
కరీంనగర్: రాష్ట్రంలో వడ్ల సమస్యకు కారణమెవరో రైతులకు తెలుసని బీజేపీ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ అన్నారు. ధాన్యం కొనుగోలు విషయంలో కేసీఆర్ సర్కారు తొండి చేస్తున్న విషయం వారికి అర్థమవుతోందని చెప్పారు. కరీంనగర్లో జరిగిన కిసాన్ మోర్చా రైతు చైతన్య సదస్సులో మాట్లాడిన ఈటల.. రైతులపై మమకారం లేని కేసీఆర్.. మోడీని విమర్శిస్తున్నాడని మండిపడ్డారు. సమైక్య రాష్ట్రంగా ఉన్నప్పుడే రాష్ట్రమే ధాన్యం సేకరించే విధానం వచ్చిందని, కానీ ఇప్పుడు కేసీఆర్ పంజాబ్ విధానాన్ని అమలు చేయాలని బెదిరిస్తున్నాడని విమర్శించారు. ఎండాకాలంలో ముడి బియ్యం ఇస్తామని రాసిచ్చిన ఆయన.. ఇప్పుడు తొండి చేస్తున్నాడని ఈటల విమర్శించారు.
ఆర్భాటంగా రైతు వేదికలు ప్రారంభించి వాటికి తాళాలు వేసిన ఘనత సీఎం కేసీఆర్ సొంతమని ఈటల రాజేందర్ సటైర్ వేశారు. రైతు వేదికల్లో పరిశోధనల మాట పక్కనబెడితే, రైతు సమావేశాలు కూడా జరగడం లేదని అన్నారు. కోట్లు ఖర్చు పెట్టినా తనను ఓడించలేకపోయిన కేసీఆర్కు హుజూరాబాద్ ఎన్నికల తర్వాత భయం పట్టుకుందని అన్నారు. కేసీఆర్ ను ఓడించాలని ప్రజలు కంకణం కట్టుకున్నారన్న విషయం తెలిసే ఓటమి ఎరుగనని చెప్పుకునే కేసీఆర్.. ఇప్పుడు పీకేను పెట్టుకున్నడని చురకలంటించారు.
పంట విధానాలపై కేసీఆర్కు విజన్ లేదన్న ఈటల రాజేందర్ విమర్శించారు. పుష్కలంగా నీరున్నా రైతులను పంట వేయనీయని పాపం కేసీఆర్దేనని అన్నారు. ఒకవైపు లక్షల కోట్లతో ప్రాజెక్టులు కట్టానని గొప్పలు చెప్పుకుంటూ మరోవైపు వరి వేస్తే ఉరే అని అన్నదాతలను బెదిరిస్తున్నాడని మండిపడ్డారు. 30లక్షల ఎకరాల పంటనే కొనలేని దద్దమ్మ రేపు కోటి ఎకరాల పంటను ఎలా కొంటాడని ఈటల ప్రశ్నించారు. ఏకకాలంలో లక్ష రుణమాఫీ చేయడంతో పాటు పంట విధానాలపై ప్రణాళికలు సిద్ధం చేసి శ్వేతపత్రం విడుదల చేయాలని డిమాండ్ చేశారు.