ఎంక్వైరీ చెల్లనప్పుడు బర్తరఫ్ చెల్లుతదా?

ఎంక్వైరీ చెల్లనప్పుడు బర్తరఫ్ చెల్లుతదా?
  • ఈటల వ్యవహారంపై రాజకీయ వర్గాల్లో చర్చ
  • భూములపై కలెక్టర్ విచారణ చెల్లదన్న హైకోర్టు
  • వేటుకు సాకు కోసం అధికారులనూ బలి చేశారంటూ కొందరు నేతల్లో డిస్కషన్

హైదరాబాద్/కరీంనగర్, వెలుగు:మాజీ మంత్రి ఈటల రాజేందర్ భూ కబ్జా ఆరోపణల వ్యవహారం రోజుకో మలుపు తిరుగుతోంది. ఎవరూ ఊహించని విధంగా సీఎం కేసీఆర్‌‌‌‌కు లెటర్, ఆ వెంటనే కలెక్టర్‌‌‌‌కు విచారణ ఆదేశాలు క్షణాల్లో జరిగిపోవడం ఒక ఎత్తయితే.. 24 గంటల్లోనే ఎంక్వైరీ చేసేసి, రిపోర్ట్ సీఎంకు అందించడం అతి పెద్ద ట్విస్ట్. ఈటల కబ్జాకోరు అనడానికి ఆ రిపోర్టునే ఆధారంగా చెప్పే ప్రయత్నం చేస్తూ ప్రభుత్వం ఆయనను కేబినెట్‌‌ నుంచి బర్తరఫ్ చేసింది. కానీ మంగళవారం హైకోర్టులో జరిగిన విచారణలో అసలు కలెక్టర్ ఇచ్చిన ఆ ‘హైస్పీడ్ రిపోర్ట్’ చెల్లదని న్యాయమూర్తులు స్పష్టం చేశారు. మరి ఇప్పుడు ఆ రిపోర్టును అడ్డంపెట్టుకుని ఈటలను బర్తరఫ్ చేయడం ఎలా చెల్లుతుందంటూ రాజకీయ వర్గాల్లో చర్చ నడుస్తోంది. ఈటలను తప్పించడం వెనుక భూ కబ్జా కారణం కాదని, రాజకీయ విబేధాలు, కక్షలతోనే కేసీఆర్ ఆ నిర్ణయం తీసుకున్నట్టు తెలియట్లేదా అన్న మాటలు కొందరు నేతల్లో వినిపిస్తున్నాయి. చాలా కాలం నుంచి ఈటలపై వేటుకు సీఎం కేసీఆర్ ప్లాన్ చేస్తున్నారని, సరైన టైమ్‌‌ కోసం ఎదురుచూసి కరెక్ట్‌‌గా మున్సిపల్ ఎన్నికలు ముగియగానే స్కెచ్ అమలు చేశారని టీఆర్ఎస్ వర్గాల్లోనే డిస్కషన్ జరుగుతోంది. అప్పుడప్పుడూ అసమ్మతి వినిపిస్తున్న ఈటలను పార్టీ నుంచి వెళ్లగొట్టేందుకు భూ కబ్జాలనే సరైన సాకుగా కేసీఆర్ భావించి, కరోనా టైమ్‌‌లో హుటాహుటిన రిపోర్ట్ తెప్పించారని ఆ పార్టీ నేతలే చర్చించుకుంటున్నారు.

రాజకీయ రచ్చలోకి లాగడంపై ఆఫీసర్ల ఆవేదన
ఈటలను బర్తరఫ్ చేసేందుకు సాకుగా వాడుకోవడానికి కబ్జా ఆరోపణలపై రిపోర్ట్ స్పీడ్‌‌గా తెప్పించుకున్నారని కొందరు రాజకీయ నేతలతో పాటు, సీనియర్ అధికారులు కూడా అన్నారు. వారు అనుకున్నట్టుగా రిపోర్ట్ వచ్చేలా అధికారులపై ఒత్తిడి చేసి, వారిని బలి చేశారని అంటున్నారు. ప్రొసీజర్ ఫాలో కాకపోవడంపై హైకోర్టు అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేసిన విషయాన్ని ప్రస్తావిస్తున్నారు. నాయకులు తమ రాజకీయ కక్ష సాధింపుల కోసం తమను ఈ రచ్చలోకి లాగడం ఏంటని సీనియర్ అధికారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.  ఈటల భూముల వ్యవహారంలో నివేదిక ఇవ్వడానికి కనీసం నాలుగు రోజుల టైమ్‌‌ పడుతుందని చెబితే ప్రగతి భవన్ వర్గాలు తమపై సీరియస్ అయ్యాయని వాపోతున్నారు. చివరికి కోర్టు ముందు తమను దోషులుగా చేశారని అంటున్నారు.

