
బాలీవుడ్ లేటెస్ట్ హారర్ కామెడీ థ్రిల్లర్ 'ది భూత్నీ'. బాలీవుడ్ హాట్ బ్యూటి, నాగిని సీరియల్ హీరోయిన్ మౌనీ రాయ్, హీరో సంజయ్ దత్ ప్రధాన పాత్రల్లో నటించిన ఈ సినిమాకు కథ, దర్శకత్వం సిద్ధాంత్ సచ్‌దేవ్ అందించారు. మే 1న థియేటర్లలో రిలీజైన ఈ మూవీ జూలై 18 నుంచి జీ5లో స్ట్రీమ్ అవుతుంది.
కామెడీ, హారర్, లవ్ అంశాలతో తెరకెక్కిన ఈ మూవీ ఆడియన్స్ను ఎంగేజ్ చేస్తుంది. థియేటర్లో పర్వాలేదు అనిపించినప్పటికీ.. ఓటీటీలో మాత్రం అదరగొడుతుంది. అయితే, హిందీ, ఇంగ్లీష్ రెండు భాషల్లో మాత్రమే అందుబాటులో ఉంది. సబ్ టైటిల్స్ తో సినిమా చూసేయొచ్చు.
కథేంటంటే:
ఈ కథ ఢిల్లీలోని సెయింట్ విన్సెంట్ కాలేజీలో మొదలవుతుంది. అక్కడ వర్జిన్ (మర్రి)చెట్టు ఉంటుంది. ప్రేమికుల దినోత్సవం సందర్భంగా స్టూడెంట్స్ ఆ చెట్టు దగ్గరకు వెళ్లి తాము ప్రేమించే వాళ్ల ఫొటోలను దానికి అతికించి తమ ప్రేమని గెలిపించమని వేడుకునే ఒక వింత ఆచారం ఉంటుంది. అదే కాలేజీలో చదువుతున్న శాంతను (సన్నీ సింగ్) బాగా మందు తాగి, చెట్టు దగ్గరకు వెళ్లి గుండెలు బాదుకుని ఏడుస్తాడు. తనకు సోల్‌మేట్‌ని ఇవ్వాలని వర్జిన్ చెట్టును వేడుకుంటాడు. అతని కోరిక విన్న చెట్టు వెంటనే అందమైన అమ్మాయి మొహబ్బత్ (మౌని రాయ్)ని అతని దగ్గరికి పంపుతుంది.
శాంతను ఆమెతో హాయిగా గడుపుతుంటాడు. కానీ, మొహబ్బత్ చివరికి ఆమె నిజ స్వరూపాన్ని చూపిస్తుంది. దాంతో ఒక్కసారిగా షాక్ అవుతాడు. ఎందుకంటే.. మొహబ్బత్ మనిషి కాదు భూత్నీ(ఆత్మ). శాంతనుకు తప్ప ఇంకెవరికీ కనిపించదు. అదే టైంలో కాలేజీలో ఒక స్టూడెంట్ ఆత్మహత్య చేసుకుంటుంది. గడిచిన 20 ఏండ్లలో అది నాలుగో ఆత్మహత్య. దాంతో కాలేజీవాళ్లు ఆ ఆత్మహత్యల రహస్యాన్ని ఛేదించడానికి పారానార్మల్ రీసెర్చర్ బాబా (సంజయ్ దత్)ని తీసుకొస్తారు. ఆ తర్వాత ఏం జరిగింది? ప్రేమికులు వర్జిన్ చెట్టుని కోరికలు కోరడానికి కారణమేంటి? తెలుసుకోవాలంటే సినిమా చూడాలి.