హైదరాబాద్లో దివ్యాంగురాలిపై అఘాయిత్యం.. నాన్నకు చెబుదాం అని చెల్లెలు అంటే భయంతో అక్క ఆత్మహత్య

హైదరాబాద్లో దివ్యాంగురాలిపై అఘాయిత్యం.. నాన్నకు చెబుదాం అని చెల్లెలు అంటే భయంతో అక్క ఆత్మహత్య

హైదరాబాద్ లో దారుణ ఘటన చోటుచేసుకుంది. దివ్యాంగురాలు అని కూడా చూడకుండా అఘాయిత్యానికి పాల్పడ్డాడు ఓ దుండగుడు. ఆ అమ్మాయి నిరాకరించడంతో గొంతు కోసి ఉన్మాదాన్ని బయటపెట్టాడు దుర్మార్గుడు. చివరికి అవమానాన్ని భరించలేక మనస్తాపంతో ఆత్మహత్య చేసుకుంది ఆ అమాయకురాలు. ఈ ఘటన మీర్ పేట లో జరిగింది. 

మీర్ పేటలో 20 రోజుల క్రితం దివ్యాంగురాలిపై అత్యాచారానికి ప్రయత్నించి.. బ్లేడుతో గొంతు కోసిన ఘటన గురించి తెలిసిందే. అయితే బాధితురాలు కొన్నాళ్లు చికిత్స పొందిన తర్వాత సూసైడ్ చేసుకుంది. ఈ ఘటనకు సంబంధించి ఆమె చెల్లెలు పోలీసులకు వివరాలు వెల్లడించింది. 

వివరాల్లోకి వెళ్తే.. ప్రకాశం జిల్లా కు చెందిన ఏడుకొండలు బతుకుదెరువు  కోసం హైదరాబాద్ వచ్చాడు.   అల్మాస్గూడలో గత 12 సంవత్సరాలుగా నివాసం ఉంటున్నాడు. ఏడుకొండలుకు ఇద్దరు కుమార్తులు, ఒక కొడుకు ఉండగా.. కుమార్తెలు ఇద్దరూ దివ్యాంగులు. 

 ఏడుకొండలు ఇంటి ఎదురుగా శిరీష అనే మహిళ కుటుంబంతో ఉంటోంది. ఆమె మరిది శ్రీకాంత్.. ఏడుకొండలు పెద్ద కుమార్తె తో తరచుగా మాట్లాడుతూ పరిచయం  పెంచుకున్నాడు. ఒక రోజు ఇంట్లో ఎవరూ లేని సమయంలో తన అక్కను అత్యాచారం చేశాడని చెల్లెలు భువనేశ్వరి పోలీసులకు తెలిపింది. ఆ సమయంలో చెల్లెలు బయటి నుంచి ఇంట్లోకి రావడంతో బాత్రూంలో దాక్కున్నాడని.. ఈ విషయం ఎవరికైనా చెప్తే మీ తల్లిదండ్రులను చంపేస్తానని బెదిరించాడని చెప్పింది. 

Also Read:-ఇస్కాన్ రెస్టారెంట్కెళ్లి.. ఇది వెజ్ హోటలా అని అడిగి మరీ.. కావాలని చికెన్ తిన్నాడు !

20 రోజుల క్రితం జరిగిన ఈ ఘటనలో శ్రీకాంత్ బ్లేడుతో కోయటంతో ఏడుకొండలు పెద్దకూతురు తీవ్రంగా గాయపడింది. దీంతో  ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స అందించారు. కోలుకున్న తర్వాత జరిగిన విషయాన్ని తండ్రితో చెబుదామని చెల్లెలు బాధితురాలైన తన అక్కతో చెప్పింది. దీంతో భయం, మనస్తాపంతో రూమ్ లోకి వెళ్లి ఆత్మహత్య చేసుకుంది బాధితురాలు. 

తన అక్క ఆత్మహత్యకు గల కారణాన్ని చెల్లెలు సైగల ద్వారా పోలీసులకు చెప్పింది. ఆస్పత్రి నుంచి కోలుకున్న తర్వాత నిందితుడు శ్రీకాంత్ తనపై ఏ విధంగా ప్రవర్తించాడో బాధితురాలు ఫోటోల ద్వారా తనకు చెప్పినట్లు చెల్లెలు తెలిపింది. పూర్తి వివరాలు తీసుకున్న మీర్ పేట్  పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. మృతదేహాన్ని పోస్ట్ మార్టం కోసం  ఉస్మానియా ఆస్పత్రికి తరలించారు.