మేం కలిసే ఉన్నం .. ఒకే వేదికపై కర్నాటక సీఎం, డిప్యూటీ సీఎం

మేం కలిసే ఉన్నం .. ఒకే వేదికపై కర్నాటక  సీఎం, డిప్యూటీ సీఎం
  • కపిల నదికి కలిసి పూజలు చేసిన సిద్ధూ, డీకే
  • మైసూరు సభలో డీకే పేరు పలకని సిద్ధరామయ్య
  • విమర్శలు వ్యక్తం కావడంతో తెల్లారే కలిసి కనిపించిన లీడర్లు

మైసూరు (కర్నాటక): కర్నాటకలో సీఎం మార్పు ఉంటుందని కొన్ని రోజులుగా ప్రచారం జరుగుతుండగా.. తరచూ అక్కడ ఆసక్తికర పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి.  ఓ కార్యక్రమంలో డిప్యూటీ సీఎం డీకే శివకుమార్‌‌ పేరు ప్రస్తావించాలని కోరిన పార్టీ కార్యకర్తపై సీఎం సిద్ధరామయ్య  సీరియస్​ అవ్వడం చర్చనీయాంశం అయింది. 

దీంతో ఇద్దరి మధ్య విభేదాలు తారాస్థాయికి చేరాయనే ఆరోపణలు వెల్లువెత్తాయి. అయితే, మరుసటి రోజు ఈ ఊహాగానాలకు ఇద్దరు నేతలు తెరదించారు. ఆదివారం జరిగిన  కావేరీ ఉపనది కపిల నది పూజా కార్యక్రమం ‘బాగినా’లో సిద్ధ రామయ్య, డీకే శివకుమార్ కలిసి పాల్గొన్నారు. ప్రస్తుతం ఈ నది పూర్తి సామర్థ్యంతో ప్రవహిస్తున్నది. ఈ నేపథ్యంలో నది వద్ద ప్రభుత్వం ఆధ్వర్యంలో ప్రత్యేక పూజలు చేశారు. ఈ కార్యక్రమంలో ఒకే వేదికపై కనిపించిన సిద్ధ రామయ్య, డీకే..  ఐక్యంగా ఉన్నట్లు సంకేతాలిచ్చారు.

డీకే పేరు పలకని సిద్ధ రామయ్య

మైసూరులో శనివారం  నిర్వహించిన సాధన సమావేశంలో సిద్ధరామయ్య, డీకే శివకుమార్‌‌, ఏఐసీసీ చీఫ్​ మల్లికార్జున ఖర్గే సహా పలువురు కీలక నేతలు పాల్గొన్నారు.  డీకే తన ప్రసంగం ముగించుకొని ఢిల్లీ వెళ్లేందుకు  బెంగళూరు ఎయిర్​పోర్ట్‌‌కు బయలుదేరారు. ఆ తర్వాత సీఎం సిద్ధ రామయ్య ప్రసంగించారు. ఈ క్రమంలో ప్రముఖుల గురించి ప్రస్తావించే సమయంలో డీకే పేరును మరిచిపోయారు. పార్టీ కార్యకర్త ఒకరు ఈ విషయాన్ని గుర్తుచేయగా..  ఆయనపై సిద్ధరామయ్య ఫైర్​ అయ్యారు.  

‘‘డీకే ఇక్కడ లేరుకదా.. ఆయన బెంగళూరు వెళ్లిపోయారు. ప్రొటోకాల్​ ప్రకారం వేదిక మీద ఉన్నోళ్ల పేరే ప్రస్తావించాలి. ఇంట్లో కూర్చున్నవాళ్ల పేర్లు కాదు” అని కామెంట్​ చేశారు. ఈ వ్యాఖ్యలు కర్నాటక రాజకీయాల్లో చర్చనీయాంశం అయ్యాయి. డీకేకు ఘోర అవమానం జరిగిందని  బీజేపీ విమర్శించింది. కాగా, బీజేపీ వ్యాఖ్యలపై సిద్ధరామయ్య మండిపడ్డారు. ఢిల్లీ వెళ్తున్నట్టు డీకే తమకు ముందే చెప్పారని తెలిపారు. 

అందుకే తాను ఆయన పేరు పలకలేదని, అది అవమానించడం ఎలా అవుతుందన్నారు. లేని సమస్యను ఉన్నట్టు బీజేపీ సృష్టిస్తున్నదని, రాజకీయ మైలేజ్​ కోసం కలలు కంటున్నదని అన్నారు. వారు ఎప్పటికీ కలల్లోనే ఉంటారని ఎద్దేవా చేశారు. కాగా, ఢిల్లీలో పని ఉండడంతోనే సీఎం, ఇతర నాయకులకు ముందే చెప్పి కార్యక్రమం మధ్యలో వెళ్లిపోయానని డీకే తెలిపారు.