
హైదరాబాద్, వెలుగు: అమ్మ దీవెనలతో సీఎం రేవంత్ రెడ్డి ప్రజాసంక్షేమ పాలన కొనసాగిస్తున్నారని మంత్రి సీతక్క తెలిపారు. ఆషాఢ మాసం బోనాల ఉత్సవాల సందర్భంగా ఆదివారం హైదరాబాద్ ఎన్టీఆర్ నగర్ లోని ఖిల్లా మైసమ్మ ఆలయంలో ఆమె రాష్ట్ర ప్రభుత్వం తరఫున పట్టు వస్త్రాలు సమర్పించారు. ఈ సందర్భంగా ఆలయ సంప్రదాయాల ప్రకారం మంత్రికి ఘన స్వాగతం పలికి సన్మానించారు. అనంతరం అమ్మవారికి ప్రత్యేక పూజలు చేశారు. మంత్రి సీతక్క మాట్లాడుతూ.. రాష్ట్ర ప్రజలందరికీ బోనాల పండుగ శుభాకాంక్షలు తెలిపారు.
‘‘ప్రజలు సుఖశాంతులతో ఉండాలి. పాడి పంటలతో రాష్ట్రం సుభిక్షంగా ఉండేలా దీవించాలని ఖిలా మైసమ్మ తల్లికి మొక్కులు చెల్లించుకున్నా. ప్రజా ప్రభుత్వానికి మరింత శక్తి ప్రసాదించాలని తల్లిని వేడుకున్న’’ అని సీతక్క పేర్కొన్నారు. అదేవిధంగా వనస్థలిపురం ప్రశాంత్ నగర్లోని కొండపోచమ్మ అమ్మవారి ఆలయంలో మంత్రి సీతక్క భక్తిశ్రద్ధలతో బోనం సమర్పించారు. కార్యక్రమంలో గడ్డి అన్నారం మార్కెట్ కమిటీ చైర్మన్ చిలుకా మధుసూదన్ రెడ్డి, కాంగ్రెస్ సీనియర్ నాయకులు దీపాభాస్కర్ రెడ్డి, బడంగ్ పేట మేయర్ పారిజాత రెడ్డి తదితరులు పాల్గొన్నారు.