రాకెట్ స్పీడ్లో పెరిగిపోతున్న కుబేరుల సంపద.. పేదోళ్ల జీవితాల్లో కనిపించని మార్పు.. సంచలన రిపోర్ట్

 రాకెట్ స్పీడ్లో పెరిగిపోతున్న కుబేరుల సంపద.. పేదోళ్ల జీవితాల్లో కనిపించని మార్పు.. సంచలన రిపోర్ట్
  • కుబేరుల సంపద 62 %  జంప్​
  • మనదేశ జనాభాలో వీరి వాటా ఒకశాతమే!
  • జీ20 ప్రెసిడెన్సీ స్టడీ రిపోర్ట్​ వెల్లడి

న్యూఢిల్లీ: పేదోళ్ల సంపద పెరగడం లేదు. పెద్దోళ్ల సంపదేమో రాకెట్​స్పీడ్​తో దూసుకెళ్తోంది.  మధ్యతరగతి ఆదాయాలు అత్యల్పంగా పెరుగుతున్నాయి. ప్రపంచవ్యాప్తంగా ఇదే పరిస్థితి కనిపిస్తోంది. మనదేశం ఇందుకు మినహాయింపు కాదు. దక్షిణాఫ్రికా జీ20 ప్రెసిడెన్సీ స్టడీ రిపోర్ట్​ ఈ చేదు నిజాలను బయటపెట్టింది. 

దీని ప్రకారం భారతదేశంలోని ఒకశాతం మంది అత్యంత ధనికుల సంపద 2000 నుంచి 2023 మధ్య 62 శాతం పెరిగింది. పేదల బతుకులు మరింత దిగజారాయి. ప్రపంచ అసమానత  ఆందోళనకర స్థాయికి చేరుకుందని, ఇది ప్రజాస్వామ్యం, ఆర్థిక స్థిరత్వం, వాతావరణ పురోగతికి ముప్పు అని నోబెల్ గ్రహీత జోసెఫ్ స్టిగ్లిట్జ్ నేతృత్వంలోని ఈ స్టడీ హెచ్చరించింది. 

ఈ రిపోర్ట్​లోని ముఖ్యాంశాలు:

ప్రపంచవ్యాప్తంగా మొదటిస్థానంలో ఉన్న ఒక శాతం మంది, 2000 నుంచి 2024 మధ్య సృష్టించిన కొత్త సంపదలో 41 శాతం వాటా దక్కించుకున్నారు. మొత్తం జనాభాలో దిగువ సగం మందికి ఒక శాతం వాటా మాత్రమే లభించింది.
    
చైనా, భారతదేశం వంటి అధిక జనాభా గల కొన్ని దేశాల్లో తలసరి ఆదాయాలు పెరగటం వల్ల, దేశాల మధ్య అసమానతలు తగ్గినట్లుగా కనిపించింది. దీనివల్ల ప్రపంచ జీడీపీలో అధిక ఆదాయ దేశాల వాటా కొద్దిగా తగ్గింది.
    
2000 నుంచి 2023 మధ్య, ప్రపంచ జనాభాలో 74 శాతం ఉన్న సగం కంటే ఎక్కువ దేశాల్లో,  ఒకశాతం మంది ధనికులు తమ సంపదను భారీగా పెంచుకున్నారు. ఈ కాలంలో భారతదేశంలోని ఒకశాతం మంది ధనికుల సంపద 62 శాతం పెరిగింది. చైనాలో 54 శాతం పెరిగింది.
    
ప్రపంచవ్యాప్తంగా పేదరికాన్ని అరికట్టడం 2‌‌‌‌‌‌‌‌‌‌‌‌000 నుంచి దాదాపు నిలిచిపోయింది. కొన్ని ప్రాంతాల్లో ఇది పెరిగింది. 230 కోట్ల మంది తీవ్రమైన ఆహార కొరతను ఎదుర్కొంటున్నారు. ఇది 2019 నుంచి 33.5 కోట్లు పెరిగింది. ప్రపంచ జనాభాలో సగం మందికి ఇప్పటికీ అవసరమైన ఆరోగ్య సేవలు అందడం లేదు. 130 కోట్ల మంది వైద్య ఖర్చుల కారణంగా పేదరికంలోకి వెళ్లారు.
    
‘‘అసమానతలు ఆందోళనకరస్థాయికి చేరాయి. ఈ సమస్యను రాజకీయ సంకల్పంతో పరిష్కరింవచ్చు. ఇందులో అంతర్జాతీయ స్థాయిలో సమన్వయం అవసరం. ఈ విషయంలో జీ20 కీలక పాత్ర పోషిస్తుంది’’ అని రిపోర్ట్​ పేర్కొంది.

ఎందుకిలా ?

కార్పొరేట్ రంగానికి ఎక్కువ స్వేచ్ఛను ఇవ్వడం, ట్రేడ్ యూనియన్లు వంటి కార్మిక సంస్థల బేరమాడే శక్తిని తగ్గించడం, కార్మిక మార్కెట్ నిబంధనలను సడలించడం వంటివి వేతనాల పెరుగుదలను అణచివేస్తున్నాయి. సంపదలో అసమానతను పెంచుతున్నాయి.

గ్లోబలైజేషన్ ప్రభావం ఒక్కో దేశంలో ఒక్కోరకంగా ఉంది. కొన్ని వర్గాలు దీని నుంచి అధిక ప్రయోజనం పొందగా, తక్కువ నైపుణ్యాలు ఉన్న కార్మికులు తీవ్రంగా నష్టపోయారు. వీరి జీతాలు పెరగడం లేదు. 
    
ఆటోమేషన్, డిజిటలైజేషన్ వంటి సాంకేతిక మార్పులు అధిక నైపుణ్యాలు ఉన్న కార్మికులకు డిమాండ్ పెంచాయి. తక్కువ నైపుణ్యాలు ఉన్న కార్మికులకు డిమాండ్ తగ్గించాయి. ఇది వేతనాల మధ్య తేడాను పెంచింది.
    
పన్ను రేట్లను తగ్గించడం, ముఖ్యంగా సంపన్నులకు, కార్పొరేట్లకు తగ్గించడం అసమానతను పెంచింది. ఆర్థిక సంక్షోభాలకు ప్రతిస్పందనగా అమలు చేసిన కొన్ని పొదుపు చర్యలు కూడా సామాజిక భద్రతను బలహీనపరిచాయి.
    
వారసత్వ సంపద తరతరాలుగా కొందరి చేతుల్లోనే కేంద్రీకృతం అవుతోంది. వారసత్వ పన్నులు లేకపోవడం లేదా తక్కువగా ఉండటం వీరి ఆస్తులు పెరుగుతూనే ఉన్నాయి.