ఫోన్ పే, గూగుల్ పేలో.. బ్యాంకు బ్యాలెన్స్ చెక్ చేసుకునే అలవాటుందా..? పెద్ద విషయమే ఇది..!

ఫోన్ పే, గూగుల్ పేలో.. బ్యాంకు బ్యాలెన్స్ చెక్ చేసుకునే అలవాటుందా..? పెద్ద విషయమే ఇది..!

ఆగస్ట్ 1 నుంచి యూపీఐ రూల్స్ మారబోతున్నాయి. యూపీఐ లావాదేవీలకు సంబంధించి NPCI నాలుగు కీలక మార్పులను ఆగస్ట్ 1 నుంచి అమలు చేయనుంది. యూపీఐ యాప్స్ నుంచి బ్యాంకు బ్యాలెన్స్ చెక్ చేసుకునే అలవాటు చాలా మందికి ఉంటుంది. బ్యాంకింగ్ యాప్ల లాగిన్ ఇష్యూస్ వల్ల కావచ్చు, యూపీఐ యాప్స్ నుంచి అయితే త్వరగా బ్యాలెన్స్ చెక్ చేసుకోవచ్చనే ఉద్దేశంతో కావచ్చు చాలామంది ఖాతాదారులు గూగుల్ పే, ఫోన్ పే, పేటీఎం వంటి యాప్స్ నుంచి వారి బ్యాంక్ బ్యాలెన్స్ ఎంత ఉందనే విషయం చెక్ చేసుకుంటుంటారు.

ఇన్నాళ్లూ యూపీఐ యాప్స్లో ఈ బ్యాలెన్స్ చెక్ చేసుకునే వెసులుబాటుపై ఎలాంటి పరిమితులు లేవు. రోజుకు ఎన్ని సార్లు అయినా బ్యాలెన్స్ చెక్ చేసుకోవచ్చు. కానీ.. ఆగస్ట్ 1 నుంచి ఆ పరిస్థితి ఉండదు. రోజుకు 50 సార్లు మాత్రమే యూపీఐ యాప్ నుంచి బ్యాలెన్స్ చెక్ చేసుకునే అవకాశం ఉంటుంది. బ్యాలెన్స్ చెకింగ్ వెసులుబాటుపై NPCI పరిమితి విధించడమే ఇందుకు కారణం. అంతేకాదు.. మీ మొబైల్ నంబర్కు మీకు సంబంధించిన ఏ బ్యాంకు ఖాతా అనుసంధానం అయి ఉందో తెలుసుకునే వెసులుబాటుపై కూడా ఆగస్ట్ 1 నుంచి NPCI పరిమితి విధించింది.

Also Read:-నెలకు 30వేల జీతంతో కూడా లక్షాధికారి కావొచ్చు! ఖర్చులు కాదు, సేవింగ్స్ ముఖ్యం..

ఆగస్ట్ 1 నుంచి రోజుకు 25 సార్లు మాత్రమే ఇలా తెలుసుకునేందుకు అవకాశం ఉంటుంది. ఆటోపే సేవలు కేవలం రద్దీ తక్కువగా ఉండే సమయంలో ( Non-peak Hours) మాత్రమే ఆగస్ట్ 1 నుంచి ప్రాసెస్ అవుతాయి. మరో ముఖ్యమైన విషయం ఏంటంటే.. కొన్నిసార్లు సర్వర్ ఇష్యూస్ వల్ల యూపీఐ యాప్స్ లో మనం పంపే డబ్బు లేదా మనకొచ్చే డబ్బు ప్రాసెసింగ్లో పడి ఆగిపోతుంది. ఇలా ఆగిపోయిన ట్రాన్షాక్షన్స్కు సంబంధించి ఎక్కడ వరకొచ్చిందని స్టేటస్ చెక్ చేసుకునే అవకాశం ‘ఎట్ ఎ టైం’ కేవలం మూడు సార్లు మాత్రమే ఉంటుంది. మళ్లీ స్టేటస్ చెక్ చేయాలంటే 90 సెకన్ల తర్వాత మాత్రమే అవకాశం ఉంటుంది. యూపీఐ లావాదేవీలకు సంబంధించిన ఈ కీలక మార్పులన్నీ ఆగస్ట్ 1 నుంచి అమల్లోకి రానున్నాయి.