‌లో వర్షాభావం, ప్రతికూల పరిస్థితులతో ఇన్నాళ్లు  రైతాంగం తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నది. జులై సగం నెల దాటినా  సరైన వర్షాలు కురవకపోవడంతో సాగు విస్తీర్ణం గణనీయంగా తగ్గింది. రాష్ట్రవ్యాప్తంగా 25 జిల్లాల్లో లోటు వర్షపాతం నమోదైంది. సీజన్‌‌లో సగటున 243.20 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదవ్వాల్సి ఉండగా, గత వారం రోజుల వరకు కేవలం 176.8 మిల్లీ మీటర్లు మాత్రమే కురిసింది. దీంతో లాస్ట్​ వీక్​ వరకు  28 శాతం లోటు వర్షపాతం నమోదైంది. దీని ప్రభావంతో విత్తనాలు వేయలేక, వేసిన చోట్ల మొలకలు ఎండిపోవడంతో రైతులు ఆందోళన చెందారు. 

మహబూబాబాద్​, భద్రాద్రి కొత్తగూడెం, ములుగు జిల్లాల్లో నేటికీ అనుకున్నంతగా వర్షాలు కురవలేదు.  వ్యవసాయ శాఖ అంచనా ప్రకారం, ఈ సీజన్‌‌లో 1.32 కోట్ల ఎకరాల్లో పంటలు సాగు చేయాలని టార్గెట్​ పెట్టుకోగా, ఇప్పటివరకూ కేవలం 61.10 లక్షల ఎకరాలు (46.13%)లోనే సాగు జరిగింది. సాధారణంగా ఈ సమయానికి 66.41 లక్షల ఎకరాల్లో సాగు జరగాల్సి ఉండగా, 5.31 లక్షల ఎకరాల లోటు నమోదైంది. అయితే తాజా వర్షాలతో  సాగు కొంతమేర 
ఊపందుకుంటున్నది. 

పత్తి సాగు పరుగులు.. వరి సాగు వెనుకబాటు

ప్రతికూల పరిస్థితుల్లోనూ పత్తి సాగు 38.56 లక్షల ఎకరాల్లో జరిగి, ఈ సీజన్‌‌లో అత్యధిక సాగు విస్తీర్ణాన్ని సాధించింది. మక్కజొన్న 5 లక్షల ఎకరాలు, కందులు 3.43 లక్షల ఎకరాలు, సోయాబీన్ 3.30 లక్షల ఎకరాల్లో సాగైంది. అయితే, వరి సాగు కేవలం 8 లక్షల ఎకరాల్లోనే జరిగింది. ఇది అంచనాలకు దూరంగా ఉంది. వరి సాగుపై వర్షాభావం  తీవ్ర ప్రభావం చూపింది. తాజాగా  కురుస్తున్న వర్షాలతో తిరిగి వరి సాగు ఊపందుకుంటున్నది.  ఇప్పటివరకూ ఆదిలాబాద్ జిల్లా పంటల సాగు విస్తీర్ణంలో ముందంజలో ఉంది. ఆదిలాబాద్​ జిల్లాలో 5.77 లక్షల ఎకరాల అంచనాకుగాను 5.60 లక్షల ఎకరాలు (97.10%) సాగైంది. ఆసిఫాబాద్‌‌లో 80% వరకు సాగు జరిగింది. సంగారెడ్డి (4.90 లక్షల ఎకరాలు), నల్గొండ (4.43 లక్షల ఎకరాలు), నిజామాబాద్ (3.79 లక్షల ఎకరాలు) జిల్లాలు కూడా సాగులో ముందున్నాయి. అత్యల్పంగా మేడ్చల్ జిల్లాలో కేవలం 3,708 ఎకరాల్లోనే సాగు జరిగింది.

వానలు మేలు చేసినయ్​ 

మూడు రోజులుగా కురిసిన వర్షాలు పంటలకు జీవం పోసినయ్​. చెరువుల్లోకి ఎక్కువగా నీళ్లురాకపోయినా పంటలకు ప్రాణం పోసినయ్​. నేను పత్తి, మక్కజొన్న సాగుచేసిన. మరో నాలుగైదు రోజులు వర్షం ఇలాగే పడితే నష్టం తప్పుతుంది.

లక్ష్మీకాంత్‌‌రెడ్డి,  యువ రైతు, వికారాబాద్​​ జిల్లా