నియోజకవర్గాల పునర్విభజనకు మేం వ్యతిరేకం : కేటీఆర్

నియోజకవర్గాల పునర్విభజనకు మేం వ్యతిరేకం : కేటీఆర్
  • దక్షిణాది రాష్ట్రాలకు అన్యాయం జరుగుతది
  • అసెంబ్లీ సెగ్మెంట్ల పునర్విభజన జరగాలి
  • హిందీని బలవంతంగా రుద్దుతామంటే ఊకోం
  • జైపూర్ లో నిర్వహించిన ‘టాక్ జర్నలిజం’ డిబేట్​కు హాజరు

హైదరాబాద్, వెలుగు: నియోజకవర్గాల పునర్విభజనతో దక్షిణాది రాష్ట్రాలకు తీవ్ర అన్యాయం జరుగుతుందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. జనాభా నియంత్రణను అద్భుతంగా పాటించిన దక్షిణాది రాష్ట్రాలకు నియోజకవర్గ పునర్విభజనలో తీవ్ర నష్టం జరగొద్దని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. నార్త్ ఇండియా ఎంపీల సంఖ్య ఆధారంగా ఏర్పడే కేంద్ర ప్రభుత్వం.. సౌత్ ఇండియా ప్రయోజనాలు, ఆకాంక్షలకు అనుగుణంగా పని చేసే అవకాశం ఉండదని పేర్కొన్నారు. యూపీ లాంటి ఒక్క రాష్ట్రం.. కేంద్ర ప్రభుత్వ ఏర్పాటులో కీలకంగా మారడం సమాఖ్య వ్యవస్థకు మంచిదికాదని ఆందోళన వ్యక్తం చేశారు. జైపూర్​లో జరుగుతున్న ‘టాక్ జర్నలిజం’ 9వ ఎడిషన్ డిబేట్ లో ఆయన పాల్గొని మాట్లాడారు. 

సౌత్ స్టేట్స్​కు అన్యాయం జరుగుతది

ప్రజాస్వామ్యంలో ప్రజలకు ముందుగా అందుబాటులో ఉండేది ఎమ్మెల్యేనే అని, అందుకే అసెంబ్లీ స్థానాలు పెంచాలన్నది తమ పార్టీ అభిప్రాయమని కేటీఆర్ అన్నారు. ‘‘ఇప్పుడున్న ఎంపీ స్థానాలను అలాగే కొనసాగించాలి. ప్రధానమంత్రిని నార్త్ ఇండియా నిర్ణయించాల్సి వస్తే.. తర్వాత ఆ ప్రభుత్వం ఆ ప్రాంతవాసుల ప్రయోజనాలకే అనుకూలంగా నిర్ణయం తీసుకుంటుంది. అప్పుడు సౌత్ స్టేట్స్​కు అన్యాయం జరుగుతది. జాతీయ భాషగా హిందీని బలవంతంగా రుద్దుతామంటే చూస్తూ ఊరుకునేది లేదు. దేశానికి ఒకే నేషనల్ లాంగ్వేజ్ ఉండాల్సిన అవసరం లేదు. మన దేశంలో ప్రతి 250 కిలో మీటర్లకు భాషా, సంస్కృతి, ఆహారం, వేషధారణ మారుతది’’అని కేటీఆర్ అన్నారు. 

బీహార్​లో ఓటర్ల సవరణ సరికాదు

దేశంలో  అర్హత కలిగిన ఏ ఒక్క వ్యక్తి కూడా తన ఓటు హక్కు కోల్పోవద్దని కేటీఆర్ అన్నారు. “బీహార్ లో జరుగుతున్న ఎన్నికల ఓటర్ల సవరణపై తీవ్ర విమర్శలు వినిపిస్తున్నాయి. ఎన్నికల కమిషన్ ఏం చేస్తున్నది?  దేశంలోని మిగతా రాష్ట్రాలపై దీని ప్రభావం ఉంటది. ఎన్నికల్లో గెలవడం కోసం ప్రజల మధ్య విభేదాలు సృష్టించడం సరికాదు. భారతీయత మాత్రమే దేశంలోని కోట్లాది మంది ప్రజలను కలిపి ఉంచుతది. ముందు దేశం.. ఆ తర్వాతే ప్రాంతం, కులం, మతం’’అని కేటీఆర్ అన్నారు.