ఇస్కాన్ రెస్టారెంట్కెళ్లి.. ఇది వెజ్ హోటలా అని అడిగి మరీ.. కావాలని చికెన్ తిన్నాడు !

ఇస్కాన్ రెస్టారెంట్కెళ్లి.. ఇది వెజ్ హోటలా అని అడిగి మరీ.. కావాలని చికెన్ తిన్నాడు !

లండన్లో ఇస్కాన్ ఆధ్వర్యంలో నడుస్తున్న గోవింద రెస్టారెంట్లో ఒక విదేశీయుడి ప్రవర్తన వివాదాస్పదమైంది. ఇస్కాన్ రెస్టారెంట్లో కేవలం శాకాహారం మాత్రమే అందుబాటులో ఉంటుంది. అలాంటి చోట.. ఒక విదేశీయుడు ఉద్దేశపూర్వకంగా ఆ రెస్టారెంట్లోకి వెళ్లి.. ఆ రెస్టారెంట్ సిబ్బందితో మాట్లాడుతూ.. కేఎఫ్సీ బకెట్ బయటకు తీసి చికెన్ ముక్కలు తిన్నాడు. ఇక్కడ అలా నాన్ వెజ్ తీసుకురాకూడదని, తినకూడదని ఇస్కాన్ రెస్టారెంట్ సిబ్బంది ఎంత చెప్పినా ఆ యువకుడు వినలేదు.

ఉద్దేశపూర్వకంగా జాత్యంహకార థోరణిలో, మత విశ్వాసాలను దెబ్బతీసే విధంగా ఆ విదేశీయుడు ప్రవర్తించడంపై విమర్శలు వ్యక్తమయ్యాయి. సోషల్ మీడియాలో ఈ ఘటనకు సంబంధించిన వీడియో వైరల్ అయింది. సెక్యూరిటీ సిబ్బంది జోక్యం చేసుకుని అతనిని బయటకు పంపించేంత వరకూ ఆ శాకాహార రెస్టారెంట్లో నాన్వెజ్ తింటూ ఆ యువకుడు ప్రవర్తించిన తీరుపై హిందువులు మండిపడ్డారు. అయితే.. ఈ ఘటన తాజాగా జరిగిందో (లేక) ఎప్పుడో జరిగిన ఘటనకు సంబంధించిన దృశ్యాలా అనే విషయంలో స్పష్టత లేదు.

Also Read:-హైదరాబాద్లో దివ్యాంగురాలిపై అఘాయిత్యం.. నాన్నకు చెబుదాం అని చెల్లెలు అంటే భయంతో అక్క ఆత్మహత్య

ఇస్కాన్ లక్ష్యంగా ఇటీవల ఇలాంటి జాత్యంహకార చర్యలు పెరుగుతుండటం ఆందోళన కలిగిస్తున్న అంశం. అమెరికా ఉతాహ్లోని స్పానిష్ ఫోర్స్లో ఉన్న ఇస్కాన్ రాధాకృష్ణ మందిరంపై కొందరు దుండగులు కాల్పులు జరిపిన సంగతి తెలిసిందే. భక్తులు, అతిథులు ఆలయంలో ఉన్న సమయంలో ఈ ఘటన జరిగింది. సుమారు 20 నుంచి 30 బుల్లెట్లు ఆలయం గోడల్లోకి దూసుకెళ్లాయి. అయితే.. భక్తులకు ఎలాంటి హాని జరగకపోవడంతో అంతా ఊపిరిపీల్చుకున్నారు. ఈ కాల్పుల ఘటనను భారత్ తీవ్రంగా పరిగణించింది. ఈ ఘటనపై విచారణ జరిపి.. ఈ చర్యకు పాల్పడిన దుండగులపై కఠిన చర్యలు తీసుకోవాలని భారత్ అమెరికాకు స్పష్టం చేసింది.