
- పదేండ్ల పాలనలో మహిళలను విస్మరించిండు
- లక్ష కోట్లతో కట్టిన కాళేశ్వరంతో బొట్టు నీళ్లు రాలేదు
- ఆ ప్రాజెక్టు బ్యాక్‌వాటర్‌తో వేల ఎకరాలు మునిగినయ్
- కాంగ్రెస్ పాలనలోనే మహిళా సంక్షేమమని వెల్లడి
- మహిళా సంఘాలకు 25 కోట్ల వడ్డీ లేని రుణాలు పంపిణీ
- చెన్నూరు, మంచిర్యాలలో బోనాల వేడుకల్లో పాల్గొన్న మంత్రి
కోల్‌బెల్ట్/చెన్నూరు/కోటపల్లి, వెలుగు: రాష్ట్రంలోని మహిళలను కోటీశ్వరులను చేస్తానన్న కేసీఆరేకోట్లకు పడగలెత్తారని, ఆయన పదేండ్ల పాలనలో మహిళలను పూర్తిగా విస్మరించారని మంత్రి వివేక్‌వెంకటస్వామి అన్నారు. ‘‘కాంగ్రెస్ సర్కార్ మహిళా సంక్షేమానికి కృషి చేస్తున్నది. వడ్డీ లేని రుణాలు అందజేస్తూ మహిళలు ఆర్థికంగా ఎదిగేందుకు సాయం చేస్తున్నది. 2004లో వైఎస్‌రాజశేఖర్ రెడ్డి హయాంలో పావలా వడ్డీ రుణాలిస్తే, ఇప్పుడు సీఎం రేవంత్‌రెడ్డి వడ్డీలేని రుణాలు ఇస్తున్నారు” అని చెప్పారు.
ఆదివారం మంచిర్యాల జిల్లాలోని చెన్నూరు, మంచిర్యాల నియోజకవర్గాల్లో మంత్రి వివేక్ వెంకటస్వామి పర్యటించారు. మందమర్రి మండలం గాంధారీ మైసమ్మ, వెంకటాపూర్ పోచమ్మ, సీసీసీ కార్నర్‌లోని ఆదిపరాశక్తి భువనేశ్వరీ మాత ఆలయాల్లో నిర్వహించిన బోనాల వేడుకల్లో పాల్గొని బోనమెత్తారు. చెన్నూరు మండలం కిష్టంపేటలో జరిగిన కార్యక్రమంలో 246 మహిళా సంఘాలకు రూ.25 కోట్ల వడ్డీ లేని రుణాల చెక్కులను పంపిణీ చేశారు. చెన్నూరు, కోటపల్లి, భీమారం మండలాల్లో లబ్ధిదారులకు కొత్త రేషన్‌కార్డులు అందజేశారు.
మంత్రి హోదాలో తొలిసారి వచ్చిన వివేక్‌వెంకటస్వామిని మందమర్రి మండలం బొక్కలగుట్ట రైతు వేదికలో గ్రామస్తులు, వికాస తరంగణి ప్రతినిధులు ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. తమ ప్రభుత్వం పేదలకు ఇందిరమ్మ ఇండ్లు,200 యూనిట్ల ఫ్రీ కరెంట్, రూ.500 గ్యాస్ సబ్సిడీ, మహిళలకు ఫ్రీ బస్సు ప్రయాణం, సన్నవడ్లకు రూ.500 బోనస్, రైతు భరోసా తదితర స్కీమ్‌లు అమలు చేస్తున్నదని తెలిపారు. గత బీఆర్ఎస్ప్రభుత్వం రాష్ట్ర ఖాజానాను ఖాళీ చేసిందని, ఆర్థిక పరిస్థితి బాలేకపోయినా పేదలకు ఇచ్చిన హామీలను తమ ప్రభుత్వం చిత్తశుద్ధితో నెరవేరుస్తున్నదని చెప్పారు.
బీఆర్ఎస్ హయాంలో అన్ని వర్గాలకు మోసం..
కేసీఆర్‌రూ.లక్ష కోట్లతో కట్టిన కాళేశ్వరం ప్రాజెక్టుతో బొట్టు నీళ్లు రాలేదని మంత్రి వివేక్ వెంకటస్వామి అన్నారు. ఆ ప్రాజెక్టు బ్యాక్‌వాటర్‌తో చెన్నూరు నియోజకవర్గంలో 40 వేల ఎకరాలు ముంపుకు గురయ్యాయని చెప్పారు. ‘‘రైతులకు నష్ట పరిహారం ఇవ్వాలని నేను చాలాకాలం కొట్లాడాను. కానీ ఫామ్‌హౌస్‌లో నిద్రపోయిన కేసీఆర్.. ప్రజలను పట్టించుకోలేదు.