ఈటలకు అండగా అనుచరులు
ఈటలకు అండగా తామున్నామంటూ అనుచరులు పెద్దఎత్తున తరలివస్తున్నారు. సోమవారం శామీర్ పేట నుంచి అనుచరులతో ఈటల హుజురాబాద్ లోని క్యాంపు ఆఫీస్​కు వచ్చారు. రాత్రి నుంచే ఈటల రాజేందర్ క్యాంపు ఆఫీస్​దగ్గర‍ అభిమానుల హడావుడి మొదలైంది. శామీర్ పేటలో నిర్వహించిన ప్రెస్ మీట్ లోనూ నియోజకవర్గ ప్రజల మెజార్టీ అభిప్రాయం మేరకు తన నిర్ణయాన్ని ప్రకటిస్తానని ఈటల చెప్పారు. మంగళవారం ఉదయం నుంచి సాయంత్రం వరకు వచ్చిన అభిమానులు, పార్టీ కార్యకర్తలు, ముఖ్య నేతలతో మాట్లాడారు. ఆయనను కలిసినవారిలో ముఖ్యంగా హుజురాబాద్, జమ్మికుంట నుంచి మున్సిపల్ ఛైర్మన్లు, కౌన్సిలర్లు, వివిధ గ్రామాల సర్పంచులు, ఇతర ప్రజాప్రతినిధులు ఉన్నారు. మచ్చలేని నాయకుడిని ఇలా అన్యాయంగా ఇరికించి బదనామ్ చేశారని, అయినా ఇంకా పార్టీలో ఉండి  ఏంలాభం, . ఎమ్మెల్యే పదవికి కూడా రాజీనామా చేసి బయటకు రావాలని కొందరు చెప్పారు. బయటకు వచ్చి బై ఎలక్షన్లలో పోటీ చేసి సత్తా చాటాలని చెప్పినట్లు తెలుస్తోంది. పార్టీ ఏమైనా కేసీఆర్  సొత్తా..  పార్టీకి ఎంతో సేవ చేసినవ్.. రాజీనామా చేయొద్దు.. ఇట్లనే ఉండి కొట్లాడాలే అని  ఇంకొక వర్గంవారు అన్నారు. ఈటల వారు చెప్పిందల్లా విన్నారు. కానీ ఎవరికీ ఎలాంటి సమాధానాలు ఇవ్వలేదు. మంగళవారం ఉదయాన్నే ఎన్ఆర్ఐలతో మాట్లాడారు. పూర్తిగా తప్పుడు ఆరోపణలతో తనను బయటికి పంపించారని చెప్పుకొచ్చారు. ఈటలకి వారంతా మద్దతుగా నిలిచారు.  ఒకటి రెండు రోజుల్లో ఈటల తన నిర్ణయాన్ని ప్రకటించే అవకాశం ఉంది. 

తెగ‌‌దెంపులు చేసుకోవాలె: టీఆర్ఎస్‌‌లోని ఈటల అనుచరులకు పార్టీ పెద్దల ఫోన్లు
టీఆర్ఎస్ లో ఉన్న మాజీ మంత్రి ఈటల రాజేందర్ అనుచరులకు పార్టీ పెద్దలు ఎర వేస్తున్నారు. వారికి ఫోన్ చేసి ఈటలతో రాజకీయ బంధాలను తెంచుకోవాలని చెప్తున్నారు. మంత్రి వర్గం నుంచి ఈటలను బర్తరఫ్ చేసిన తర్వాత ఆయన నియోజకవర్గం హుజూరాబాద్ నుంచి పెద్దఎత్తున లీడర్లు, కార్యకర్తలు శామీర్‌‌పేటకు తరలివచ్చారు. ఆయన నియోజకవర్గానికి వెళ్తుంటే భారీ స్థాయిలో కాన్వాయ్ ఏర్పాటు చేశారు. దీంతో నియోజకవర్గంలోని పార్టీ ప్రజాప్రతినిధులకు ప్రగతి భవన్ నుంచి ఫోన్లు వెళ్లినట్టు చర్చ జరుగుతోంది. ఇప్పట్నుంచి ఈటల వెంట ఉండొద్దని వారికి కౌన్సెలింగ్ ఇచ్చినట్టు తెలుస్తోంది.

త్వరలో ఉమ్మడి జిల్లా లీడర్ల టూర్ 
ఉమ్మడి కరీంనగర్ జిల్లా టీఆర్ఎస్ లీడర్లు హుజూరాబాద్ నియోజకవర్గంలోని ప్రజా ప్రతినిధులు, కేడర్ తో త్వరలో ప్రత్యేక సమావేశం నిర్వహించనున్నారు. నియోజకవర్గానికి పార్టీ ఇన్ చార్జిని నియమించే చాన్స్ ఉంది. ఆ ఇన్‌‌చార్జినే సెగ్మెంట్‌‌ కు సంబంధించిన ప్రభుత్వ, పార్టీ కార్యక్రమాలను కో ఆర్డినేట్ చేయనున్నారు.

చట్టాలను పక్కన పెట్టేశారు
ఏ ల్యాండ్ డిస్ప్యూట్​లోనైనా రెవెన్యూ అధికారులు విచారణ ప్రారంభించేటప్పుడు ఆరోపణలు ఎదుర్కొంటున్న వ్యక్తులకు వారం ముందే కచ్చితంగా నోటీసులు ఇవ్వాలి. రెవెన్యూ శాఖలో అమలులో ఉన్న పీఓటీ, సర్వే అండ్ సెటిల్మెంట్ చట్టాలు ఇదే చెబుతున్నాయి. కానీ జమున హ్యాచరిస్ విషయంలో రెవెన్యూ అధికారులు ఇవేం పాటించలేదు. రాష్ట్రంలో సుమారు 25 లక్షల ఎకరాల అసైన్డ్ ల్యాండ్స్​కు సంబంధించి ఇలాంటి సమస్యలే అనేకం ఉన్నాయి. ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే వీళ్లందరి సమస్యను పరిష్కరించవచ్చు. ఈటల రాజేందర్ బర్తరఫ్ విషయానికొస్తే.. అది సీఎం విచక్షణాధికారానికి సంబంధించినది. ఆయనను తొలగించాలనుకుంటే సీఎం ఎలాగైనా తొలగించవచ్చు. కానీ ఒక కాజ్ కోసం చూసినట్లు కనిపిస్తోంది. -ఎం.సునీల్ కుమార్, న్యాయ నిపుణులు