గాంధీలో ఫోరెన్సిక్ పీజీ చేస్తూ.. ఇదేం పాడు పని.. యువతను మత్తులో దించుతున్న డాక్టర్ అరెస్ట్

గాంధీలో ఫోరెన్సిక్ పీజీ చేస్తూ.. ఇదేం పాడు పని.. యువతను మత్తులో దించుతున్న డాక్టర్ అరెస్ట్
  • సరదాగా మొదలుపెట్టి, బానిసగా మారి.. అమ్మకందారుగా అవతారం 
  • డ్రగ్స్ తెచ్చిస్తూ, అమ్మించిన ముగ్గురు ఫ్రెండ్స్
  • అతడి ఇంట్లో రూ. 3 లక్షల విలువైన డ్రగ్స్ సీజ్ 
  • మిగతా ముగ్గురు నిందితుల కోసం గాలింపు   
  • హైదరాబాద్ ముషీరాబాద్​లో ఘటన


ముషీరాబాద్, వెలుగు: హైదరాబాద్​లోని ముషీరాబాద్ ఏరియాలో ఉంటున్న ఓ డాక్టర్ ఇంట్లో డ్రగ్స్ దొరికాయి. సరదాగా డ్రగ్స్ ​వాడడం మొదలుపెట్టిన ఆయన​తర్వాత వాటికి బానిసగా మారాడు. చివరికి డబ్బులు సరిపోకపోవడంతో అమ్మకందారు అవతారం ఎత్తాడు. ముషీరాబాద్ బాకారంలో ఉంటున్న డాక్టర్​జోసెఫ్ జాన్ పాల్(29) గాంధీ దవాఖానలో ఎంబీబీఎస్ ​పూర్తి చేసి ఫోరెన్సిక్ ​సైన్స్​లో పీజీ చేస్తున్నాడు. కొంతకాలం కింద సరదాగా డ్రగ్స్​ తీసుకోవడం మొదలుపెట్టాడు. 

క్రమంగా దానికి అలవాటు పడ్డాడు. చివరకు రోజూ డ్రగ్స్ తీసుకోకపోతే ఉండలేని స్థితికి వచ్చాడు. ప్రతి రోజూ డ్రగ్స్ కొనడానికి డబ్బులు సరిపోకపోవడంతో అమ్మకందారుగా మారి, ఇంట్లోనే డ్రగ్స్ అమ్మడం మొదలుపెట్టాడు. అతడికి  ప్రమోద్, సందీప్, శరత్ అనే స్నేహితులు కూడా తోడయ్యారు. వీరు ఢిల్లీ, బెంగళూరు నుంచి డ్రగ్స్ తీసుకువచ్చి జాన్ పాల్ ఇంట్లో ఉంచేవారు. డ్రగ్స్​ కోసం ఎవరు వస్తారు? ఎవరికి ఎంత క్వాంటిటీ ఇవ్వాలన్నది జాన్​ పాల్​కు వీరే చెప్పేవారు. 

ఇలా డ్రగ్స్ అమ్మినందుకు అతడికి డ్రగ్స్ తో పాటు లాభాల్లో వాటా ముట్టజెప్పేవారు. ఈ డ్రగ్స్ దందా గురించి తెలుసుకున్న ఎక్సైజ్ టాస్క్ ఫోర్స్ బీ టీం అధికారులు జాన్ పాల్ ​ఇంట్లో తనిఖీలు నిర్వహించి, రూ.3 లక్షల విలువైన 1.32 గ్రాముల కొకైన్, 26.95 గ్రాముల ఓజీ కుష్, 6.21 గ్రాముల ఎండీఎంఏ, 15 ఎల్ఎస్​డీ బ్లాస్ట్స్, 5.80 గ్రాముల గుమ్మూస్, 8 మిల్లీగ్రాముల హాష్​ ఆయిల్​ స్వాధీనం చేసుకున్నారు. జాన్ పాల్​ను అరెస్ట్ చేశారు. డ్రగ్స్ అందజేస్తున్న మిగతా ముగ్గురి కోసం పోలీసులు గాలిస్తున్నారు.