పదేండ్ల పాలనలో అన్ని వర్గాలను నమ్మించి మోసం చేశారు. పేదలకు డబుల్బెడ్రూమ్ఇండ్లు ఇవ్వలేదు. కానీ కేసీఆర్ మాత్రం ప్రగతిభవన్ కట్టుకున్నడు. ఆయన కొడుకు, కూతురు, అల్లుడికి వందల ఎకరాల్లో ఫామ్‌హౌస్‌లు కట్టించిండు. బీఆర్ఎస్ హయాంలో ఒక్క కొత్త రేషన్‌కార్డు ఇవ్వలేదు. మేం వచ్చిన తర్వాత 25 లక్షల కొత్త రేషన్‌కార్డులు ఇచ్చాం. మరో 50 లక్షల మంది పేర్లను పాత కార్డుల్లో చేర్చాం” అని తెలిపారు.
చెన్నూరును ఆదర్శంతంగా తీర్చిదిద్దుతున్నా..
చెన్నూరు నియోజకవర్గాన్ని అన్ని విధాల అభివృద్ది చేసి ఆదర్శవంతంగా తీర్చిదిద్దుతున్నట్టు మంత్రి వివేక్ వెంకటస్వామి తెలిపారు. ‘‘పట్టణాలు, గ్రామాల్లో రోడ్లు, డ్రైనేజీలు, తాగునీటి సౌలతులు కల్పిస్తున్నాం. ప్రతి గ్రామంలో అభివృద్ధి పనులకు రూ.20 లక్షల నుంచి రూ.30 లక్షలు కేటాయించినం. చెన్నూరు నుంచి మారుమూల గ్రామాలకు కొత్తగా ఐదు బస్‌సర్వీసులను ప్రారంభించాం. కోర్టులో స్థల వివాదం పరిష్కారం కాగానే చెన్నూరులో బస్ డిపో ఏర్పాటు చేస్తాం.
సోమనపల్లిలో రూ.200 కోట్లతో ఇంటిగ్రేటెడ్ స్కూల్కట్టిస్తున్నాం. రూ.100 కోట్లతో చెన్నూరు, మందమర్రి, క్యాతనపల్లి మున్సిపాలిటీల్లో అమృత్‌స్కీమ్ ద్వారా తాగునీటి పనులు నడుస్తున్నాయి. 18 నెలల కాలంలో దాదాపు 500 మందికి వైద్య ఖర్చుల కోసం ఎల్‌వోసీలు, సీఎం రిలీప్ఫండ్చెక్కులు ఇచ్చాం. 8 వేల కొత్త రేషన్‌కార్డులు పంపిణీ చేశాం. ఎండాకాలంలో 200 బోర్లు వేశాం” అని చెప్పారు.
తెలంగాణ సంస్కృతికి ప్రతీక బోనాలు..
తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలకు బోనాల పండుగ ప్రతీక అని మంత్రి వివేక్‌వెంకటస్వామి అన్నారు. రాష్ట్ర ప్రజలంతా సుఖసంతోషాలతో ఉండాలని, సమృద్ధిగా వర్షాలు పడి పంటలు బాగా పండాలని మైసమ్మ తల్లిని కోరుకున్నట్టు చెప్పారు. మందమర్రి మండలంలో గాంధారీ మైసమ్మ ఆలయాన్ని నిర్మించి 21 ఏండ్లుగా బోనాల వేడుకలు నిర్వహించడం గొప్ప విషయమన్నారు. ‘‘బొక్కలగుట్ట గ్రామం అంటే నాకు చాలా ఇష్టం. ఇక్కడి నుంచే నా ప్రయాణం మొదలైంది. గ్రామాభివృద్ధికి కృషి చేస్తాను.
గ్రామంలోని భూములన్నీ క్యాతనపల్లి మున్సిపాలిటీ పరిధిలోకి వెళ్లిన విషయం నా దృష్టికి వచ్చింది. త్వరలోనే సంబంధిత ఆఫీసర్లతో చర్చించి ఈ సమస్యను పరిష్కరిస్తాను. నేషనల్హైవే వద్ద అండర్‌బ్రిడ్జి కోసం కృషి చేస్తాను. గాంధారీ ఖిల్లా మైసమ్మ ఆలయానికి రోడ్డు, లైటింగ్సౌకర్యం కల్పిస్తాం” అని తెలిపారు. చెన్నూరు నియోజకవర్గంలో రెండు కొత్త సబ్ స్టేషన్లు ఏర్పాటు చేశామని, త్వరలో మరో మూడు ఏర్పాటు చేస్తామన్నారు. కాగా, కోటపల్లి మండలం బావనపల్లిలో రెండు రోజుల కింద గోడ కూలి మృతి చెందిన రెడ్డి మధునయ్య,సెగం తిరుపతి కుటుంబాలను మంత్రి పరామర్శించారు. బాధిత కుటుంబాలను ప్రభుత్వ పరంగా ఆదుకుంటానని హామీ ఇచ్చారు.